విశ్వదాభిరామ వినవే భామ

ABN , First Publish Date - 2021-03-24T08:02:22+05:30 IST

తెల్లారినా బద్ధకంగా దుప్పటి తన్ని పడుకునే ఉంటుంది పెళ్లీడుకొచ్చిన ఓ యువతి. ఆమే కథానాయిక. ఇంతలో తన ఫోన్‌ రింగ్‌ అవుతుంది. ‘ఏమే... అను పెళ్లి ఫిక్సయింది తెలుసా?

విశ్వదాభిరామ వినవే భామ

తెల్లారినా బద్ధకంగా దుప్పటి తన్ని పడుకునే ఉంటుంది పెళ్లీడుకొచ్చిన ఓ యువతి. ఆమే కథానాయిక. ఇంతలో తన ఫోన్‌ రింగ్‌ అవుతుంది. ‘ఏమే... అను పెళ్లి ఫిక్సయింది తెలుసా? కాబోయేవాడు మహేశ్‌బాబులా ఉంటాడు’... చెబుతుంది అవతల నుంచి స్నేహితురాలు. ఒక్క దెబ్బకు నిద్దర మత్తు వదులుతుంది ఆమెకు. చటుక్కున లేచి, అద్దంలో చూసుకొంటూ... ‘ఏ యాంగిల్‌లో చూసినా వాళ్లకంటే సూపర్‌ ఫిగర్‌ని. వాళ్లకే అలాంటోడు వస్తే... మరి నాకు? మహేశ్‌లా గ్లామర్‌గా... ప్రభాస్‌లా ఎత్తుగా... రానాలా సిక్స్‌ ప్యాక్‌ ఉండాలి’ అనుకొంటూ వెంటనే వెళ్లి తనకు పెళ్లి చేయమని తల్లిని అడుగుతుంది. ‘ఇన్నాళ్లకు పెళ్లి చేసుకొంటానన్నావు. మన చుట్టాలబ్బాయి ఉన్నాడు. పిలవమంటావా’... అడుగుతుంది తల్లి. ‘పిలవక్కర్లేదు. అతనికి నా ఫోన్‌ నంబర్‌ ఇవ్వు. ఎక్కడ కలవాలో నేనే చెబుతా’ అంటుంది కూతురు. ఈ సన్నివేశంతో యూట్యూబ్‌లో విడుదలైన ‘విశ్వదాభిరామ వినవే భామ’ లఘుచిత్రం ప్రారంభమవుతుంది. కట్‌ చేస్తే... రెస్టారెంట్‌లో ఓ టేబుల్‌ దగ్గర చీర కట్టుకుని వేచి ఉంటుంది నాయిక. చుట్టాలబ్బాయి నుంచి కాల్‌... ‘మీరు ఎక్కడున్నారు’... అడుగుతాడు అతడు. ‘కాఫీ షాప్‌లో’... బదులిస్తుంది. ‘రెండు నిమిషాల్లో అక్కడుంటా’నంటాడు. ఈలోపు అతడిని ఎంతో అందంగా ఊహించుకుంటుంది తను. ఎవరో వచ్చి తన ముందు కూర్చుంటారు. ‘మీరు...’ అనేలోగా ‘నేనే... మీకోసం వస్తానంది’ అంటాడు. అతడిని చూడగానే నీరుగారిపోతుంది అమ్మాయి. చూడ్డానికి బిలో యావరేజ్‌. కలలన్నీ కరిగిపోయినట్టు దిగాలుపడుతుంది. వచ్చినవాడి ముఖం మీదే చెప్పేసి వెళ్లిపోతే బాగుండదని మాట కలుపుతుంది. ‘మీరు నాకు నచ్చలేదు’ అని చివరకు ఎలాగో చెప్పేస్తుంది. అతడు షాకవుతాడు. ఓ క్షణం ఆగి... ‘అదేంటండీ అలా చెప్పేశారు? కొద్దిగానన్నా మొహమాటం లేకుండా’... అతడిలో ఆశ్చర్యం. ‘ఏమోనండీ... నాకు ఎలా చెప్పాలో తెలియద’నగానే మరో షాక్‌. ‘కాబోయేవాడిలో మీకేవో క్వాలిటీస్‌ కావాలన్నారు. అవన్నీ నాలో ఉన్నా మీకు ఓకేనా?’. ఇప్పుడు అమ్మాయి అయోమయంలో పడుతుంది. ‘బ్యూటీ పార్లర్‌కు వెళ్లి రోజుకు గంట గడిపాననుకోండి... మహేశ్‌ అంత కాకపోయినా నేను ఇప్పటి కంటే అందంగా కనిపిస్తా. జిమ్‌ మనింటి పక్కనే. కష్టపడితే సిక్స్‌ ప్యాక్‌ కష్టమేమీ కాదు. ఇక డబ్బు కావాలన్నారు. నాకు నలభై వేలు జీతం. రెండు గంటలు ఓవర్‌టైమ్‌ చేస్తే మరో పదివేలు వస్తాయి. ఆ పది నేను వాడుకున్నా... మిగిలిన నలభై మీవే. మీ ఇష్టం వచ్చినట్టు ఖర్చుపెట్టుకోవచ్చు. తరువాత బాగా చూసుకోవాలన్నారు. కానీ వీటన్నింటికే నా టైమ్‌ సరిపోతే ఇక మిమ్మల్ని ఎలా చూసుకోను? మిమ్మల్ని ఆనందంగా ఎలా ఉంచగలను? అసలు ఇవన్నీ నా దగ్గర ఉంటే మిమ్మల్ని చేసుకోవాల్సిన అవసరం ఏమిటి? ఆలోచించండి’ అంటాడు. మరి దానికి ఆమె పడిపోయిందా? అదే పట్టున కూర్చుందా? ముగింపు డిజిటల్‌ తెరపై చూస్తేనే బాగుంటుంది. విద్యాసాగర్‌, అఖిలారెడ్డి ఇందులో ప్రధాన పాత్రధారులు. కథ, దర్శకత్వం కృష్ణ వర్మ. ఇప్పటికి లక్షమందికి పైగా వీక్షించారు. లైక్‌లూ వేలల్లోనే ఉన్నాయి.

Updated Date - 2021-03-24T08:02:22+05:30 IST