‘హనుమకొండ’, ‘వరంగల్‌’ జిల్లాల ఆవిర్భావం

ABN , First Publish Date - 2021-08-13T06:12:40+05:30 IST

‘హనుమకొండ’, ‘వరంగల్‌’ జిల్లాల ఆవిర్భావం

‘హనుమకొండ’, ‘వరంగల్‌’ జిల్లాల ఆవిర్భావం

వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌ జిల్లాలకు కొత్త రూపు

పలు మార్పులతో తుది నోటిఫికేషన్‌ జారీ

శాయంపేట, ఆత్మకూరు మండలాలూ హనుమకొండలోకే...

హనుమకొండ జిల్లాలో 14 మండలాలు...

వరంగల్‌ జిల్లాలో 13 మండలాలు


హన్మకొండ /వరంగల్‌ రూరల్‌, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి) : వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌ జిల్లాల పేర్ల మార్పును ఖరారు చేస్తూ ప్రభుత్వం గురువారం తుది నోటిఫికేషన్‌ను జారీ చేసింది. అయితే మండలాలకు సంబంధించి ప్రాథమిక నోటిఫికేషన్‌లో పేర్కొన్నట్టు కాకుండా మరిన్ని మార్పులు, చేర్పులు జరిగాయి. వరంగల్‌ అర్బన్‌ జిల్లాను హనుమకొండగా జిల్లాగా, వరంగల్‌ రూరల్‌ జిల్లాను వరంగల్‌ జిల్లాగా పేరు మార్చుతూ గత నెల 12న ప్రభుత్వం ప్రాథమిక ఉత్తర్వులను జారీ చేసిన విషయం విదితమే.  ప్రస్తుత వరంగల్‌ రూరల్‌ జిల్లాలో 16 మండలాలు ఉండగా, పేరు మార్పుతో వరంగల్‌గా మారిన జిల్లాలో 15 మండలాలు, అలాగే అర్బన్‌ జిల్లాలో 11 మండలాలు ఉండగా పేరు మార్పుతో హనుమకొండ(హన్మకొండ)గా మారిన జిల్లాలో 12 మండలాలు ఉండనున్నట్టు తొలి నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. 


ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణకు 30 రోజుల గడువు ఇచ్చింది.  గడువు ఈనెల 11వ తేదీతో ముగిసింది. అభ్యంతరాలను అదేరోజు ఇద్దరు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌తో పాటు కలెక్టర్‌, ఇతర అధికారులు పరిశీలించారు. ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వానికి నివేదించారు. ఈ మేరకు మండలాల విషయంలో మరోసారి మార్పులు చేర్పులు చేసింది. తొలి నోటిఫికేషన్‌లో మండలాలను ప్రాతిపదికగా తీసుకోగా తుది ఉత్తర్వుల్లో రెవెన్యూ డివిజన్లను ప్రామాణికంగా ఎంచుకున్నారు. ఒక రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ఉన్న మండలాలన్నిటినీ ఒకే జిల్లాలో ఉండేట్టు సవరణ చేశారు.


మార్పులు–చేర్పులు

హనుమకొండ జిల్లాలో తొలుత 12 మండలాలను ప్రకటించగా, తాజాగా  వరంగల్‌ జిల్లా నుంచి అదనంగా మరో రెండు మండలాలు ఆత్మకూరు, శాయంపేటను ఇందులో కలుపుతూ తుది నోటిఫికేషన్‌ జారీ చేశారు.  దీంతో హనుమకొండ జిల్లా పరిధిలో మొత్తం మండలాల సంఖ్య 14కు పెరిగింది. ఇక తొలి నోటిఫికేషన్‌లో వరంగల్‌ జిల్లాలో 15 మండలాలు ఉంటాయని పేర్కొనగా, రెండు మండలాలు తొలగించడంతో ఈ జిల్లాలో మొత్తం మండలాల సంఖ్య 13కు తగ్గింది. ఈ మార్పులు, చేర్పులతో రెండు జిల్లాల భౌగోళిక స్వరూపం పూర్తిగా మారిపోయింది. జనాభా, పంచాయతీలు, రెవెన్యూ డివిజన్ల విషయంలోనూ అలాగే పట్టణ ప్రాంతంగానూ రెండు జిల్లాలు ఇప్పుడు దాదాపు సమానంగా మారాయి.


