ఇంకా రాయాలని ఉంది

ABN , First Publish Date - 2021-02-28T08:11:29+05:30 IST

అమెరికాలో కొన్ని దశాబ్దాలపాటు ఉన్నా తెలుగు భాషపై మక్కువ ఏమాత్రం తగ్గని వ్యక్తి వేల్చేరు నారాయణరావు. పైగా ప్రపంచ సాహిత్య లోకానికి మన మాతృభాష రుచిని పరిచయం చేసిన ప్రముఖ సాహితీవేత్త. తెలుగు బోధన, ప్రబంధ, కావ్యానువాదాలతోనే

ఇంకా రాయాలని ఉంది

90వ పడిలోనూ వేల్చేరు ఆకాంక్ష 

ఇప్పటికే తెలుగుకు మంచి ఆదరణ

మరింత విస్తరించాలనేదే ఆకాంక్ష

అప్పటిదాకా నేను రాస్తూనే ఉంటా

‘ఆంధ్రజ్యోతి’తో నారాయణరావు

కేంద్ర సాహిత్య అకాడమీ గౌరవ ఫెలోషిప్‌ పొందడంపై సంతృప్తి


‘‘శాస్త్రీయ భాషగా తెలుగు అభివృద్ధి చెందాలి. మన అనువాదాలను ఇప్పటికే ప్రపంచ ప్రజలు ఆదరిస్తున్నారు. ఈ ఆదరణ మరింత పెరగాలి. నా ఆశయం ఇదే. అప్పటి వరకూ రాస్తూనే ఉంటాను’’

- వేల్చేరు నారాయణరావు


(ఏలూరు-ఆంధ్రజ్యోతి)

అమెరికాలో కొన్ని దశాబ్దాలపాటు ఉన్నా తెలుగు భాషపై మక్కువ ఏమాత్రం తగ్గని వ్యక్తి వేల్చేరు నారాయణరావు. పైగా ప్రపంచ సాహిత్య లోకానికి మన మాతృభాష రుచిని పరిచయం చేసిన ప్రముఖ సాహితీవేత్త. తెలుగు బోధన, ప్రబంధ, కావ్యానువాదాలతోనే సగానికిపైగా జీవితం గడిపేశారాయన. ప్రస్తుతం 90వ పడిలో ఉన్నా... తెలుగు కోసం ఇంకా చాలా చేయాలని, రచనలు మరిన్ని వెలువరించాలని ఉందంటున్నారు. ప్రస్తుతం వేల్చేరు పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం కొప్పాకలో ఉంటున్నారు.  కేంద్ర సాహిత్య అకాడమీ ఆయనకు ‘గౌరవ ఫెలోషిప్‌’ ప్రచురించిన సందర్భంగా  శనివారం ‘ఆంధ్రజ్యోతి’ ఆయనను పలకరించింది. ఇప్పటిదాకా చేపట్టిన, చేపట్టనున్న పరిశోధన, అనువాద ప్రణాళికలను గురించి అడిగి తెలుసుకొంది. అవి ఆయన మాటల్లోనే.. 


అందుకే అంత ఇష్టం..

‘‘శ్రీకాకుళం జిల్లా అంబఖండి గ్రామంలో పుట్టాను.  ఏలూరులోని సీఆర్‌ఆర్‌ కాలేజీలో డిగ్రీ వరకూ చదువుకొన్నాను. ఆ తరువాత అక్కడే కొంత కాలం బోధించాను. అప్పట్లో నా తెలుగు రాతకు ముచ్చటపడి కాలేజీ యాజమాన్యమే నన్ను పిలిపించి ఉద్యోగం ఇచ్చింది. పీహెచ్‌డీ చేసేటప్పుడు కొంత మంది అమెరికన్లు.. తెలుగు నేర్చుకునేందుకు ఆంధ్రా యూనివర్సిటీకి వచ్చారు. వీరికి తెలుగు నేర్పించేందుకు నన్ను ఫెలోషి్‌పపై నియమించారు. ఆ క్రమంలో తెలుగు భాషను నేర్పే కళ అబ్బింది. అమెరికా వెళ్లే అవకాశమూ లభించింది. అక్కడివారికి తెలుగు నేర్పేందుకు నన్ను ఆహ్వానించారు. అమెరికాలోని పలు విశ్వ విద్యాలయాల్లో తెలుగు వాచకాన్ని ఇంగ్లీషు భాషలో అక్కడ విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించేవాడిని. విడి సమయాల్లో తెలుగుపై పరిశోధనలు సాగిస్తూ, యాభై ఏళ్లు బోధనా రంగంలోనే కొనసాగాను’’


