Abn logo
Apr 16 2021 @ 04:48AM

విశాఖ పోర్టుకు క్రూయిజ్‌లు!

జెట్టీ, టెర్మినల్‌ నిర్మాణానికి సీఆర్‌జడ్‌ అనుమతి

కేంద్ర అటవీ, పర్యావరణ అనుమతులే ఆలస్యం

అంతర్జాతీయ టూరిస్టు నౌకలతో పర్యాటకానికి మహర్దశ

నిర్మాణాలకయ్యే 103 కోట్ల ఖర్చూ కేంద్ర శాఖలదే


విశాఖ నగర సిగలో మరో కలికితురాయి చేరుతోంది. అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా భాసిల్లడానికి అవసరమయ్యే హంగులను సమకూర్చుకోవడంలో తొలి అడుగు పడింది. విలాసవంతమైన ప్రయాణీకుల నౌకలు పోర్టులోకి రావడానికి అవసరమైన జెట్టీ, టెర్మినల్‌ నిర్మాణానికి కీలకమైన సీఆర్‌జడ్‌ అనుమతి వచ్చింది. కేంద్ర అటవీ, పర్యావరణ అనుమతులు వస్తే... ఏడాదిలోగా నిర్మాణాలు పూర్తి చేస్తామని పోర్టు చైర్మన్‌ ప్రకటించారు. 


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నం పోర్టులో క్రూయిజ్‌ జెట్టీ, టెర్మినల్‌ నిర్మాణానికి కోస్తా నియంత్రణ మండలి (సీఆర్‌జెడ్‌) పచ్చజెండా ఊపింది. ఇక కేంద్ర అటవీ, పర్యావరణ శాఖల నుంచి అనుమతి రావడమే మిగిలింది. ఆ రెండూ వచ్చిన వెంటనే నిర్మాణం ప్రారంభించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. క్రూయిజ్‌ టెర్మినల్‌ను ఏడాదిలోనే పూర్తి చేయాలని భావిస్తున్నారు. 


పర్యాటక అభివృద్ధే లక్ష్యంగా...

మేజరు పోర్టుల్లో పర్యాటకం కూడా ఒక కీలక అంశంగా వుండాలని కేంద్రం రెండేళ్ల క్రితం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని మేజరు పోర్టుల్లో అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకలకు అనువుగా క్రూయిజ్‌ టెర్మినళ్ల నిర్మాణానికి నడుం కట్టాలని ఆదేశించింది. దీనిని తొలుత విశాఖపట్నం పోర్టే ఆచరణలో పెట్టింది. 2019 మే నెలలో సిల్వర్‌ క్రూయిజ్‌ లైనర్స్‌తో సంప్రతించి, అంతర్జాతీయ క్రూయిజ్‌ లైనర్‌ ‘సిల్వర్‌ డిస్కవర్‌’ను రప్పించింది. అందులో అమెరికా, ఇంగ్లండ్‌, రష్యా తదితర దేశాలకు చెందిన 100 మంది ప్రయాణికులు వచ్చారు. వారికి ఘనంగా స్వాగతం పలికి సింహాచలం, కైలాసగిరి, భీమిలి, ఎర్రమట్టి దిబ్బలు, తొట్లకొండ, బొజ్జన్నకొండ వంటి పర్యాటక ప్రాంతాలకు తీసుకువెళ్లారు.


రూ.103 కోట్లతో ప్రతిపాదనలు

అంతర్జాతీయ క్రూయిజ్‌ లైనర్లు ఐదు నుంచి పదిహేను అంతస్థుల వరకు ఉంటాయి. 150 నుంచి 250 మీటర్ల పొడవు ఉంటాయి. ఒక్కో దాంట్లో 2,000 నుంచి 5,000 మంది ప్రయాణికులు ఉంటారు. అలాంటి క్రూయిజ్‌లు విశాఖపట్నం రావాలంటే... ప్రత్యేకంగా ఒక బెర్తు అవసరం. ఇందుకోసం చెన్నై ఐఐటీతో సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారు చేయించారు. 330 మీటర్ల పొడవు, 15 మీటర్ల వెడల్పు, 8 మీటర్ల డ్రాఫ్ట్‌(లోతు)తో ప్రత్యేకమైన బెర్తు నిర్మించాలని నిర్ణయించారు. దీనికి రూ.55 కోట్లు వ్యయం అవుతుందని అంచనా. అత్యంత ఖరీదైన క్రూయిజ్‌ లైనర్ల రక్షణ కోసం రూ.33 కోట్లతో తీరప్రాంత రక్షణ గోడ నిర్మించాలని ప్రతిపాదించారు.


అలాగే క్రూయిజ్‌ ప్రయాణీకుల కోసం రూ.22 కోట్లుతో టెర్మినల్‌ భవనం నిర్మించాలని ప్రతిపాదించారు. రెండు వేల చ.మీ. విస్తీర్ణంలో సుమారుగా 2,500 మంది పర్యాటకులు పట్టేలా దీనిని నిర్మిస్తారు. అక్కడే డ్యూటీ ఫ్రీ షాపు, రెస్టారెంట్‌, ఇమ్మిగ్రేషన్‌, కస్టమ్స్‌ కౌంటర్లు, బ్యాగేజీ స్కానర్లు ఉంటాయి. రాష్ట్రానికి చెందిన ఏటికొప్పాక బొమ్మలు, పొందూరు ఖద్దరు, పోచంపల్లి చీరలు, నోరూరించే ఆహార పదార్థాలు... అన్నీ విక్రయానికి అందుబాటులో ఉంచుతారు. 


ఏడాదిలోపే నిర్మాణం పూర్తి

కొత్త జెట్టీ, క్రూయిజ్‌ టెర్మినల్‌ నిర్మాణానికి సీఆర్‌జెడ్‌ అనుమతులు వచ్చాయి. మరో రెండు అనుమతులు రావలసి ఉంది. వీటికి అయ్యే వ్యయాన్ని కేంద్ర పర్యాటక శాఖ 50 శాతం భరిస్తుంది. మిగిలిన 50 శాతం కేంద్ర షిప్పింగ్‌ మంత్రిత్వ శాఖ సమకూరుస్తుంది. డిజైన్లు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతి రాగానే పనులు ప్రారంభిస్తాం. ఏడాదిలోనే పూర్తి చేస్తాం. ఒక క్రూయిజ్‌లో 2,500 మంది వరకు వచ్చే అవకాశం ఉంది.


కె.రామమోహన్‌రావు,  చైర్మన్‌, విశాఖపట్నం పోర్టు

Advertisement
Advertisement
Advertisement