ప‘రేషన్‌’!

ABN , First Publish Date - 2020-03-22T10:38:46+05:30 IST

ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్లు.. వలంటీర్లు చేసిన తప్పులకూ రేషన్‌ డీలర్లు శిక్ష అనుభవించాల్సిన దుస్థితి రాష్ట్రంలో ఎదురవుతోంది. శ్రీకాకుళం జిల్లాలో...

ప‘రేషన్‌’!

  • బియ్యం తిరిగివ్వని వలంటీర్లు
  • 1900 మంది డీలర్లపై కేసులకు సిద్ధం?
  • తాజాగా మరోసారి నోటీసులు
  • సిక్కోలు జిల్లాలో ‘ప్రయోగాత్మక’ ఫలితం!
  • తమనెలా బాధ్యులను చేస్తారంటున్న డీలర్లు


అమరావతి, మార్చి 21(ఆంధ్రజ్యోతి): ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్లు.. వలంటీర్లు చేసిన తప్పులకూ రేషన్‌ డీలర్లు శిక్ష అనుభవించాల్సిన దుస్థితి రాష్ట్రంలో ఎదురవుతోంది. శ్రీకాకుళం జిల్లాలో ప్రభుత్వం గత ఏడాది ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఇంటింటికీ రేషన్‌ కార్యక్రమం చివరికి డీలర్లపై కేసులకు దారితీస్తోంది. వలంటీర్ల ద్వారా చేసిన పంపిణీలో మిగిలిపోయిన సరుకులు పౌరసరఫరాల శాఖకు తిరిగి పంపనందుకుగాను.. నగదు అయినా చెల్లించాలని లేదా కేసులు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులు డీలర్లకు హెచ్చరికలు జారీచేశారు. సుమారు 1900 మంది డీలర్లపై కేసులు నమోదు పెట్టొచ్చని అంచనా.


అధికారులదే తప్పు??

జిల్లాలో అధికారులు చేసిన పొరపాటు వల్ల సరుకులు పెద్దఎత్తున పక్కదారి పట్టాయి. సరుకుల పంపిణీ కోసం కార్డుదారులు వేలిముద్రలు వేయాలనే నిబంధన ఉండగా, కార్డుదారులతో పాటు వలంటీర్లు వేసినా సరుకులు పంపిణీ చేయొచ్చనే అవకాశం కల్పించారు. దీంతో అనేక చోట్ల కార్డుదారులు తీసుకోకపోయినా సరుకులు పంపిణీ చేసినట్లుగా లెక్కలు చూపించారు. ఈ వ్యవహారం పెద్దది కావడంతో విచారణ చేసిన అధికారులు వలంటీర్లు పంపిణీ చేసిన సరుకుల్లో కార్డుదారులకు చేరని వాటికి సంబంధించిన సరుకులు తిరిగి పంపాలని ఆదేశించారు.


సాధారణంగా ప్రతినెలా మిగిలిపోయిన సరుకులను డీలర్లు రిటర్న్‌ స్టాకుగా వెనక్కి పంపుతారు. కానీ వలంటీర్ల ద్వారా జరిగిన పంపిణీలో పెద్దఎత్తున సరుకులు వెనక్కి వెళ్లలేదు. అయితే దానిని సంబంధిత రేషన్‌ డీలర్లను బాధ్యులను చేస్తూ వారు నగదు చెల్లించాలని అధికారులు ఇప్పుడు ఆదేశాలు జారీచేశారు. సెప్టెంబరు, అక్టోబరు నెలలకు సంబంధించి 10,022 క్వింటాళ్లు బియ్యం రిటర్న్‌ కాలేదని, దానికి కిలోకు రూ.36 చొప్పున నగదు చెల్లించాలని దాదాపు 1900 మంది డీలర్లకు నోటీసులు జారీచేశారు. తొలుత ఫిబ్రవరి 5 చివరి తేదీగా నిర్ణయించగా, తర్వాత పొడిగిస్తూ వచ్చారు. తాజాగా మరోసారి డీలర్లకు నోటీసులు ఇచ్చారు. నగదు చెల్లించకపోతే కేసులు పెడతామని స్పష్టంచేస్తున్నారు.


మాకేం సంబంధం?

అసలు సరుకుల పంపిణీయే తాము చేయడం లేదని, వలంటీర్లు సరుకులు తిరిగి ఇవ్వకపోతే తామేం చేయాలని డీలర్లు ప్రశ్నిస్తున్నారు. వలంటీర్ల తప్పులకు తమపై ఎలా కేసులు పెడతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2020-03-22T10:38:46+05:30 IST