హనుమకొండ జిల్లా

వరంగల్‌ అర్బన్‌ జిల్లా నుంచి హనుమకొండగా జిల్లాగా మారిన ఈ జిల్లాలో హనుమకొండ, కాజీపేట, ఐనవోలు, హసన్‌పర్తి, వేలేరు, ధర్మసాగర్‌, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపూర్‌తో పాటు వరంగల్‌గా మారిన పూర్వపు వరంగల్‌ రూరల్‌ జిల్లా నుంచి కొత్తగా పరకాల, నడికూడ, దామెర, ఆత్మకూరు, శాయంపేట మండలాలు చేరాయి. ఈ జిల్లా పరిధిలో హనుమకొండ, పరకాల రెవెన్యూ డివిజన్లు ఉంటాయి. 


వరంగల్‌ జిల్లా

వరంగల్‌ రూరల్‌ జిల్లా నుంచి వరంగల్‌ జిల్లాగా మారిన ఈ జిల్లాలో సంగెం, గీసుకొండ, వర్ధన్నపేట, పర్వతగిరి, రాయపర్తి నర్సంపేట, చెన్నారావుపేట, నల్లబెల్లి, దుగ్గొండి, ఖానాపురం, నెక్కొండతో పాటు కొత్తగా హనుమకొండగా మారిన పూర్వపు వరంగల్‌ అర్బన్‌ జిల్లా నుంచి  వరంగల్‌, ఖిలా వరంగల్‌ మండలాలు వచ్చి చేరాయి. వరంగల్‌ జిల్లాలో వరంగల్‌, నర్సంపేట రెవెన్యూ డివిజన్లు ఉంటాయి. 


ప్రజాభీష్టం మేరకు..

ప్రజాభీష్టానికి ప్రభుత్వం తలొగ్గినట్టు కనిపిస్తోంది. ప్రజాప్రతినిధుల విజ్ఞప్తిని కూడా పరిగణలోకి తీసుకున్నది. ఇప్పటివరకు పూర్వపు వరంగల్‌రూరల్‌ జిల్లా పరిధిలో ఉన్న ఆత్మకూరు, శాయంపేట మండలాలను వరంగల్‌ అర్బన్‌ నుంచి హనుమకొండ జిల్లా పరిధిలోనే ఉండాలని ఈ రెండు మండలాల్లోని మెజారిటీ ప్రజలు కోరారు. అభ్యంతరాల పరిశీలనలో ఇదే విషయం స్పష్టంగా బయటపడింది. శాయంపేట మండలాన్ని హనుమకొండ జిల్లాలోనే ఉంచాలని ఆ  మండలంలో అఖిల పక్షం ఆధ్వర్యంలో ఏకంగా నిరాహార దీక్ష కూడా చేశారు. ఆత్మకూరు మండలం కూడా ఇదే జిల్లాలో ఉంచాలని అధికార టీఆర్‌ఎస్‌ నేతలు ముక్తకంఠంతో కోరారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సైతం ఈ దిశగా ఒత్తిడి తీసుకువచ్చినట్టు తెలిసింది.


హన్మకొండ.. హనుమకొండగా..

హన్మకొండ పేరును హనుమకొండగా మార్చారు. ఈ మేరకు నోటిఫికేషన్‌లో మార్పు చేశారు. వరంగల్‌ అర్బన్‌ను హన్మకొండగా పేరు మార్చుతున్న క్రమంలో దీనిని హనుమకొండగా పిలవాలని ప్రభుత్వ చీఫ్‌విప్‌, వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌ చేసిన అభ్యర్థన మేరకు ప్రభుత్వం ఈ మార్పు చేసింది. సంఖ్యాపరంగా హన్మకొండ నాలుగు అక్షరాలే ఉంటున్నాయి. సెంటిమెంట్‌ ప్రకారం ఐదు అక్షరాలు ఉండాలన్న భావనతో హన్మకొండను హనుమకొండగా మార్చాలని వినయ్‌భాస్కర్‌ సూచించినట్టు తెలిసింది. పైగా చారిత్రకంగా చూస్తే హనుమకొండనే సరైన పదం. కాకతీయుల కాలంలో అనుమకొండగా పిలిచేవారు. అనుమడు, కొండడు అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారని, నగరాన్ని పొందిచ్చింది వారేనని చెబుతారు. అందుకే హనుమకొండ అనే పేరు వచ్చింది. కాకతీయుల మొదటి రాజధాని అనుమకొండనే. కాలక్రమంలో హన్మకొండగా మారింది. 





Updated Date - 2021-08-13T06:12:40+05:30 IST