ఎగతాళి చేసినవారికి జవాబుగానే..

‘‘భారత్‌కు చరిత్ర ఉందా?’ అంటూ కొందరు పాశ్చాత్య దేశస్థులు అన్న ఎగతాళి మాటలు నాలో పౌరుషం పెంచాయి. ఆంగ్లానువాదాలు చేసేలా నన్ను పురిగొల్పాయి. తెలుగు సాహిత్యంలోని పలు ‘క్లాసిక్స్‌’ని అనువదించాను. పెద్దన ‘మనుచరిత్ర’, గురజాడ అప్పారావు ‘కన్యాశుల్కం’ వంటి రచనల్లోని విశ్వజన సారాంశం పాశ్చాత్యులకు సైతం తెలియజెప్పాలని తపించాను. అమెరికాలో సంజయ్‌ సుబ్రమణ్యం, డేవిడ్‌ షుల్మాన్‌ వంటి ప్రముఖ రచయితలతో ఉన్న అనుబంధం వల్ల నా పని తేలికయింది. సంజయ్‌ సుబ్రమణ్యం ఢిల్లీకి చెందినవారైనా ఫ్రెంచ్‌, పోర్చుగీస్‌ భాషల్లో ఆయన సిద్ధహస్తుడు. రాత పనిలో నాకు ఏరుచూరు శ్రీనివాస్‌ పదేళ్లపాటు గొప్ప సహకారం అందించారు. నాకు ఒక కుమార్తె ఉంది. పేరు సరయురావు. అమెరికాలో నాటక, సినిమా కళల్లో రాణిస్తున్నారు. నాకు అమెరికా పౌరసత్వం ఉంది. ఏలూరులోనే ఉండటమా లేక తిరిగి వెళ్లడమా అనేది కాలమే నిర్ణయించాలి’’ 


ఏలూరును మరవలేకే..

‘తెలుగులో కవితా విప్లవాల స్వరూపం’ పుస్తకం 70ల్లో సంచలనం. అది పీహెచ్‌డీ గ్రంథం. అప్పట్లో నేను ఏలూరులో మేనమామ శేషగిరిరావు ఇంట ఉండి కాలేజీకి వెళ్లేవాడిని. సాహిత్య ఉద్యమాల్లో పాల్గొంటూ, రచయితలు, కవుల వెంట తిరిగే వాడిని. ఈ క్రమంలో స్నేహితులనెందరినో సంపాదించుకొన్నాను. ఏలూరు వెళితే వారంతా గుర్తుకొస్తారనే.. ఆ పట్టణానికి దూరంగా కొప్పాకలో రెండేళ్లుగా ఉంటున్నాను. కేంద్ర సాహిత్య అకాడమీ నాకు గౌరవ ఫెలోషిప్‌ ప్రకటించిందనగానే అప్పటి నా మిత్రులంతా గుర్తుకొచ్చారు. ఫెలోషి్‌పను నాకు ప్రకటించడాన్ని తెలుగుకు మంచిరోజులు రావడంగానే భావిస్తున్నాను. ఇప్పటికీ నాకింకా రాయాలనే ఉంది’’

Updated Date - 2021-02-28T08:11:29+05:30 IST