కేంద్రం చెప్పినా...కూల్ కూల్!
ABN , First Publish Date - 2021-05-13T07:59:55+05:30 IST
ఆంధ్రప్రదేశ్‌ను కరోనా శరవేగంగా కమ్మేస్తోంది. పాజిటివిటీ రేటు (ప్రతి వంద టెస్టుల్లో ఎన్ని పాజిటివ్‌లు) మొదటి వేవ్‌ను మించి నమోదవుతోంది
పాజిటివిటీ 10% దాటితే కఠిన ఆంక్షలు విధించాలన్నా బేఫికర్
నెల రోజుల కిందటే రాష్ట్రానికి హెచ్చరికలు
మొత్తం 13 జిల్లాల్లో ‘పది’కిపైగానే పాజిటివిటీ
జాతీయ సగటు 21 శాతంతో సమానంగా కేసులు
అనంతలో అత్యధికంగా 37 శాతం పాజిటివిటీ
ఐదు సరిహద్దు జిల్లాల్లో 28 శాతంపైనే!
అయినా... కఠిన చర్యల ఆలోచనే లేదు
‘పాజిటివిటీ రేటు 10 శాతం దాటిన జిల్లాల్లో కఠినమైన చర్యలు తీసుకోవాలి’... ఇది నెల రోజుల కిందటే కేంద్రం రాష్ట్రాలకు జారీ చేసిన హెచ్చరిక! ఏపీలోని అన్ని జిల్లాల్లో పాజిటివిటీ రేటు ఈ ‘బోర్డర్’ దాటింది. అయినా... రాష్ట్ర సర్కారు ‘అంతా అదుపులోనే ఉంది’ అన్నట్లుగా వ్యవహరిస్తోంది.
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
ఆంధ్రప్రదేశ్‌ను కరోనా శరవేగంగా కమ్మేస్తోంది. పాజిటివిటీ రేటు (ప్రతి వంద టెస్టుల్లో ఎన్ని పాజిటివ్‌లు) మొదటి వేవ్‌ను మించి నమోదవుతోంది. కేంద్ర గణాంకాల ప్రకారం జాతీయ స్థాయిలో పాజిటివిటీ రేటు 21 శాతంకాగా... ఏపీలో 20.66 శాతంగా నమోదవుతోంది. అంటే... జాతీయ సగటుకంటే 0.34 శాతం మాత్రమే తక్కువ. రాష్ట్రంలో ప్రతిరోజూ సగటున 20 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. నిజానికి... ఏపీలో ప్రతి వంద టెస్టుల్లో పాతిక పాజిటివ్‌లు వస్తున్నాయని గతంలో అధికారులే ప్రకటించారు. ఇలాంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై నెల రోజుల కిందటే కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసింది. ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనిస్తూ... ఆయా రాష్ట్రాలకు సూచనలు చేస్తోంది. దీని ప్రకారం... ఏ జిల్లాలో అయినా వారం రోజుల వ్యవధిలో 10 శాతానికి మించి పాజిటివిటీ రేటు ఉంటే దానిని అత్యంత తీవ్రమైన పరిస్థితిగా పరిగణించాలి. ఆ జిల్లాలను గుర్తించి కఠినమైన నిబంధనలు అమలు చేయాలి. కంటైన్మెంట్ జోన్లు, రెడ్ జోన్లలను ఏర్పాటు చేసి, రాకపోకలను తాత్కాలికంగా నిలిపి వేయాలి. దీనివల్ల కరోనా చైన్ లింక్ కట్ అవుతుందని నెల రోజుల క్రితమే కేంద్రం చెప్పింది. కానీ... రాష్ట్ర ప్రభుత్వం ఈ సూచనలను పట్టించుకోనే లేదు. చివరికి... తొలుత రాత్రి కర్ఫ్యూ విధించి, ఆ తర్వాత ఈనెల 5వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకు కర్ఫ్యూ అమలులోకి తెచ్చింది.
మొత్తం 13 జిల్లాల్లో...
రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే... ప్రస్తుతం కరోనా విశ్వరూపం ప్రదర్శిస్తున్న మహారాష్ట్రలో 36 జిల్లాలకుగాను 35 జిల్లాల్లో 10 శాతంపైన పాజిటివిటీ రేటు ఉంది. అంటే... ఒక్క జిల్లాలో మాత్రమే పరిస్థితి అదుపులో ఉంది. యూపీలో 75 జిల్లాలకు గాను 33 జిల్లాల్లో, తమిళనాడులో 38 జిల్లాలకుగాను 35 జిల్లాల్లో, ఒడిసాలో 30 జిల్లాలకుగాను 27 జిల్లాల్లో పది శాతంపైన పాజిటివిటీ రేటు నమోదవుతోంది. ఏపీలో మాత్రం... మొత్తం 13 జిల్లాల్లోనూ పాజిటివిటీ రేటు 10 శాతాన్ని మించిపోయింది. కేంద్ర గణాంకాల ప్రకారం అన్ని జిల్లాల్లో కఠినమైన ఆంక్షలు విధించాల్సిన పరిస్థితులున్నాయి. కానీ... రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ‘‘అంతా అదుపులోనే ఉంది. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులూ లేవు’’ అన్నట్లుగా కాలం గడుపుతోంది. కేసులు, మరణాల విషయంలో ‘తక్కువ’ లెక్కలు చూపిస్తూ.. వాస్తవాలను మరుగునపెడుతోంది.
అనంతలో 37.2 శాతం...
రాష్ట్రంలో మార్చి 15 నుంచి కరోనా సెకండ్ వేవ్ మొదలైంది. ఇప్పుడు తారస్థాయికి చేరింది. తాజా గణాంకాల ప్రకారం అనంతపురంలో అడ్డూ అదుపు లేకుండా వైరస్ వ్యాపిస్తోంది. రాష్ట్రంలోనే అత్యధికంగా ఆ జిల్లాలో 37.2 శాతం పాజిటివిటీ రేటు ఉంది. అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో 10.5 శాతం నమోదవుతోంది. చిత్తూరు 36 శాతం, విజయనగరం 33 శాతం, విశాఖపట్నం 29.5 శాతం, కడప 28.3 శాతం, శ్రీకాకుళం 28.3 శాతం, నెల్లూరు 28.1 శాతం, తూర్పు గోదావరి 25.7 శాతం, గుంటూరు 25.4 శాతం, కర్నూలు 24.9 శాతం, కృష్ణా 17.9 శాతం, పశ్చిమ గోదావరి 14.5 శాతం పాజిటివిటీ రేటు నమోదైంది. గత వారంలో ప్రకాశం జిల్లా మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో 10 శాతంపై పాజిటివిటీ రేటు ఉంది. ఈ వారం అక్కడ కూడా ‘బోర్డర్’ దాటేసింది.
ఇంకా మీనమేషాలే...
ప్రస్తుత పరిస్థితుల్లో వైర్స నియంత్రణకు పూర్తిస్థాయి లాక్డౌన్ తప్ప మరోమార్గం లేదు. కానీ ఆరు గంటలు అన్ని రకాల మినహాయింపులు ఇచ్చి, ఆ తర్వాత పలు సడలింపులతో కూడిన కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు 2 వారాల పాటు లాక్డౌన్లు విధించాయి. ఒడిసా, తమిళనాడు, కర్ణాటకతోపాటు ఇప్పుడు తెలంగాణ కూడా కఠిన ఆంక్షలు అమలులోకి తెచ్చింది.
‘సరిహద్దు’లు దాటి
కర్ణాటకతో సరిహద్దులు ఉన్న ఉన్న అనంతపురం 37.2 శాతం పాజిటివిటీతో టాప్‌లో ఉంది. చిత్తూరుకు కర్ణాటక, తమిళనాడుతో సరిహద్దులున్నాయి. ఆ జిల్లా పాజిటివిటీ రేటు 36 శాతం నమోదై రాష్ట్రంలో రెండో స్థానంలో ఉంది ఇక... ఒడిసాతో సరిహద్దులున్న విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో దాదాపు 30 శాతం పాజిటివిటీ నమోదు అవుతోంది. తమిళనాడుకు అతి చేరువలో ఉన్న నెల్లూరులో 28.1 శాతం పాజిటివిటీఉంది. ఇలా ఐదు సరిహద్దు జిల్లాలను కరోనా ముంచేస్తోంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరముంది.