వైజాగ్ స్టీల్ ప్లాంట్ కుట్ర వెనుక సంచలన నిజాలు

ABN , First Publish Date - 2021-02-28T07:59:36+05:30 IST

‘ఆంధ్రుల హక్కు’గా సాధించుకున్న విశాఖ ఉక్కుపై కుట్రలు ఏడాదిన్నర కిందటే మొదలయ్యాయా? విశాఖ ఉక్కు ఆవరణలో జాగా తీసుకుని... ఆ తర్వాత మొత్తంగా పాగా వేయాలన్న దక్షిణ కొరియా స్టీల్‌ కంపెనీ ‘పోస్కో’ లక్ష్యానికి అనుగుణంగా పావులు

వైజాగ్ స్టీల్ ప్లాంట్ కుట్ర వెనుక సంచలన నిజాలు

‘పోస్కో’కు సలాం!

ఒప్పందం పేరిట విశాఖ ఉక్కుపై స్వారీ

ఇన్నాళ్లకు బయటపడ్డ ‘చీకటి డీల్‌’

కొత్త ఫ్యాక్టరీ కోసం జాయింట్‌ వెంచర్‌

అందులో.. పోస్కో వాటా నగదు రూపంలో

1167 ఎకరాలు సమకూర్చాల్సిన విశాఖ ఉక్కు

అది కూడా గంగవరం పోర్టు సమీపంలో

అనుమతుల బాధ్యత విశాఖ ఉక్కుదే

భవిష్యత్తులో ‘మూడో వ్యక్తి’కీ చోటు

వివాదాలొస్తే సింగపూర్‌లోనే తేల్చుకోవాలి

ఒప్పందం గురించి ఎవరూ బయటపెట్టొద్దు

ఉత్పత్తులను పోస్కోకు ‘తగిన’ ధరకు అమ్మాలి

ఆర్‌టీఐ చట్టంతో బయటపడ్డ సంగతులు


ఒప్పందం అంటే ఇరువురికీ లాభదాయకంగా ఉండాలి! ఇరుపక్షాలూ సమాన బాధ్యతతో మెలగాలి. కానీ... దక్షిణ కొరియా స్టీల్‌ కంపెనీ ‘పోస్కో’తో విశాఖ ఉక్కు కర్మాగారం (ఆర్‌ఐఎన్‌ఎల్‌) కుదుర్చుకున్న ఒప్పందంలో ఇదేమీ కనిపించదు! అంతా ఏకపక్షమే! ప్రైవేటు పోస్కోకు విశాఖ ఉక్కు దాసోహమే!  ఎలాగో మీరూ చూడండి!


(విశాఖపట్నం - ఆంధ్రజ్యోతి)

‘ఆంధ్రుల హక్కు’గా సాధించుకున్న విశాఖ ఉక్కుపై కుట్రలు ఏడాదిన్నర కిందటే మొదలయ్యాయా? విశాఖ ఉక్కు ఆవరణలో జాగా తీసుకుని... ఆ తర్వాత మొత్తంగా పాగా వేయాలన్న దక్షిణ కొరియా స్టీల్‌ కంపెనీ ‘పోస్కో’ లక్ష్యానికి అనుగుణంగా పావులు కదిలాయా? ఈ రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం సారాంశాన్ని పరిశీలిస్తే... ఈ సందేహాలు బలపడకమానవు! ఏడాదిన్నర కిందట కుదిరిన ఈ ఒప్పందాన్ని ఇప్పటిదాకా ‘చీకట్లో’ పెట్టారు. ఇటీవల రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఉక్కు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఈ ఒప్పందం గురించి చూచాయగా వెల్లడించారు. ఇప్పుడు... విశాఖకు చెందిన ఒక సామాజిక కార్యకర్త సమాచార హక్కు ద్వారా ఈ ఒప్పంద ప్రతిని సంపాదించారు. దీనిని పరిశీలిస్తే... మొత్తం వ్యవహారం పోస్కోకు అనుకూలంగా సాగినట్లు ఇట్లే తెలుస్తుంది. 


