జనాభా నియంత్రణ చట్టాన్ని తెస్తాం

ABN , First Publish Date - 2021-09-08T07:02:04+05:30 IST

రాష్ట్రంలో 2023లో జరిగే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాగానే యూపీ మాదిరిగా జనాభా నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చి తీరుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రకటించారు.

జనాభా నియంత్రణ చట్టాన్ని తెస్తాం

  • బీజేపీ అధికారంలోకి రాగానే చేసి తీరుతాం
  • కేసీఆర్‌ మత రిజర్వేషన్‌ బిల్లు తేవాలనుకున్నారు
  • విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తారా? లేదా?
  • టీఆర్‌ఎస్‌ తుగ్లక్‌ పార్టీ.. ప్రైవేటు కంపెనీ
  • సంగారెడ్డి బహిరంగ సభలో బండి సంజయ్‌

సంగారెడ్డి/హైదరాబాద్‌, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 2023లో జరిగే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాగానే యూపీ మాదిరిగా జనాభా నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చి తీరుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రకటించారు. ఈ చట్టం ద్వారా ఒక్కరు చాలు.. ఇద్దరు హద్దు.. ముగ్గురు అసలే వద్దు.. అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా మంగళవారం రాత్రి సంగారెడ్డిలో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. యూపీలో జనాభా నియంత్రణ చట్టాన్ని తీసుకొస్తే.. కేసీఆర్‌ మాత్రం మత పరమైన రిజర్వేషన్‌ బిల్లు తేవాలని చూశారని విమర్శించారు. ఎంఐఎంను గెలిపించేందుకు  జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్నా పోటీ చేసే అవకాశం ఇస్తూ చట్టం తీసుకురావాలని చూశారని.. బీజేపీ అడ్డుకోవడంతో వెనక్కి తగ్గారన్నారు. కేసీఆర్‌కు దమ్ముంటే ఇలాంటి బిల్లు పెట్టాలని.. తాము ఎక్కడ అడ్డుకోవాలో అక్కడే అడ్డుకొని తీరుతామని అన్నారు. బీజేపీ సత్తా ఏంటో పాతబస్తీలో సభ పెట్టి చూపామని.. కానీ సీఎం కేసీఆర్‌ మాత్రం అక్కడ సభ పెట్టలేక నపుంసక రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తారా? లేదా? స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. కాగా, టీఆర్‌ఎస్‌ పాలనలో ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా? అని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రశ్నించారు. పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య చేసుకున్నప్పుడు మంత్రి హరీశ్‌ ఉపన్యాసాలకే పరిమితమయ్యాడే తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. 


కారు టీఆర్‌ఎస్‌ది.. నడిపిస్తున్నది మాత్రం రజాకార్‌

సంజయ్‌ చేసేది పాదయాత్ర కాదని, కేసీఆర్‌పై దండయాత్ర అని బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు, బెంగళూరు ఎంపీ తేజస్వీ సూర్య అన్నారు. కారు టీఆర్‌ఎ్‌సదే అయినా నడిపిస్తున్నది రజాకార్‌ (ఎంఐఎం) అని విమర్శించారు. భూ వివాదాన్ని ఆసరాగా చేసుకుని జూబ్లీహిల్స్‌ హనుమాన్‌ దేవాలయం ఘటనలో 15 మంది సాధువులను పోలీసులు అరెస్టు చేయడాన్ని సంజయ్‌ ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. కాగా, హుజూరాబాద్‌లో కరీంనగర్‌, వరంగల్‌, సిద్దిపేట పౌరులు ఓటర్లుగా నమోదు చేసుకుంటున్నా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈఓ) శశాంక్‌ గోయెల్‌ చూడనట్లు వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎ్‌సఎస్‌ ప్రభాకర్‌ ఆరోపించారు. ఈ మేరకు ఆధారాలను కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తామన్నారు. మంగళవారం రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. 

Updated Date - 2021-09-08T07:02:04+05:30 IST