పెరిగే భారం ఎంతంటే!

ABN , First Publish Date - 2022-10-01T06:49:36+05:30 IST

మంచి క్రెడిట్‌ స్కోర్‌ ఉండే ఖాతాదారులకు బ్యాంకులు ప్రస్తుతం ఏడేళ్ల కాల పరిమితితో 15 శాతం వడ్డీకి వ్యక్తిగత రుణాలు ఇస్తున్నాయి.

పెరిగే భారం ఎంతంటే!

రెపో రేటు పెంపు ప్రభావం గృహ, ఆటో, వ్యక్తిగత రుణాలపై పెను ప్రభావం చూపించనుంది. ఆర్‌బీఐ ప్రకటన వెలువడిన వెంటనే ఎస్‌బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా.. రెపో అనుసంధానిత రేటు (ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌)ను 50 బేసిస్‌ పాయింట్లు పెంచగా హెచ్‌డీఎఫ్‌సీ కూడా కనీస వడ్డీ రేటు మరో అర శాతం పెంచింది. మిగతా బ్యాంకులు త్వరలో ఇదే బాటలో నడవనున్నాయి. దీంతో నెలవారీ వాయిదాల భారం మరింత పెరగనుంది. ఈ భారం ఇలా ఉంటుందని మార్కెట్‌ వర్గాల అంచనా. 


గృహ రుణాలు 

ప్రస్తుతం మంచి క్రెడిట్‌ స్కోర్‌ ఉన్న వ్యక్తులకు బ్యాంకులు, గృహ ఫైనాన్స్‌ కంపెనీలు 8 శాతం వడ్డీకే గృహ రుణాలు ఇస్తున్నాయి. ఈ వడ్డీ రేటుతో ఒక వ్యక్తి 20 ఏళ్లలో చెల్లించేలా రూ.30 లక్షల హోమ్‌ లోన్‌ తీసుకున్నాడనుకుందాం. దీనిపై నెలనెలా ప్రస్తుతం చెల్లించే ఈఎంఐ రూ.26,035. ఆర్‌బీఐ నిర్ణయంతో గృహ రుణాలపై కనీస వడ్డీ రేటు మరో అర శాతం పెరిగి 8.5 శాతానికి చేరనుంది. దాంతో ఈ రుణాలు తీసుకున్న వ్యక్తుల ఈఎంఐల భారమూ రూ.957 పెరిగి రూ.26,992కు చేరుతుంది. అంటే ప్రతి రూ.లక్ష గృహ రుణంపై ఈఎంఐ భారం రూ.31.90 పెరుగుతుంది.


ఆటో లోన్లు

ఆటో రుణాలూ మరింత ప్రియం కానున్నాయి. ప్రస్తుతం బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు ఏడేళ్ల కాలపరిమితి ఉండే ఆటో రుణాలపై 11 శాతం వడ్డీ వసూలు చేస్తున్నాయి. ఈ లెక్కన ఒక వ్యక్తి రూ.8 లక్షల ఆటో లోన్‌ తీసుకుంటే, దానిపై నెలకు రూ.13,698 చొప్పున ఈఎంఐ చెల్లిస్తున్నారు. ఆర్‌బీఐ తాజా నిర్ణయంతో ఈ రుణాలపైనా కనీస వడ్డీ రేటు 11.5 శాతానికి చేరనుంది. దీంతో ఈఎంఐల భారం నెలకు రూ.211 పెరిగి రూ.13,909కి చేరనుంది.


వ్యక్తిగత రుణాలు 

మంచి క్రెడిట్‌ స్కోర్‌ ఉండే ఖాతాదారులకు బ్యాంకులు ప్రస్తుతం ఏడేళ్ల కాల పరిమితితో 15 శాతం వడ్డీకి వ్యక్తిగత రుణాలు ఇస్తున్నాయి.ఈ లెక్కన రూ.5 లక్షల వ్యక్తిగత రుణం తీసుకుంటే ప్రస్తుతం నెలనెలా చెల్లించాల్సిన ఈఎంఐ రూ.11,895. రెపో పెంపుతో ఈ రుణాల కనీస వడ్డీ రేటు 15.5 శాతానికి చేరి.. ఈఎంఐ భారం రూ.132 పెరిగి రూ.12,022కు చేరనుంది. 

Updated Date - 2022-10-01T06:49:36+05:30 IST