కాలగర్భంలో కారాగారం

ABN , First Publish Date - 2021-06-14T05:23:19+05:30 IST

వరంగల్‌కు తలమానికంగా నిలిచిన వరంగల్‌ కేంద్ర కారాగారం కాలగర్భంలో కలిసిపోయింది. 135 ఏళ్ల చరిత్ర గల జైలు గోడలు బద్దలయ్యాయి. శనివారం భారీ భద్రత నడుమ జైలు కూల్చివేతలు చేపట్టగా, ఆదివారం పూర్తి స్థాయిలో నేలమట్టం చేశారు. వరంగల్‌ జైలు కూల్చివేత ప్రక్రియలో అధికారులు గోప్యతను పాటించారు.

కాలగర్భంలో కారాగారం

పూర్తిస్థాయిలో వరంగల్‌ సెంట్రల్‌ జైలు నేలమట్టం
రెండో రోజూ కొనసాగిన కూల్చివేతలు
6వ నిజాం మహబూబ్‌ అలీఖాన్‌ కాలంలో నిర్మాణం
దేశంలోనే పేరెన్నిక.. 135 ఏళ్ల జైలు చరిత్రకు తెర


వరంగల్‌ అర్బన్‌ క్రైం, జూన్‌ 13: వరంగల్‌కు తలమానికంగా నిలిచిన వరంగల్‌ కేంద్ర కారాగారం కాలగర్భంలో కలిసిపోయింది. 135 ఏళ్ల చరిత్ర గల జైలు గోడలు బద్దలయ్యాయి. శనివారం భారీ భద్రత నడుమ జైలు కూల్చివేతలు చేపట్టగా, ఆదివారం పూర్తి స్థాయిలో నేలమట్టం చేశారు. వరంగల్‌ జైలు కూల్చివేత ప్రక్రియలో అధికారులు గోప్యతను పాటించారు. మీడియాను రాకుండా అడ్డుకొని జైలు గేట్లు మూసివేసి భారీ బందోబస్తు నడుమ కూల్చివేశారు. ములుగు రోడ్డు నుంచి ఎంజీఎం వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు పెట్టారు. జైలు ఆధ్వర్యంలో నడిచే పెట్రోలు పంపులను సైతం మూసివేశారు.

ఘనమైన చరిత్ర
ఆరో నిజాం మీర్‌ మహబూబా అలీఖాన్‌ పాలనా కాలం లో 1886లో సెంట్రల్‌ జైలు ఏర్పడింది. నిజాం కాలంలో ముఖ్యమైన విభాగాల్లో బ్రిటీష్‌ అధికారులు కూడా విధులు నిర్వర్తించేవారు. హన్కిన్‌ అనే అనే అధికారి జైళ్లశాఖ బాధ్యతలు తీసుకున్న తర్వాత జైళ్ల నిర్వహణలో గణనీయమైన మార్పు వచ్చింది. విశాలమైన ప్రాంతంలో జైలు నిర్మాణం జరిగింది. దేశ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న వారెందరినో ఈ జైలులోనే ఖైదు చేశారు. వరంగల్‌ పరిసర ప్రాంత వారినే కాకుండా నిజాం ఏలుబడిలో ఉన్న ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి ఖైదీలను తీసుకువచ్చేవారు.

పటిష్టమైన భద్రత
వరంగల్‌ సెంట్రల్‌ జైలు 54.5 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దేశంలోనే అత్యాధునిక, పటిష్ట భద్రతతో నిర్మించిన కారాగారాల్లో వరంగల్‌ కేంద్ర కారాగారం ముందు వరుసలో ఉంటుంది. భద్రతతో పాటు పరిశుభ్రత, ఖైదీల్లో పరివర్తనకు మారుపేరుగా జైలు నిలిచింది. ఈ జైలులో పీపుల్స్‌వార్‌ వ్యవస్థాపకులైన కాసు సన్యాల్‌, ప్రజాకవి కాళోజీ, దాశరథి, మావోయిస్టు అగ్రనేత గణపతిలాంటి ఎందరో జైలు జీవితం గడిపారు. ఉగ్రవాదులను సైతం ఈ జైలులో నిర్బంధించారు. భారత్‌ను సందర్శించిన అనేక మంది విదేశీ చరిత్రకారులు తమ గ్రంథాల్లో వరంగల్‌ కేంద్ర కారాగారం గురించి పేర్కొనడం విశేషం. ఈ జైలులో ఉత్పత్తి అయ్యే తివాచీలకు అంతర్జాతీయంగా డిమాండ్‌ ఉండేది. ఖైదీల ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి చేసేవారు.

సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి కోసం..
వరంగల్‌ సెంట్రల్‌ జైలు ప్రాంతంలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గత నెల 21వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరంగల్‌ నగర పర్యటనలో భాగంగా ఎంజీఎం ఆస్పత్రిలో కొవిడ్‌ వార్డును సందర్శించారు. ఆ సమయంలో వరంగల్‌ కేంద్ర కారాగారాన్ని వైద్యశాఖకు అప్పగించాలని ఆయన మౌఖిక ఆదేశాలు జారీ చేశా రు. ఈ క్రమంలో వరంగల్‌ సెంట్రల్‌ జైలు నుంచి ఖైదీలను, సామగ్రిని తరలించారు. జైలు స్థలానికి సంబంధించిన పత్రాలను వైద్య, ఆరోగ్యశాఖ అధికారులకు అప్పజెప్పారు. ఈ మే రకు కూల్చివేతలు ప్రారంభించి పూర్తిగా నేలమట్టం చేశారు.






ప్రక్రియ ఇలా..
మే 21 - ముఖ్యమంత్రి కేసీఆర్‌ సెంట్రల్‌ జైలు సందర్శన
జూన్‌ 1 - సెంట్రల్‌ జైలును సందర్శించిన జైళ్ల శాఖ డీజీ రాజీవ్‌ త్రివేది, ఖైదీల తరలింపు ప్రారంభం
జూన్‌ 7 - సెంట్రల్‌ జైలును రెండోసారి సందర్శించిన జైళ్ల శాఖ డీజీ రాజీవ్‌ త్రివేది
జూన్‌ 11 - సెంట్రల్‌ జైలు స్థల పత్రాలు వైద్య, ఆరోగ్యశాఖకు అప్పగింత
జూన్‌ - 12 - కూల్చివేతలు ప్రారంభం
జూన్‌ - 13 - సెంట్రల్‌ జైలు పూర్తిగా నేలమట్టం.


21న సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి అంకురార్పణ
శంకుస్థాపన చేయనున్న సీఎం
అర్బన్‌ కలెక్టరేట్‌ సైతం ప్రారంభం

హన్మకొండ టౌన్‌, జూన్‌ 13: వరంగల్‌ సెంట్రల్‌ జైలు స్థలంలో ఏర్పాటు చేయనున్న సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈనెల 21న శంకుస్థాపన చేయనున్నారు. అలాగే వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టరేట్‌ నూతన కార్యాలయాన్ని కూడా ప్రారంభించనున్నారు. గత నెల 21న సీఎం ఎంజీఎంను సందర్శించి కరోనా బాధితులకు అందుతున్న వైద్య సదుపాయాలను పరిశీలించడంతో పాటు సెంట్రల్‌ జైలును సందర్శించారు. మళ్లీ నెల రోజులకు మరోసారి జిల్లాకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ రానున్నారు. కేసీఆర్‌ పర్యటనను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.







Updated Date - 2021-06-14T05:23:19+05:30 IST