Advertisement
Advertisement
Abn logo
Advertisement

సిరీస్‌ నీదా.. నాదా!

ఉదయం 9.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌లో..

భారత్‌-కివీస్ రెండో టెస్టు నేటినుంచి

జట్టులోకి కెప్టెన్‌ కోహ్లీ 

కివీస్ తో జరిగిన తొలి టెస్టులో విజయానికి వికెట్‌ దూరంలో నిలిచిపోయిన 


టీమిండియాకు ఇప్పుడు మరో అవకాశం. ఆఖరిదైన రెండో టెస్టులో ఎలాగైనా ప్రత్యర్థికి గట్టి పంచ్‌ ఇవ్వాలని చూస్తోంది.అయితే కెప్టెన్‌ కోహ్లీ కమ్‌బ్యాక్‌తో  బ్యాటింగ్‌ మరింత పటిష్టంగా మారినా.. జట్టు కాంబినేషన్‌పై అందరికీ ఆసక్తి నెలకొంది. ఇక కాన్పూర్‌ టెస్టులో అద్భుత పోరాటంతో ఓటమి నుంచి గట్టెక్కిన కివీస్‌ కూడా పట్టు వీడేందుకు సిద్ధంగా లేదు. అలాగే ఈ మ్యాచ్‌కు వరుణుడి నుంచి ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది.


ముంబై: రెండు టెస్టుల సిరీస్‌ ఆఖరి అంకానికి చేరింది. విజయం తేలకపోయినా అత్యంత ఆసక్తికరంగా ముగిసిన తొలి టెస్టు అభిమానులను ఆకట్టుకుంది. భారత స్పిన్నర్లను కివీస్‌ టెయిలెండర్స్‌ ఎదుర్కొన్న తీరు వారి పోరాటాన్ని చాటింది. అయితే శుక్రవారం నుంచి వాంఖడే మైదానంలో జరిగే రెండో టెస్టులో మాత్రం భారత్‌ సిరీస్‌ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. అయితే దీనికి వర్షం కూడా అనుకూలించాల్సి ఉంది. ఈ కారణంగానే గురువారం టీమిండియా ఇండోర్‌ స్టేడియంలో ప్రాక్టీస్‌ చేయగా.. కివీస్‌ హోటల్‌కే పరిమితమైంది. వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షి్‌పలో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు 1-0తో ఈ సిరీ్‌సను సైతం దక్కించుకోవాలనే ఆలోచనలో భారత్‌ ఉంది. ఇక కివీస్‌ ఇక్కడ 1969లో చివరిసారిగా సిరీస్‌ గెలిచింది.


ఎవరిపైనో వేటు:

రెండో టెస్టులో భారత తుది జట్టులో ఎవరుంటారనేది ఆసక్తికరంగా మారింది. విశ్రాంతి ముగియడంతో విరాట్‌ కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు. దీంతో అతడి కోసం ఎవరిపై వేటు వేయాలనేది క్లిష్టంగా మారింది. వరుసగా 12 మ్యాచ్‌ల్లో విఫలమైన వైస్‌కెప్టెన్‌ రహానెను పక్కకు తప్పించవచ్చని భావిస్తున్నారు. పుజార బ్యాటింగ్‌ కూడా ఆందోళనకరంగానే ఉంది. ఈ వెటరన్స్‌కు మరో చాన్స్‌ ఇవ్వదలుచుకుంటే ఓపెనర్‌ మయాంక్‌ను తప్పించవచ్చు. అప్పుడు గిల్‌కు జతగా ఓపెనర్‌ ఎవరనేది తేలాలి. మరోవైపు మిడిలార్డర్‌ బ్యాటింగ్‌ తీరు నిరాశపరుస్తోంది. శ్రేయాస్‌ మాత్రం అరంగేట్రంలోనే అద్భుతం అనిపించుకున్నాడు. వికెట్‌ కీపర్‌ సాహా మ్యాచ్‌ ఫిట్‌నె్‌సతో ఉండడంతో కేఎస్‌ భరత్‌కు నిరాశే ఎదురుకావచ్చు. మరోవైపు ముంబైలో ప్రస్తుత వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని అదనపు పేసర్‌ను ఆడించే అవకాశం లేకపోలేదు. దీంతో సిరాజ్‌కు చాన్స్‌ దక్కవచ్చు.  


వాగ్నర్‌ రాక:

తొలి టెస్టులో లెఫ్టామ్‌ పేసర్‌ నీల్‌ వాగ్నర్‌ లేని లోటు కివీ్‌సకు స్పష్టంగానే కనిపించింది. ప్రస్తుత వాతావరణంలో ఇక్కడ పేసర్లు, స్పిన్నర్లకు సమాన అవకాశాలుంటాయనే భావనలో జట్టు ఉంది. ముగ్గురు పేసర్లతో వెళ్లే అవకాశం ఉండడంతో స్పిన్నర్‌ సోమర్‌విల్లేను తప్పించవచ్చు. ఓపెనర్లు లాథమ్‌, యంగ్‌ శుభారంభం అందిస్తున్నా మిడిలార్డర్‌ అండగా నిలవడం లేదు. అలాగే ‘సొంత’ మైదానంలో రాణించేందుకు స్పిన్నర్‌ ఎజాజ్‌ ఎదురుచూస్తున్నాడు.


జట్లు (అంచనా)

భారత్‌: శుభ్‌మన్‌ గిల్‌, మయాంక్‌ అగర్వాల్‌, పుజార, విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), శ్రేయాస్‌ అయ్యర్‌, జడేజా, సాహా, అశ్విన్‌, అక్షర్‌, సిరాజ్‌, ఉమేశ్‌ యాదవ్‌.


న్యూజిలాండ్‌: యంగ్‌, లాథమ్‌, కేన్‌ విలియమ్సన్‌ (కెప్టెన్‌), రాస్‌ టేలర్‌, నికోల్స్‌, బ్లండెల్‌, రచిన్‌ రవీంద్ర, జేమిసన్‌, సౌథీ, వాగ్నర్‌, ఎజాజ్‌ పటేల్‌.


పిచ్‌, వాతావరణం

ముంబైలో గత రెండు రోజులు భారీ వర్షాలు కురిశాయి. శుక్రవారం మాత్రం ఆకాశం మేఘావృతంగా ఉండే అవకాశం ఉంది. పిచ్‌ను పూర్తిగా కవర్లతో కప్పి ఉంచారు. దీంతో స్పిన్నర్లతో పాటు పేసర్లకు కూడా పిచ్‌ అనుకూలంగా ఉండనుంది.


2016 తర్వాత వాంఖడే స్టేడియంలో టెస్టు జరగనుండడం ఇదే మొదటిసారి. అలాగే 1988 తర్వాత ముంబైలో తొలిసారిగా భారత్‌, న్యూజిలాండ్‌ తలపడుతున్నాయి.

Advertisement
Advertisement