‘హోదా’ అడుగుతూనే ఉంటాం

ABN , First Publish Date - 2021-06-19T08:06:14+05:30 IST

ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని... పరిశ్రమలు వస్తాయని, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని... వైసీపీకి 25 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా సాధిస్తామని...

‘హోదా’ అడుగుతూనే ఉంటాం

ఇప్పుడు కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం లేదు 

అభ్యర్థించడం మినహా ఏం చేయలేం: జగన్‌..  ప్రత్యేక హోదాపై మరోసారి అదే మాట 


అమరావతి, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని... పరిశ్రమలు వస్తాయని, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని... వైసీపీకి 25 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా సాధిస్తామని... ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఊరూరా చెప్పిన వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి... అధికారంలోకి రాగానే మాట మార్చారు. లోక్‌సభలో ఎన్డీయేకు పూర్తి మెజారిటీ ఉన్నందున హోదాపై కేంద్రాన్ని అభ్యర్థించడం మినహా ఏం చేయలేమన్నారు. తాజాగా ఆయన మరోసారి ఇదే విషయం చెప్పారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం లేదని, బీజేపీకి పూర్తి మెజారిటీ ఉన్నందున హోదాపై పదే పదే అడగడం మినహా మనమేమీ చేయలేని పరిస్థితి ఉందని తేల్చి చెప్పారు. ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూనే ఉన్నామని జగన్‌ వెల్లడించారు.


రాష్ట్రానికి మంచి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2021-22 ఏడాదికి సంబంధించిన జాబ్‌ క్యాలెండర్‌ను శుక్రవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ.. ప్యాకేజీ, ఓటుకు నోటు కేసు కోసం గత పాలకులు ప్రత్యేక హోదా అంశాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు. గత ప్రభుత్వంలో ఇద్దరు పెద్దలు కేంద్ర మంత్రి పదవులు కూడా చేపట్టారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం మాయ మాటలతో ప్రజలకు భ్రమ కల్పించిన విషయం అందరికీ తెలిసిందేనని జగన్‌ అన్నారు. టీడీపీ నాయకులు ప్రత్యేక హోదా సాధించకపోగా.. ప్రైవేటు రంగంలోనైనా అన్నో, ఇన్నో ఉద్యోగాలు వస్తాయన్న ఆశలనూ తాకట్టు పెట్టారన్నారు. వాళ్లు రాజీపడడం వల్ల ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ హోదా ఇవ్వండి అంటూ అభ్యర్థించాల్సి వస్తోందన్నారు. ఎన్డీయేకు పూర్తి మెజారిటీ ఉన్నందున ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నామన్నారు. 

Updated Date - 2021-06-19T08:06:14+05:30 IST