Abn logo
Feb 25 2021 @ 01:27AM

పెట్టుబడి గుప్పిట్లో పాడిపంటలు

ప్రపంచ పాడి విపణి చమురు వలే అస్థిరమైనది. భారత్ పాతికేళ్ళ క్రితం తన పాడిపరిశ్రమను సరళీకరణ, మూలధనీకరణ చేసి, ఎగుమతుల విపణిలోకి ప్రవేశించిన తరువాత ప్రపంచమార్కెట్‌లో మూడు నాలుగుసార్లు ధరల పతనం సంభవించింది. ప్రతి పతనం అనంతరం ధరలు మళ్ళీ గరిష్ఠస్థాయికి పెరగడమూ జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా పాడి ఉత్పత్తుల ధరలు పతనమైన ప్రతిసారీ ఉత్పత్తి రంగమే అమితంగా నష్టపోయింది. చిన్నకారు, సన్నకారు రైతులు పాల ఉత్పత్తి కార్యకలాపాలకు స్వస్తి చెప్పారు. ఇందుకు పలు కారణాలు ఉన్నాయి. అవి: ఉత్పత్తి వ్యయాలు ఇతోధికంగా పెరిగిపోవడం; పాల వ్యాపారులు ఉత్పత్తి దారుల నుంచి నేరుగా కొనుగోలు చేసే పాలకు కనీస గిట్టుబాటు ధర లభించకపోవడం; డెయిరీ కంపెనీలు కొనుగోలు చేసే పాల పరిమాణం అంతకంతకూ తగ్గిపోవడం. వీటితో పాటు పశుదాణా ధరలు (పాల ఉత్పత్తివ్యయాలలో ఇవే 70 శాతం) భారీగా పెరిగిపోవడం కూడా మరో ప్రధాన కారణంగా చెప్పి తీరాలి.


భారత్‌లో పాడిపరిశ్రమ పరిస్థితులు సైతం అందుకు భిన్నమైనవి కావు. 2000, 2016 సంవత్సరాల మధ్య ఒకటి రెండు ఆవులు లేదా గేదెలు గల సన్నకారు చిన్నకారు రైతులలో 52.50 లక్షల మంది పాల ఉత్పత్తి ఆధారిత జీవనోపాధుల నుంచి అనివార్యంగా నెట్టివేతకు గురయ్యారు. పాడి ఉత్పత్తుల వ్యాపారరంగంపై నియంత్రణల సడలింపు వల్ల పాడి పరిశ్రమ ఉత్పత్తి ప్రాతిపదికలలో మౌలికమైన సంస్థాగత మార్పులు చోటుచేసుకున్నాయి. ఒకటి రెండు పాడిపశువులు గల ఉత్పత్తిదారుల సంఖ్య సగానికి తగ్గిపోయింది. 1990కి పూర్వం పాల ఉత్పత్తిదారులలో ఈ సన్నకారు చిన్నకారు రైతులే అత్యధిక సంఖ్యలో ఉండేవారు. నియంత్రణల తొలగింపు దరిమిలా వీరి సంఖ్య 45 శాతానికి తగ్గిపోయింది. పాల ఉత్పత్తిలో ఒకటి రెండు ఆవులు, గేదెలు గల రైతుల ప్రాధాన్యం తగ్గిపోయి, పెద్దసంఖ్యలో పాడి పశువులను పోషించే రైతుల ప్రాధాన్యం పెరిగింది. చిన్నకారు పాడి రైతు నిర్వచనం కూడా మారిపోయింది. మూడు నుంచి ఐదు పాడి పశువులను కలిగిఉండి, పాల ఉత్పత్తిదారులలో 34 శాతంగా ఉన్న రైతులనే చిన్నకారు పాడిరైతులుగా పరిగణించసాగారు. భారత్ పాల ఉత్పత్తిలో 1 నుంచి 5 పాడి పశువులు గల రైతుల వాటా 90 నుంచి 60 శాతానికి తగ్గిపోయింది. మిగతా 40 శాతం పాలు పది నుంచి వందకు పైగా పాడిపశువుల యజమానులు ఉత్పత్తి చేస్తున్నవే. కొన్ని ప్రాంతాలలో 10 నుంచి 50 పాడిపశువులు గల కుటుంబాల సంఖ్య ఏటా ఇంచుమించు 30శాతం మేరకు పెరుగుతోంది. చిన్నకారు రైతుల ప్రాధాన్యం అంతకంతకూ తగ్గిపోతుండగా, పెద్ద సంఖ్యలో పాడి పశువులను పోషించే రైతుల ప్రాధాన్యం ఇతోధికమవుతోంది. చిన్నకారు రైతులు తమ పాల ఉత్పత్తి ఆధారిత జీవనోపాధిని కాపాడుకోవాలంటే పాడిపశువుల సంఖ్యను తప్పనిసరిగా పెంచుకోవల్సి ఉంది. అయితే అందుకయ్యే వ్యయం, ప్రస్తుత అస్థిర మార్కెట్ పరిస్థితులలో వారిని మరింత రుణాల ఊబిలోకి నెట్టడం ఖాయం. ఒక చిన్నకారు రైతుగానీ, ఒక చిన్న పాల విక్రేత గానీ పాడి రంగంలో ఉపాధిని కోల్పోవడం జరిగితే వారి కుటుంబాలకు పోషకాహారం లోపించడంతో పాటు ఆహార అభద్రత కూడా ఏర్పడుతుంది. ఇది మనం విస్మరించలేని, విస్మరించకూడని కఠోర వాస్తవం. అంతేకాదు పాల వినియోగంలో అసమానతలు ఎందుకు పెచ్చరిల్లుతున్నాయనే విషయాన్ని కూడా అది వివరిస్తుంది.