కూల్‌గా పాగా...

ఇప్పుడున్న పరిస్థితుల్లో భారీ పరిశ్రమల ఏర్పాటుకు స్థల సేకరణ ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అది కూడా... విశాఖలాంటి నగరంలో 1167 ఎకరాలు సేకరించడం మాటలు కాదు! కానీ... ‘జాయింట్‌ వెంచర్‌ కంపెనీ’ (జేవీసీ) పేరుతో పోస్కో సంస్థ ఎంచక్కా విశాఖ ఉక్కు ఆవరణలోనే, అది కూడా గంగవరం పోర్టు సమీపంలో 1167 ఎకరాల్లో పాగా వేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. కొత్త కర్మాగారం ఏర్పాటుకు పోస్కో నగదు రూపంలో పెట్టుబడి పెడుతుంది. విశాఖ ఉక్కు తన వాటాగా భూమిని అందిస్తుందని ఒప్పందంలో పేర్కొన్నారు. అంతేకాదు... మున్ముందు అవసరమైతే, పోస్కో కోరితే విశాఖ ఉక్కు ఆవరణలోనే మరింత భూమిని కూడా ఇచ్చేందుకు అంగీకరించడం గమనార్హం. నిజానికి... ఈ భూమి మొత్తం విశాఖ ఉక్కు కోసం నిర్వాసితులు ఇచ్చినదే. దానిని ప్రైవేటుకు కట్టబెట్టాలనుకోవడమే ఘోరం.


సింగపూర్‌ చట్టాలే... 

భారతదేశంలో... భారత ప్రభుత్వరంగ సంస్థతో కుదుర్చుకునే ఒప్పందం... భారతదేశ చట్టాలకు లోబడి ఉండాలి. కానీ... ఎందుకో, ఏమిటో తెలియదుకానీ ఈ ఎంవోయూ సింగపూర్‌ చట్టాలకు లోబడి ఉంటుందని ఒప్పందంలో పేర్కొన్నారు. ఏ వివాదాలు తలెత్తినా సింగపూర్‌ కోర్టులోనే పరిష్కరించుకోవాలట! సింగపూర్‌ ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ నిబంధనలను కూడా ఈ ఒప్పందంలో చేర్చినట్లుగా భావించి, వాటికి అంగీకరిస్తున్నామనే క్లాజ్‌ను ఇందులో పొందుపరిచారు.


సొంతానికి ‘అమ్మకం’

కొత్తగా ఏర్పాటు చేసే కర్మాగారంలో తయారు చేసే హాట్‌రోల్డ్‌ కాయిల్స్‌ను మహారాష్ట్రలో ఇప్పటికే ఉన్న పోస్కో కర్మాగారానికి విక్రయించాలనే (ప్రిఫరెన్షియల్‌ రైట్‌) ‘నిబంధన’ను కూడా ఈ ఎంవోయూలో చేర్చారు. పోస్కో-మహారాష్ట్ర కోరుకునే నాణ్యత, గ్రేడ్‌, ఆకృతిలో ఈ ఉత్పత్తులు ఉండాలని పేర్కొన్నారు. ధర కూడా పోస్కోకు ఆమోదయోగ్యంగా (కాంపిటీటివ్‌ ప్రైస్‌) ఉండాలని పేర్కొనడం గమనార్హం. 


ఇంకో ఆరునెలలు... ఆ తర్వాత?

