Abn logo
Mar 4 2021 @ 00:15AM

రెక్కలు లేకున్నా నింగికి ఎగిరింది

మనలోని లోపం, బలహీనతకు మన కలల దారికి అడ్డుగా నిలిచే అవకాశం ఇవ్వకూడదు. జన్యులోపం వల్ల పుట్టుకతోనే చేతులు లేని బ్రెజిల్‌కు చెందిన విటోరియా బుయెనో కూడా అదే పని చేసింది. చేతులు లేవని విధిని తిట్టుకుంటూ కూర్చోలేదామె. కాళ్లతో తన కలల దారిలో నడవాలనుకుంది. ‘‘మనలోని లోపాల కన్నా మనం చాలా గొప్పవాళ్లం. అందుకే మన కలల్ని నిజం చేసుకొనే దిశగా ప్రయాణం చేస్తూనే ఉండాలి’’ అనడం శిఖరమంతటి ఆమె ఆత్మవిశ్వాసానికి ప్రతీక. సంకల్ప బలమే రెక్కలుగా డ్యాన్స్‌లో రాణిస్తూ, సామాజిక మాధ్యమాల్లో ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్న ఈ 16 ఏళ్ల యువతి విజయమిది...


విటోరియా బుయెనోది బ్రెజిల్‌లోని సాంటా రీటా డో సపుసాయి అనే చిన్న పట్టణం. జన్యులోపం ఆమెను చేతులు లేని వ్యక్తిని చేసింది. కాళ్లనే చేతులుగా, కాళ్లుగా ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి ఆమెది. అలాగని చిన్నారి విటోరియా కుంగిపోలేదు. ఆమెకు చికిత్స అందించే ఫిజియోథెరపిస్ట్‌ తను డ్యాన్సర్‌గా రాణించగలదని నమ్మారు. అదేవిషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పారు. అలా అయిదేళ్ల వయసులోనే విటోరియాను ఆమె తల్లి వాండ బ్యాలెట్‌ డ్యాన్స్‌ (ఏదైనా కథ, సందేశాన్ని డ్యాన్స్‌ ద్వారా తెలియజేయడమే బ్యాలెట్‌ డ్యాన్స్‌) క్లాసులో చేర్పించారు. కానీ తన కూతురు డ్యాన్స్‌ చేయగలుగుతుందా?అనే బెంగ ఆమెను వెంటాడుతూనే ఉండేది. విటోరియా బ్యాలెట్‌ డ్యాన్స్‌ క్లాస్‌లో చేరిందని తెలిసిన స్థానికులలో ‘చేతులు లేని ఈ పిల్ల డ్యాన్స్‌ ఎలా చేస్తుందబ్బా! అన్న ఆసక్తి పెరిగింది. ఆమె డ్యాన్స్‌ సాధన చేస్తుంటే చూసేందుకు ఇరుగుపొరుగు వాళ్ల ఇంటి ముందు పోగయ్యేవారు. కొందరైతే ఆమెకు చేతులు లేవనే విషయాన్ని గుర్తు చేసేలా ప్రవర్తించేవారు. నింగికి ఎగరాలనుకున్న ఆమెను నేలపైనే పట్టి ఉంచే ఇలాంటి అవమానాలను చిరునవ్వుతో స్వీకరించేది విటోరియా.


విధిని గెలిచిందిలా...

డ్యాన్స్‌తో జీవితాన్ని కొత్తగా మలచుకోవాలనుకున్న విటోరియా అడుగులే సవాళ్లు విసిరాయి. డ్యాన్స్‌ చేయాలంటే శరీరం దృఢంగా, విల్లులా ఉండాలి. గాల్లో విన్యాసాలు చేయాలి. బ్రష్‌ పట్టి పళ్లు తోముకోవడంతో మొదలు తినడం, సూపర్‌మార్కెట్‌లో కాలివేళ్ల సాయంతో వస్తువులు తీసుకోవడం... ఇలా అన్ని పనులు కాళ్లతోనే చేసుకొనే విటోరియాకు శరీరాన్ని బ్యాలెన్స్‌ చేయడం మొదట్లో అత్యంత కష్టంగా అనిపించింది. పట్టువదలకుండా సాధన చేసి తన ఒంటిని డ్యాన్స్‌ చేయడానికి అనువుగా మార్చుకుంది. డ్యాన్స్‌లో మెలకువలు నేర్చుకుంది. ‘‘నా వరకైతే చేతులు లేవనేది అంత ముఖ్యమైన విషయం కాదు’’ అని భావించే విటోరియా డ్యాన్స్‌ చేస్తున్నప్పుడు తనకు చేతులు లేవనే సంగతే మరిచిపోయేది. తెలుపు, నీలం, ఆకపచ్చ రంగు గౌను ధరించి తోటి డ్యాన్సర్లతో బ్యాలెట్‌ డ్యాన్స్‌ చేస్తున్న విటోరియాను చూసిన ప్రతి ఒక్కరూ తను చేతులు లేకున్నా కూడా డ్యాన్స్‌ చేయగలదనే అనుకుంటారు. 


ఆకట్టుకునే హావభావాలతో కట్టిపడేసే విటోరియా అచంచలమైన ఆత్మవిశ్వాసంతో విధిపై గెలిచింది. తన ప్రతిభను కాకుండా లోపాన్ని మాత్రమే చూసే మనషులను గెలిచింది. వైకల్యం ఉన్నంత మాత్రన కలలు కనడం ఆపేయొద్దని, ఆ వైకల్యాన్ని కలల ప్రయాణానికి అడ్డుగోడగా మారనివ్వకూడదని చాటిన విటోరియా సామాజిక మాధ్యమాల్లో ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. చిన్న చిన్న విషయాల్లోనే సంతోషాన్ని వెతుక్కోవాలని చెబుతున్న విటోరియాను ఇన్‌స్టాగ్రామ్‌లో అనుసరించే వాళ్లు లక్షాయాభై వేలకు పైగానే ఉన్నారంటే ఆమె కథ ఎంతమందిని కదిలించిందో తెలుస్తుంది.


‘‘నా వరకైతే చేతులు లేవనేది అంత ముఖ్యమైన విషయం కాదు’’ డ్యాన్స్‌ చేస్తున్నప్పుడు నాకు చేతులు లేవనే సంగతే మరిచిపోయేదాన్ని. కళ్లతోనే తోటి డ్యాన్సర్లను గమనిస్తూ స్టెప్పులు వేసేదాన్ని. 

ప్రత్యేకం మరిన్ని...