Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Fri, 31 Dec 2021 00:00:00 IST

కొత్త కెరటాలను స్వాగతిద్దాం

twitter-iconwatsapp-iconfb-icon
కొత్త కెరటాలను స్వాగతిద్దాం

కలగా కనిపించే ఈ జీవితం గురించి చైతన్యం కలిగి ఉండే లక్షణం... వివేకం ద్వారా కలుగుతుంది. ఈ అవగాహన మనల్ని మరింత దృఢంగా చేసి, ఎలాంటి పరిస్థితుల్లోనూ సమతుల్యత కోల్పోకుండా ఉంచుతుంది. మన జీవితంలో జరిగే ప్రతి ఘటనకూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. వాటి నుంచి మనం ఎన్నో పాఠాలు నేర్చుకొని ముందుకు సాగుతూ ఉండాలి. 


కొత్త సంవత్సరం ప్రారంభం అవుతున్న సమయంలో... చాలామందికి మరొక ఏడాది వెళ్ళిపోయిందే అనే విచారం పట్టుకుంటుంది. ఎవరికోసం ఆగని కాలగమనం గురించి కాసేపు ఆలోచించి... మళ్ళీ దైనందిన జీవితంలో మునిగిపోతారు. ఇదే తంతు ప్రతి ఏడాదీ జరుగుతుంది. ఈ విషయం గురించి మరింత లోతుగా ఆలోచిస్తే... మనలోని ఒక అంశం... కాలంలో జరిగే అన్ని ఘటనలకూ సాక్షిగా నిలుస్తుందనీ, మనలో ఉండే ఆ సాక్షి ఎప్పటికీ మారకుండా... కాలంతో జరిగే అన్ని మార్పులనూ గమనిస్తూ ఉంటుందనీ తెలుస్తుంది. జీవితంలో ఇప్పటివరకూ జరిగినవన్నీ ఒక కలలా అనిపిస్తుంది. కలగా కనిపించే ఈ జీవితం గురించి చైతన్యం కలిగి ఉండే లక్షణం... వివేకం ద్వారా కలుగుతుంది. ఈ అవగాహన మనల్ని మరింత దృఢంగా చేసి, ఎలాంటి పరిస్థితుల్లోనూ సమతుల్యత కోల్పోకుండా ఉంచుతుంది. మన జీవితంలో జరిగే ప్రతి ఘటనకూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. వాటి నుంచి మనం ఎన్నో పాఠాలు నేర్చుకొని ముందుకు సాగుతూ ఉండాలి. 

గత ఏడాది కాలంలో మనం ఎన్ని రోజులు మంచి చింతనలో గడిపాం? ఎన్ని రోజులు మాయలో చిక్కుకొని క్షోభ పడ్డాం? వెనక్కు తిరిగి... ఆ ఏడాది మొత్తాన్ని ఒకసారి చూడండి. ఏ విషయంలోనూ వెన్ను చూపకండి. ఏ విషయాన్నీ తిరస్కరించకండి. అదే సమయంలో... మీ ఆత్మ మీద ధ్యాస పెట్టండి. ఈ సమతుల్యత సాధించడమే యోగం, ఆధ్యాత్మికత. కొందరు దీన్ని కేవలం మౌనం అనుకుంటారు. కొందరు ఉత్సవం అనుకుంటారు. కానీ ఆధ్యాత్మికత అంటే అంతరంగాల్లో మౌనం, బాహ్యమైన ఉత్సవం... అలాగే బాహ్యమైన మౌనం... అంతరంగంలో ఉత్సవం.


ఈ ఏడాది మనతో పాటు ప్రపంచం కూడా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంది. కానీ ఈ ప్రపంచాన్ని బాగుచేసే ప్రయత్నాన్ని మనం ఆపకూడదు. మనం దృఢంగా ఉన్నప్పుడే అది సాధ్యపడుతుంది. మనలో ఒక కర్త, ఒక సాక్షి ఉన్నారు. ఒకసారి ఆత్మావలోకనం చేసుకుంటే... మన చుట్టూ జరిగే సంఘటనలకు సాక్షిగా నిలుస్తూ... వాటి వల్ల ప్రభావితం కాకుండా ఉంటాం. మరోవైపు బాహ్య పరిస్థితుల వల్ల మనం ఉత్తేజితమయితే... మనలోని కర్త బయటకు వస్తాడు. పరిస్థితులకు తగినట్టు చాకచక్యంగా ప్రవర్తిస్తాడు. ఈ రెండు అంశాలు ధ్యానం వల్ల పెంపొందుతాయి. ఆత్మకు దగ్గరైతే... మనం చేసే పనులు చాలా శక్తిమంతంగా ఉంటాయి. మనం మంచి పనులు చేస్తే ఆత్మసాక్షాత్కారం అవుతుంది.


ఏది చేయాలి? ఏది చేయకూడదు? అనే విషయాల్లో గడచిన ఏడాది కాలం మనకు ఎన్నో గుణపాఠాలు నేర్పింది. మనం పడిన ప్రతి బాధ... మనం మరింత లోతుగా ఆలోచించేలా చేస్తుంది. మనం అనుభవించిన ఆనందం ఒక కొత్త ఉత్తేజాన్నీ, ఆశనూ రేకెత్తిస్తుంది. గత ఏడాదిలో మనం ఎన్నో ఒడుదొడుకులను చూశాం. కొత్త సంవత్సరం మన జీవితంలో, ఈ ప్రపంచంలో కొత్త వెలుగును తీసుకువస్తుందని ఆశిద్దాం. ఆ వెలుగును స్వాగతిద్దాం. హింసారహితమైన, ఒత్తిడిరహితమైన సమాజాన్ని నిర్మించడానికి కంకణం కట్టుకుందాం. అంతర్లీనంగా దృఢంగా ఉందాం. మెరుగైన ప్రపంచాన్ని నిర్మించడానికి పాటుపడదాం. కాలంతోపాటు మనుషులు మారుతారు. కానీ కొందరు మనుషులు కాలగమనాన్ని మారుస్తారు. వారిలో మీరూ ఒకరు కావాలి.


కొత్త కెరటాలను స్వాగతిద్దాం

నూతన సంవత్సర శుభాకాంక్షలు

 శ్రీశ్రీ రవిశంకర్‌

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.