అర్ధరాత్రి జీవోలను వ్యతిరేకిస్తున్నాం

ABN , First Publish Date - 2022-01-18T08:44:15+05:30 IST

పీఆర్‌సీ ఫిట్‌మెంట్‌, హెచ్‌ఆర్‌ఏ, పింఛను, డీఏలకు సంబంఽధించి ప్రభుత్వం

అర్ధరాత్రి జీవోలను వ్యతిరేకిస్తున్నాం

  • అప్రజాస్వామికంగా ఇలా జీవోలు ఇవ్వడం దారుణం
  • భగ్గుమన్న ఉద్యోగ సంఘాలు
  • అవి అశాస్త్రీయ జీవోలు
  •  ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ఇది చీకటిరోజు
  • నేటి నుంచి నల్ల బ్యాడ్జీలతో నిరసన
  • ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి పిలుపు
  • నిరసనలు, జీవో దగ్ధానికి ఫ్యాప్టో నిర్ణయం


అమరావతి, జనవరి 17(ఆంధ్రజ్యోతి): పీఆర్‌సీ ఫిట్‌మెంట్‌, హెచ్‌ఆర్‌ఏ, పింఛను, డీఏలకు సంబంఽధించి ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు భగ్గుమన్నాయి. ఒకవైపు వీటిని తామంతా వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేస్తుండగానే... అప్రజాస్వామికంగా రాత్రిపూట జీవోలు ఇవ్వడం దారుణమన్నాయి. ప్రభుత్వం ఇచ్చిన జీవోలపై సోమవారం రాత్రి ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) అత్యవసర సమావేశం నిర్వహించింది. ఫ్యాప్టో చైౖర్మన్‌ సుధీర్‌ బాబు, సెక్రటరీ జనరల్‌ శరత్‌చంద్ర, యూటీఎఫ్‌ నుంచి ఎన్‌.వెంకటేశ్వర్లు, ఏపీటీఎఫ్‌ నుంచి భానుమూర్తి, పాండురంగ వరప్రసాదరావు, ఏపీటీఎఫ్‌ 1938 నుంచి హృదయరాజు, కె.కులశేఖర్‌రెడ్డి, ఇతర సంఘాల నేతలు కె.ప్రకాశరావు, జి.సౌరిరాయలు, రమణయ్య, వెంకటేశ్వర్లు, 13 జిల్లాల ఫ్యాప్ట్టో చైర్మన్‌, కార్యదర్శులు పాల్గొన్నారు. మంగళవారం ప్రభుత్వ ఉత్తర్వులకు నిరసనగా నల్ల బ్యాడ్జీలతో పాఠశాలలకు హాజరుకావాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చింది.


సాయంత్రం ఐదుగంటల సమయంలో అన్ని మండల కేంద్రాల్లో నిరసన ర్యాలీలు, జీవోల దహనం కార్యక్రమం చేయాలని పిలుపునిచ్చింది. ప్రభుత్వం అప్రజాస్వామికంగా 23 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించడంతో పాటు దానికి సంబంధించిన జీవోలను కూడా జారీచేసి ఉద్యోగ, ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం క లిగించిందని సమావేశం విమర్శించింది. ప్రభుత్వం తక్షణం ఈ అప్రజాస్వామిక జీవోలను ఉపసంహరించుకోవాలని ఫ్యాప్టో డిమాండ్‌ చేసింది. 


పీఆర్సీపై జీవోలను వ్యతిరేకిస్తున్నాం... 

11వ పీఆర్సీపై ప్రభుత్వం విడుదల చేసిన అశాస్త్రీయమైన జీవోలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్లు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ఇది చీకటిరోజు అన్నారు. మంగళవారం నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు అందరు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలియజేయాలన్నారు. గత వారం రోజుల నుంచి సీఎం కార్యాలయ ఉన్నతాధికారులు, సజ్జలను అనేక పర్యాయాలు కలిసి అధికారుల కమిటీ సిఫార్సులు అమలు చేయవద్దని కోరామన్నారు. ఆ నివేదిక ఆమోదిస్తే, ఇప్పటికే ఫిట్‌మెంట్‌ విషయంలో తీవ్ర నిరాశతో ఉన్న ఉద్యోగులు ఇంకా ఆ నష్టాన్ని తట్టుకునే పరిస్థితి లేదని తెలిపామన్నారు.


సంక్రాంతి పండగ అనంతరం చర్చించి, సానుకూల నిర్ణయం ప్రకటనకు ప్రయత్నిస్తామని చెప్పారన్నారు. అందుకు భిన్నంగా విడుదల చేసిన అశాస్త్రీయమైన ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ ఇరు జేఏసీల ఐక్య వేదిక పక్షాన మంగళవారం నుంచి రాష్ట్రంలోని ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి తదుపరి ఉద్యమ కార్యాచరణ రూపొందించే వరకూ నిరసనలు తెలిపాలని పిలుపునిచ్చారు. ఇరు జేఏసీల ఉమ్మడి సమావేశం అతి త్వరలో ఏర్పాటు చేసుకొని అసంబద్ధమైన 11వ పీఆర్సీ ఉత్తర్వులపై ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పారు. 


జీవోలను వ్యతిరేకిస్తున్నాం: ఏపీ జేఏసీ సెక్రటరీ జనరల్‌ హృదయరాజు

పీఆర్సీ జీవోలను వ్యతిరేకిస్తున్నట్లు ఏపీ జేఏసీ సెక్రటరీ జనరల్‌ హృదయరాజు తెలిపారు. గత 10వ పీఆర్సీల్లో లేని సంప్రదాయంతో ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్లకు తీవ్ర నష్టం చేశారని మండిపడ్డారు. హెచ్‌ఆర్‌ఏ శ్లాబులు తిరోగమన చర్యగా ఆయన అభివర్ణించారు. అశాస్త్రీయమైన అధికారుల కమిటీ సిఫారసులు ఎవ్వరికీ ఆమోదయోగ్యం కాదన్నారు. ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని, క్షేత్రస్థాయిలో ప్రతి ఉద్యోగి, ఉపాధ్యాయుడు, పెన్షనర్‌ పాలొని, తమ ప్రయోజనాలను కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.



Updated Date - 2022-01-18T08:44:15+05:30 IST