ఇక, నియంత్రణల తొలగింపు పాడి ఉత్పత్తుల మార్కెట్‌ను ఎలా ప్రభావితం చేసిందో చూద్దాం. పాల ఉత్పత్తి క్షేత్రం నుంచి వినియోగ కుటుంబం దాకా అన్ని స్థాయిల్లోనూ మార్కెట్ సువ్యవస్థితమయింది. సహకార లేదా ప్రైవేట్‌రంగంలోని ఏ కార్పొరేట్ డెయిరీ సంస్థ కూడా 2015-–19 సంవత్సరాల మధ్య ధరలు తగ్గిపోయిన కాలంలో నష్టాలను చవిచూడలేదు. నిజానికి అవి భారీ లాభాలు ఆర్జించాయి! నష్టాల భారాన్ని రైతులపై మోపడం వల్లే వాటికి ఆ భారీ లాభాలు సమకూరాయన్నది స్పష్టం. పలువురు చిన్న పాల విక్రేతలు తమ జీవనాధారాలను కోల్పోయారు. నిజానికి 2018 నాటికే ప్రైవేట్, సహకార కార్పొరేట్ కంపెనీల వ్యవస్థీకృత మార్కెట్ల విస్తరణతో పాల అనియత విక్రయాలు 50 శాతం కంటే తక్కువకు పడిపోయాయి. పాల ధరల భారీ పతనం అనంతరం వ్యవస్థీకృత రంగంలో చాలా కొద్దిమందితో పాటు బడా గుత్తాధిపత్యసంస్థలు మాత్రమే మిగిలాయి. విలీనాలు, స్వాధీనాలు, జాయింట్ వెంచర్లు, విస్తరణల ద్వారా అవి మరింత సుస్థిరమయ్యారు. ఫ్రెంచ్ కంపెనీ లాక్టాలిస్ గత ఐదేళ్ళలో తిరుమల, అనిక్, ప్రభాత్ డెయిరీ కంపెనీలను స్వాధీనం చేసుకున్నది. భారత్‌లోను, ప్రపంచవ్యాప్తంగాను పెట్టుబడులను మరింతంగా విస్తరించుకోవడమే ఆ ఫ్రెంచ్ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలోనే లాక్టాలిస్ తన అంతర్జాతీయ వ్యాపార సామ్రాజ్యాన్ని మరింతగా విస్తరించుకుంది. 2013 నుంచి భారత్ సహా వివిధ దేశాలలోని పాడి ఉత్పత్తుల సంస్థలతో 41 ఒప్పందాలను కుదుర్చుకున్నది. సుప్రసిద్ధ సంస్థ అమూల్ ప్రప్రథమంగా గ్లోబల్ డెయిరీ టాప్ 20 కంపెనీల (రాబోబ్యాంక్స్ -2020 వార్షిక) జాబితాలో స్థానం సాధించుకుంది. పాల సేకరణ, ప్రాసెసింగ్ సామర్థ్యం, కొత్త ఉత్పత్తులను ప్రారంభించడం, కొత్త మార్కెట్లలోకి ప్రవేశించడం మొదలైన వ్యవహారాలలో కూడా అమూల్ గణనీయమైన పురోగతిని సాధించింది. కరోనా లాక్‌డౌన్ కాలంలో అనేక చిన్న డెయిరీలు మూతపడినప్పటికీ అమూల్ 16 శాతానికి పైగా లాభాలతో పురోగమించింది. అదే కాలంలో గుజరాత్ పాల ఉత్పత్తిదారులకు వాటిల్లిన తీవ్ర నష్టాల గురించి మాత్రం ఎవరికీ పట్టలేదు.


