Abn logo
Sep 24 2020 @ 01:12AM

సేద్య సంస్కరణలకు స్వాగతం

Kaakateeya

వ్యవసాయరంగంలో మౌలికమైన మార్పులు రావాలంటే ఆహార ధాన్యాల సేకరణ విధానాల్లో మౌలికమైన మార్పులు తీసుకురావలసి ఉంటుంది. వ్యవసాయదారులు ఎక్కువగా నూనెగింజలు, పప్పుధాన్యాలు పండించే విధంగా ధాన్యసేకరణ విధానాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. భూగర్భజలాలు రోజురోజుకి తగ్గిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆరుతడి పంటలను ఎక్కువగా ప్రోత్సహిస్తే ఆ అమృత ప్రవాహాలనూ సంరక్షించవచ్చు.


కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో కొన్ని మౌలిక మార్పులు తీసుకు వచ్చే దిశగా మూడు బిల్లులను ప్రవేశపెట్టి పార్లమెంట్‌ ఆమోదం పొందింది. వీటికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు, ప్రధానంగా పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోని వ్యవసాయదారులు సంఘటితం అవుతున్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామి అయిన అకాలీదళ్ మంత్రి ఈ వ్యవసాయ సంస్కరణలను వ్యతిరేకిస్తూ రాజీనామా చేశారు. కేంద్రప్రభుత్వం మాత్రం వ్యవసాయదారులకు అనుకూలంగా ఉండే ఈ సంస్కరణలపై ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని ఆంటోంది.


వ్యవసాయరంగంలో ఈ సంస్కరణల గురించి గత దశాబ్దంగా కేంద్రం, రాష్ట్రాల మధ్య సంభాషణలు జరుగుతూనే ఉన్నాయి. ఆనాటి యూపీఏ ప్రభుత్వం కానీ, తరువాత వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం కానీ, ఈ సంస్కరణలు అవసరమని భావించి  ఒక నమూనా చట్టాన్ని రూపొందించి అమలు చేయవలసిందిగా రాష్ట్రాలను కోరాయి. కొన్ని రాష్ట్రాలు కొంతవరకు ఈ సంస్కరణలు అమలు చేసినా, అనేక రాష్ట్రాలు చేయలేదు. కేంద్రమే చివరకు చొరవ తీసుకుని లాక్‌డౌన్‌ కాలంలో ఆర్డినెన్స్‌లను జారీ చేసింది. ఇప్పుడు పార్లమెంటులో మూడు బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదముద్ర పొందింది. రాజ్యాంగం ప్రకారం వ్యవసాయం ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది. కానీ కేంద్ర జాబితాలో ఉన్న అంతర్‌ రాష్ట్ర వాణిజ్య అంశాన్ని ఉపయోగించుకుని కేంద్రప్రభుత్వం ఈ బిల్లులను రూపొందించినట్లు కనిపిస్తోంది.


వ్యవసాయ ఉత్పత్తి, వాణిజ్యం బిల్లు ద్వారా వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్‌ యార్డుల వెలుపల కూడా ఎటువంటి సెస్ చెల్లించకుండా ఎవరికైనా అమ్ముకునే విధానాన్ని రైతుకు కల్పించారు. ప్రస్తుతం అమలవుతున్న విధానల ప్రకారం వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్‌ యార్డులోనే అమ్ముకోవాలి. బయట అమ్మితే ఆ అమ్మకాలపై వ్యవసాయ మార్కెటింగ్ చెక్ పోస్టులలో సెస్సు వసూలు చేస్తారు. ఈ కొత్త బిల్లుననుసరించి రైతులకు మార్కెట్‌యార్డ్‌లో కానీ, మార్కెట్ బయటగాని అమ్ముకునే పూర్తి స్వేచ్ఛను కల్పిస్తున్నారు. అదేవిధంగా వ్యవసాయదారుల ఒడంబడిక ధర హామీ బిల్లు ప్రకారం ఒప్పంద వ్యవసాయం జరగటానికి అనువైన వాతావరణాన్ని కల్పిస్తూ విధివిధానాలను రూపొందించారు. సమస్యల పరిష్కారానికి ఒక విస్తృత మధ్యవర్తిత్వ విధానాన్ని ఏర్పాటు చేస్తారు. ఇక మూడో బిల్లు, అత్యవసర సరుకుల నిల్వలపై ఉండే ఆంక్షలను తొలగిస్తూ కేవలం కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లోనే వాటిని విధించడానికి వీలు కల్పిస్తోంది.


రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ చట్టాలకు అనుగుణంగా పని చేస్తున్న‌ మార్కెట్ యార్డుల పనితీరు అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే విధంగా లేదు. కొన్ని రాష్ట్రాలలో మార్కెటింగ్‌యార్డుల కార్యనిర్వాహకవర్గాన్ని ఎన్నికల ద్వారా ఎంపిక చేసుకుంటున్నారు. చాలా రాష్ట్రాలలో వాటిని రాష్ట్ర ప్రభుత్వాలు నామినేట్ చేస్తున్నాయి. ఈ మార్కెట్‌యార్డుల నిర్వహణ సమర్థవంతంగా, రైతు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని జరగటం లేదు. అవసరానికి మించిన ఉద్యోగస్థుల నియామకం, మితిమీరిన పరిపాలన వ్యయంతో రైతులకు మేలు చేయడానికి బదులు ఈ మార్కెట్ యార్డులు చాలా వరకు రైతు ప్రయోజనాలకు ప్రతిబంధకంగానే తయారవుతున్నాయి. చాలా మార్కెట్‌యార్డులలో కమీషన్ ఏజెంట్లు రైతులకు విరుద్ధంగా తమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. గిడ్డంగుల నిర్మాణంలో కానీ, కోతల అనంతరం అవసరమైన సాంకేతిక ఏర్పాట్లలో కానీ రైతులకు తగిన వాటిని సమకూర్చటంలో మార్కెట్‌యార్డులు విఫలమయ్యాయనే చెప్పాలి. అందువల్ల వాటికి ప్రత్యామ్నాయంగా రైతు తన పంటను అమ్ముకునే అవకాశాన్ని కల్పించడం స్వాగతించదగ్గ విషయమే కానీ వ్యతిరేకించదగినది కాదు.


పంజాబ్, హర్యానా లాంటి రాష్ట్రాలలో ఈ బిల్లులకు వ్యతిరేకంగా ఇప్పటికే ఉద్యమం మొదలైయింది. దీనికి ప్రధానమైన కారణం, సంస్కరణల మిషతో కేంద్రప్రభుత్వం ఆహారధాన్యాల కొనుగోలుకు సంబంధించిన మద్దతు ధరల విధానానికి స్వస్తి పలుకుతుందనే అపోహ. ఈ అపోహను నిర్ద్వంద్వంగా ఖండించి రైతులకు భరోసా కల్పిస్తే ఈ సంస్కరణల బిల్లులపై పెద్దగా వ్యతిరేకత ఉండకపోవచ్చు. పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాలలో ఈ ఉద్యమాన్ని రాష్ట్ర ప్రభుత్వాలే సారథ్యం వహించి నడపటానికి వేరే కారణాలు ఉన్నాయి. దేశంలో వరి గోధుమలను అత్యధికంగా ఈ రెండు రాష్ట్రాల నుంచే కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. కనీస మద్దతుధరలో ఆరుశాతం మార్కెట్ సెస్ కింద, 2.5శాతం ఏజెంట్లకు కమీషన్ కింద భారత ఆహార సంస్థ చెల్లిస్తోంది. ఒక్క పంజాబ్ రాష్ట్రంలోనే ఈ మొత్తం మూడువేల కోట్ల రూపాయలు ఉంటుంది. ఆ రాష్ట్రంలో మార్కెట్‌యార్డుల్లో కాకుండా భారత ఆహార సంస్థ కొనుగోలు చేయడం మొదలుపెడితే ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోల్పోతుంది. పంజాబ్‌, హరియానా ప్రభుత్వాలు ఈ బిల్లులను అంత తీవ్రంగా వ్యతిరేకించడానికి ఇది ప్రధానమైన కారణం. భారత ఆహార సంస్థ కనీస మద్దతుధరకు అదనంగా, మార్కెట్‌యార్డుల బయట కొన్న ఆహారధాన్యాలకు సంబంధించి సెస్‌లలోని మిగులును నేరుగా చెల్లించే ప్రతిపాదన చేస్తే ఈ బిల్లులకు రైతుల నుంచి వ్యతిరేకత రాకపోవచ్చు. ప్రస్తుతం ఉన్న మార్కెట్‌యార్డులను యథాతథంగా కొనసాగించి, అదనంగా ఎటువంటి ఆంక్షలు లేకుండా వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకోవడానికి అవకాశం కల్పించే ఈ బిల్లు గురించి సరైన రీతిలో రైతులకు వివరించగలిగితే ఎటువంటి అభ్యంతరాలు ఉండకపోవచ్చు. 


