విజయనగరం YCPలో విభేదాలు

ABN , First Publish Date - 2022-06-12T00:08:17+05:30 IST

విజయనగరం జిల్లాలో వైసీపీ నాయకుల్లో ఉన్న అంతర్గత విభేదాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి.

విజయనగరం YCPలో విభేదాలు

విజయనగరం: విజయనగరం జిల్లాలో వైసీపీ నాయకుల్లో ఉన్న అంతర్గత విభేదాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. నియోజకవర్గాల్లో పట్టు సాధించేందుకు నాయకులు ఎవరికి వారు ప్రయతిస్తుండడంతో విభేదాలు ముదురుతున్నాయి. ప్రధానంగా శృంగవరపుకోట నియోజకవర్గంలో ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ రఘురాజుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇక్కడ కేడర్‌ రెండు చీలిపోయింది. తాజాగా ఎస్‌.కోట మేజర్‌ పంచాయతీలో స్థల వివాదం వెనుక ఇద్దరు నాయకులు ఉన్నట్టు తెలుస్తోంది. వీరి మధ్య అధికార యంత్రాంగం నలిగిపోతోంది. 


ఎమ్మెల్యే కోలగట్లకు వ్యతిరేకంగా మంత్రి బొత్స గ్రూపు కొనసాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో వీరి మధ్య విభేదాలు పొడచూపాయి. బయటకు మాత్రం బాగానే ఉన్నట్టు కనిపిస్తున్నా లోలోన ఒకరిపై ఒకరికి వ్యతిరేక భావన ఉంది. కోలగట్ల ఓసీ కావడంతో.. తాజాగా బీసీ నినాదాన్ని తెరపైకి తెస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీసీ వ్యక్తికే టిక్కెట్‌ కేటాయించాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. దీని వెనుక బొత్స వర్గం వ్యూహం ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 


అలాగే నెల్లిమర్ల నియోజవర్గంలో  మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబసభ్యుల ప్రమేయాన్ని స్థానిక ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బొత్స కుటుంబసభ్యులపై ఆయన అధిష్టాన పెద్దలకు ఫిర్యాదు సైతం చేశారు. అప్పటి నుంచి స్తబ్ధుగా ఉన్నా ఇక్కడ చాపకింద నీరులా విభేదాలు కొనసాగుతున్నాయన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మిగతా నియోజకవర్గాల్లో మండలస్థాయి నాయకుల మఽధయ విభేదాలు కొనసాగుతున్నాయి.

Updated Date - 2022-06-12T00:08:17+05:30 IST