నియంత్రణలు లేని పాడిపరిశ్రమతో మన అనుభవాలు ఏమిటి? పాడి ఉత్పత్తుల స్వేచ్ఛా విపణి ఎలాంటి పర్యవసానాలకు దారితీసింది? ఒకటి రెండు పాడి పశువులను పోషిస్తూ స్వల్ప ఆదాయాన్ని, ఆహారభద్రతను సమకూర్చుకుంటున్న లక్షలాది చిన్నకారు రైతులు పాడిరంగంలో మనుగడ కోల్పోయారు. వారితో పాటు అసంఖ్యాక పాల విక్రేతలు, పాల వ్యాపారుల జీవనాధారాలకు తీరని నష్టం వాటిల్లింది. చిన్న డెయిరీ కంపెనీలు మూతపడ్డాయి. అనియత పాడిపరిశ్రమ ధ్వంసమయింది. పాడిరంగంలో ఎల్లెడలా బడా కంపెనీలదే రాజ్యమైపోయింది. సహకారసంస్థలు, కార్పొరేట్ కంపెనీల లాభాలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. మార్కెట్లపై వాటికే గుత్తాధిపత్యం పూర్తిగా దఖలు పడింది. భవిష్యత్తు ఏమిటి? గతమే భవిష్యత్తు సుమా! ఏదీ భిన్నంగా ఉండబోదని నిశ్చితంగా చెప్పవచ్చు. పాలు, పాల ఉత్పత్తుల ఎగుమతులు ఖాయంగా పెరుగుతాయి. పాడిపరిశ్రమ అభివృద్ధి తదుపరి దశలో ఈ ఎగుమతులే కీలకం కానున్నాయి. పాడి రంగంలో బృహత్ లక్ష్యాలను ప్రభుత్వం నిర్దేశించుకున్నది. 2024 సంవత్సరం నాటికి ఏటా 330 మిలియన్ టన్నుల పాల ఉత్పత్తిని సాధించి, ప్రపంచ పాల ఎగుమతులలో భారత్ వాటాను ప్రస్తుత 0.36 శాతం నుంచి 10 శాతానికి పెంచడమే ప్రభుత్వ లక్ష్యం.


పాడిపరిశ్రమ అభివృద్ధికి, ఆ పరిశ్రమలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి భారత ప్రభుత్వం 8004 కోట్ల రూపాయలతో ఒక నిధిని ఏర్పాటు చేసింది. రాష్ట్ర స్థాయి పాడిసంఘాల సమాఖ్యలకు, పాల ఉత్పత్తి కంపెనీలకు, బహుళ-రాష్ట్ర సహకారసంఘాలకు, ఎన్‌డిడిబి అనుబంధసంస్థలకు ఈ నిధితో లబ్ధి సమకూరనున్నది. మరో రూ.15,000 కోట్లతో పశుపోషణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధిని కూడా కేంద్రం ఏర్పాటు చేసింది. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ఫండ్‌లో భాగంగా ఈ నిధిని ఏర్పాటు చేశారు. పూర్తిగా ప్రైవేట్‌రంగంలో పశుపాలన సంబంధిత సదుపాయాల అభివృద్ధికి ఈ నిధిని ఉద్దేశించారు. ప్రస్తుతం అసంఘటితరంగంలో ఉన్న పాల ఉత్పత్తిదారులను వ్యవస్థీకృతరంగంతో అను సంధానం చేసి, మిగతా 50 శాతం అనియత పాడి మార్కెట్లను కార్పొరేట్ కంపెనీలు సొంతం చేసుకునేందుకు తోడ్పడడమే ఈ నిధుల లక్ష్యంగా ఉన్నది. కొత్త వ్యవసాయ చట్టాల వంటి చట్టబద్ధమైన సాధనాలు పాడిపరిశ్రమపై కార్పొరేట్ సంస్థల నియంత్రణ, గుత్తాధిపత్యాన్ని మరింత వేగవంతం, పటిష్ఠం చేయనున్నాయి. పాకిస్థాన్, శ్రీలంక తదితర ఇరుగుపొరుగు దేశాలకు ప్రధాన పాడి ఉత్పత్తుల ఎగుమతిదారుగా అమూల్ ఆవిర్భవించనున్నది. ఇందుకు తొలుత పాల ఉత్పత్తిని మరింత అధికం చేయవలసి ఉన్నది. పాడిపశువుల సగటు పాల దిగుబడిని కూడా ఇతోధికం చేయవలసిఉంది. ఇందుకు అధునాతన సాంకేతికతలను వినియోగించుకోవలసి ఉంది. పాడి ఉత్పత్తుల విపణి మూలధనీకరణ, ప్రపంచమార్కెట్లతో ఏకీకరణ, ఎగుమతుల పెరుగుదలతో మనదేశంలోని చిన్నకారు రైతులకే కాదు, ఇరుగు పొరుగు దేశాలలోని వారికి కూడా మరింత భారీ నష్టం వాటిల్లుతుంది. మూడు దశాబ్దాల నాడు నియంత్రణల నుంచి స్వేచ్ఛ పొందిన మన పాడిపరిశ్రమలో పరిణామాలు పాల ఉత్పత్తిలో చురుగ్గా ఉండే సన్నకారు చిన్నకారు రైతులకు చేదు అనుభవాలను మాత్రమే మిగిల్చాయనడంలో సందేహం లేదు. ఇప్పుడు కొత్త వ్యవసాయ చట్టాలతో ఎటువంటి విపత్కర పరిణామాలు నెలకొననున్నాయనే విషయమై పాడిపరిశ్రమ అనుభవాలు మనలను అప్రమత్తం చేస్తున్నాయి. కొత్త సాగుచట్టాల రద్దుకోసం రైతుల నేతృత్వంలో సాగుతున్న నిరసనలు, ఆందోళనలు మరింత విస్తృతస్థాయిలో ఉధృతమవ్వనిపక్షంలో ఆ సంభావ్య భయానక భవిష్యత్తు ఈ దేశ పౌరులుగా, ఆహార వినియోగదారులుగా మన జీవితాలలోకి రావడం అనివార్యం.

డాక్టర్ సాగరి ఆర్ రాందాస్

Advertisement
Advertisement
Advertisement