మా ఇష్టం వచ్చినోళ్లకే దళిత బంధు ఇస్తాం

ABN , First Publish Date - 2022-09-28T08:56:32+05:30 IST

‘మా ఇష్టం వచ్చినోళ్లకే దళితబంధు ఇస్తాం.. నువ్వెందుకు అట్ల మాట్లాడుతున్నవ్‌..

మా ఇష్టం వచ్చినోళ్లకే దళిత బంధు ఇస్తాం

  • నువ్‌ ముందు ఇక్కడి నుంచి బయటికి వెళ్లు
  • దళిత మహిళపై మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ఫైర్‌
  • ఆమెను తీసుకెళ్లాలని పోలీసులకు ఆదేశం

నర్సాపూర్‌(జి), సెప్టెంబరు 27: ‘మా ఇష్టం వచ్చినోళ్లకే దళితబంధు ఇస్తాం.. నువ్వెందుకు అట్ల మాట్లాడుతున్నవ్‌.. పోలీసులూ.. ఆమెను బయటకు తీసుకెళ్లండి’ అంటూ దళిత మహిళపై మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మల్‌ జిల్లా నర్సాపూర్‌(జి)లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం రాత్రి బతుకమ్మ చీరల పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై.. మహిళలకు బతుకమ్మ చీరలు అందజేశారు. అనంతరం ఆయన ప్రసంగించారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన పలువురు దళిత మహిళలు జోక్యం చేసుకొని.. దళితబంధుపై మంత్రి నిలదీశారు. గరీబోళ్లకు దళితబంధు అందట్లేదంటూ ఓ దళిత మహిళ సమావేశంలోనే మంత్రి అల్లోలను ప్రశ్నించింది. దీంతో మంత్రి ఆమెపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మా ఇష్టం వచ్చినోళ్లకే దళితబంధు ఇచ్చుకుంటాం.. నువ్వెందుకు అట్ల మాట్లాడుతున్నవ్‌.. ఇక్కడి నుంచి బయటకు వెళ్లు’ అంటూ మండిపడ్డారు. అంతటితో ఆగకుండా ‘ఆమెను బయటకు తీసుకెళ్లండి..’ అంటూ పోలీసులను ఆదేశించారు. బీజేపీ వాళ్లతో తిరిగేవాళ్లు, బీజేపీ నేతలనే దళితబంధు అడగాలని చెప్పారు. రాష్ట్రమంతటా విడతల వారీగా దళిత బంధు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే అర్హులందరికీ దళిత బంధు ఇస్తామని.. అంతవరకు ఓపికగా ఉండాలని మహిళలకు సూచించారు. కాగా, మంత్రి అల్లోల వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు మండిపడ్డారు. మంగళవారం ఉదయం గ్రామంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నోటికి నల్ల  గుడ్డలు ధరించి నిరసన తెలిపారు.

Updated Date - 2022-09-28T08:56:32+05:30 IST