కేంద్రం తెచ్చిన రెండో బిల్లు ఒప్పంద వ్యవసాయానికి సంబంధించినది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లాంటి రాష్ట్రాలలో ఒప్పంద వ్యవసాయ విధానం ద్వారా 90వ దశకంలోనే ఆయిల్‌పామ్ పంటను ప్రవేశపెట్టి విస్తృతంగా అమలు పరిచారు. ఐటిసి, కెల్లాగ్, పెప్సికో, లాంటి సంస్థలు ఇప్పటికే చాలా రాష్ట్రాలలో ఒప్పంద వ్యవసాయ విధానాన్ని నిర్వహిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారంతో, మధ్యవర్తిత్వంతో మాత్రమే ఈ ఒప్పంద వ్యవసాయ విధానాలు విజయవంతమవుతాయి. ఈ ఒప్పంద వ్యవసాయ చట్టాలను రూపొందించుకునే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేయడం ఉత్తమం. కేంద్రప్రభుత్వం ఈ బిల్లు ద్వారా జాతీయ స్థాయిలో ఒక విధానానికి రూపకల్పన చేయగలిగినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛందంగా పూర్తిస్థాయి ఆసక్తి చూపుతూ ఒప్పంద వ్యవసాయ విధానాన్ని అనుసరించనంతకాలం అది విజయవంతం అయ్యే అవకాశం చాలా తక్కువ.


ఇక మూడో బిల్లు ప్రస్తుత అత్యవసర చట్టంలో సవరణకు సంబంధించినది. అత్యవసర వస్తువులుగా పరిగణించే వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ పరిమితులపై ఉన్న ఆంక్షలను ఇకమీదట సడలిస్తారు. ఏవో కొన్ని అసాధారణమైన పరిస్థితులలో తప్పితే వ్యవసాయ వస్తువులను కలిగి ఉండటానికి కానీ, నిల్వ చేయడానికి కానీ, ఎగుమతి చేయడానికి కానీ, ఎటువంటి ఆంక్షలు ఉండవు. ఈ సవరణ వల్ల వ్యవసాయదారులకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. ఇది కూడా వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని చేసిన సవరణే. వ్యవసాయరంగంలో మౌలికమైన మార్పులు రావాలంటే ఈ బిల్లులతో పాటు కాకుండా కేంద్రప్రభుత్వం ఆహార ధాన్యాల సేకరణ విధానాల్లో మౌలికమైన మార్పులు తీసుకురావలసి ఉంటుంది. ఆహారధాన్యాల నిల్వలు నేడు పుష్కలంగా ఉన్నాయి. సమస్యంతా పప్పుధాన్యాలు, నూనెగింజల విషయంలోనే. వ్యవసాయదారులు ఎక్కువగా నూనెగింజలు, పప్పుధాన్యాలు పండించే విధంగా ధాన్యసేకరణ విధానాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. పరోక్షంగా ఇది వ్యవసాయరంగానికి కూడా మేలు చేస్తుంది. భూగర్భజలాలు రోజురోజుకి తగ్గిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆరుతడి పంటలను ఎక్కువగా ప్రోత్సహిస్తే భూగర్భజలాల్ని కూడా సంరక్షించవచ్చు. ప్రజాపంపిణీ వ్యవస్థలో పప్పు గింజలు వంటనూనెలను ఎక్కువగా పంపిణీ చేసే విధానాన్ని ప్రవేశపెడితే వినియోగదారులకు కూడా పౌష్టిక ఆహార పదార్థాలను సరఫరా చేసినట్లవుతుంది.

ఐవైఆర్‌ కృష్ణారావు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ మాజీ ముఖ్య కార్యదర్శి

Advertisement
Advertisement
Advertisement