పోస్కో కంపెనీ, విశాఖ ఉక్కు మధ్య 2019 అక్టోబరు 23వ తేదీన ఈ ఒప్పందం కుదిరింది. ఇందులో... 7వ క్లాజ్‌ (గోప్యత, వ్యయం తదితర అంశాలున్నది ఇందులోనే) మినహా... మిగిలినవన్నీ ‘నాన్‌ బైండింగ్‌’గా పేర్కొన్నారు. అంటే... ఎవరికి ఇష్టం లేకపోయినా ఒప్పందం నుంచి వైదొలగవచ్చు. ఈ ఒప్పందంపై ఉక్కు కర్మాగారం ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ కేకే ఘోష్‌, పోస్కో సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కేసీ కిమ్‌ సంతకాలు చేశారు. ఈ ఒప్పందం రెండేళ్లు అమలులో ఉంటుంది. అవసరమనుకుంటే మరో ఏడాది పొడిగించుకోవచ్చునని తెలిపారు. అప్పటిదాకా విశాఖ ఉక్కుపై ‘పోస్కో’ కత్తి వేలాడుతూనే ఉంటుంది.


డబ్బు మాది.. బాధ్యత మీది!

ఇది పేరుకే ‘జాయింట్‌’ వెంచర్‌ కంపెనీ! కానీ... ఇందులో  పోస్కో బాధ్యత నగదు పెట్టుబడితో సరి. మిగిలిన ‘తలనొప్పు’లన్నీ విశాఖ ఉక్కువే. ఉదాహరణకు... కొత్త ఫ్యాక్టరీ ఏర్పాటుకు లైసెన్సులు, పర్యావరణ అనుమతులు సంపాదించే బాధ్యత విశాఖ ఉక్కుదే. విద్యుత్తు, నీరు, ఇతరత్రా అవసరాలకు ‘క్లియరెన్స్‌’లు తెప్పించే బాధ్యత కూడా ఆ సంస్థదే. కొత్త ఫ్యాక్టరీ కోసం గంగవరం పోర్టును వాడుకునేందుకు కూడా అనుమతించాలి. కొత్త ఫ్యాక్టరీకి అవసరమైన రైలు, రోడ్డు, ఇతర మౌలిక సదుపాయాలకు అనుమతులు కూడా విశాఖ ఉక్కే తెప్పించుకోవాలి. ఇలా అన్ని అనుమతులూ తెచ్చి పెడితే... తర్వాత ఫ్యాక్టరీ నిర్మాణానికి పోస్కో సహకరిస్తుందట! 


‘మూడో’ కన్ను!

ప్రస్తుతానికి ఇది పోస్కోకు, విశాఖ ఉక్కుకు మధ్య కుదిరిన ఒప్పందం! కానీ... ఇందులో ఒక వ్యూహాత్మక ‘నిబంధన’ చేర్చారు. అది... భవిష్యత్తులో అదనంగా మరొకరిని (థర్డ్‌ పార్టీ) కూడా భాగస్వామిగా చేర్చుకునే అవకాశం కల్పించడం! ఆ మూడో వ్యక్తి ఎవరు, ఆ అవసరం ఎందుకు వస్తుంది, ఎలా తీసుకొస్తారనే విషయాలు మాత్రం ఎంవోయూలో లేవు.


‘రహస్య’ ఒప్పందమే!

విశాఖ ఉక్కు అనేది ప్రభుత్వరంగ సంస్థ. వేల మంది కార్మికులు పని చేస్తున్న సంస్థ. అలాంటి కీలక సంస్థ మరో ప్రైవేటు సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు పారదర్శకత పాటించాలి. కానీ... ఎంవోయూలో దీనికి పాతరేశారు. ‘‘ఈ ఒప్పందం గురించి ఇరుపక్షాలలో ఎవరూ బహిరంగ ప్రకటన చేయకూడదు’’ అని ఒప్పందంలో పేర్కొన్నారు. ఒకవేళ బహిర్గతం చేయాలనుకుంటే... అవతలి పక్షం లిఖితపూర్వక అనుమతి ఉండాలనే నిబంధన విధించారు. ఒప్పందంపై ఇంత గోప్యత ఎందుకన్నదే ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్న. 

Updated Date - 2021-02-28T07:59:36+05:30 IST