ఇదీ ఇప్పటి ట్రెండ్‌!

ABN , First Publish Date - 2020-04-08T05:40:57+05:30 IST

విరాట్‌ కోహ్లీకి అనుష్క హెయిర్‌కట్‌ చేస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో ఎంత వైరల్‌ అయిందో చూసే ఉంటారు.

ఇదీ ఇప్పటి ట్రెండ్‌!

విరాట్‌ కోహ్లీకి అనుష్క హెయిర్‌కట్‌ చేస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో ఎంత వైరల్‌ అయిందో చూసే ఉంటారు. ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ సొంతంగా హెయిర్‌ కట్‌ చేసుకుంటూ పెట్టిన వీడియోకి ఎన్ని కామెంట్లు వచ్చాయో గమనించే ఉంటారు. సెలబ్రిటీలే కాదు... సామాన్యులు కూడా ఇప్పుడు అదే ట్రెండ్‌ ఫాలో అవుతున్నారు. లాక్‌డౌన్‌ మూలంగా సెలూన్‌లు మూతపడడంతో సొంతంగా హెయిర్‌ కట్‌ చేసుకుంటున్నారు. కేరళలో క్లీన్‌గా గుండు చేసుకోవడం ట్రెండ్‌గా మారింది. ఐటీ ఉద్యోగులు సోషల్‌ మీడియాలో ఇదే అంశంపై క్యాంపెయిన్‌ నిర్వహిస్తున్నారు. 


మాసిన గడ్డం, పెరిగిన జుట్టుతో నాలుగు రోజులంటే ఎలాగోలా నెట్టుకు రావచ్చు. కానీ మూడు వారాల పాటు గడపాలంటే కొద్దిగా కష్టమే. అందుకే కొంతమంది సొంతంగా కటింగ్‌ చేసేసుకుంటున్నారు. ఇంకొంతమంది నీట్‌గా గుండు చేసుకుంటున్నారు. కేరళలో ఇప్పుడు ఇది ఫ్యాషన్‌గానూ మారింది. వాళ్లు గుండు చేసుకోవడమే కాకుండా స్నేహితులకు ‘హోమ్‌ క్వారంటైన్‌ షేవ్‌ ఛాలెంజ్‌’ను విసురుతున్నారు.


హెయిర్‌ కటింగ్‌ సెలూన్‌లు ఎప్పుడు చూసినా బిజీగానే ఉంటాయి. ఆదివారం వచ్చిందంటే ఒక గంట వెయిట్‌ చేస్తే కానీ మన వంతు రాదు. కానీ ఇప్పుడు లాక్‌డౌన్‌ మూలంగా సర్వం మూతపడ్డాయి. దాంతో కేరళలో కొంతమంది తమకు తామే కటింగ్‌ పని కానిచ్చేస్తున్నారు. ఫైనల్‌ టచ్‌లో మాత్రం స్నేహితుల సాయం తీసుకుంటున్నారు. ‘‘గత 40 ఏళ్లలో ఎప్పుడూ ఇలా జరగలేదు. నేను మా స్నేహితుడికి కటింగ్‌ చేశా. వాడు నాకు చేశాడు’’ అని కేరళలోని కోళిక్కోడ్‌కు చెందిన ఓ వ్యక్తి చెప్పుకొచ్చారు. కోళిక్కోడ్‌ యువత ప్రస్తుతం ఇదే ట్రెండ్‌ ఫాలో అవ్వాలని అనుకుంటున్నారు. ‘‘సెలూన్‌లు మూతపడడం ఊహించని ఛాలెంజ్‌ను తెచ్చిపెట్టింది. జుట్టు కట్‌ చేసుకోవడం అత్యవసరం కాకపోయినా కొంచెం లుక్‌ బాగుండాలంటే కట్‌ చేసుకోక తప్పలేదని’’ అంటున్నారు అక్కడి యువత. 


కొందరు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు హోమ్‌ క్వారంటైన్‌ షేవ్‌ ఛాలెంజ్‌ను సోషల్‌ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. ‘‘ఒక్క కోళిక్కోడ్‌లోనే పలువురు ఐటీ ఉద్యోగులు హోమ్‌ క్వారంటైన్‌ షేవ్‌ ఛాలెంజ్‌లో చేరారు. వీళ్లు రకరకాల ఐటీ కంపెనీల్లో డైరెక్టర్‌ హోదాల్లో ఉన్నారు’’ అని క్యాలికట్‌ ఫోరం ఫర్‌ ఐటీ సెక్రెటరీ అబ్దుల్‌ గఫూర్‌ అన్నారు. వీళ్లంతా కరోనా వైరస్‌పై పోరుకు తమ వంతు సహాయం అందించాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. ఈ ఛాలెంజ్‌లో పాల్గొనే వారు క్లీన్‌ కటింగ్‌ ఫొటోను షేర్‌ చేయడంతో పాటు ముఖ్యమంత్రి సహాయనిధికి తమ వంతు విరాళం అందించాలి. మరో స్నేహితుడికి ఛాలెంజ్‌ను విసరాలి. అప్పుడే ఛాలెంజ్‌ ముగుస్తుంది. గుండు చేసుకున్న ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుండడంతో సెలబ్రిటీలను ఫాలో అవ్వడంలో మనవాళ్లు ఎప్పుడూ ముందే ఉంటారు అని నెటిజన్లు కామెంట్లతో మెచ్చుకుంటున్నారు.

Updated Date - 2020-04-08T05:40:57+05:30 IST