భేష్ వినయ్‌కుమార్ రెడ్డీ... తెలుగోడికి బ్రిటన్ ప్రముఖుడి ప్రశంసలు...

ABN , First Publish Date - 2021-05-15T23:05:37+05:30 IST

దేశంలో కరోనా మహమ్మరి విజ‌ంభిస్తోన్న వేళ... ‘నేనున్నా’నంటూ బాధితులకు అండగా నిలుస్తున్న తెలుగు యువకుడు సరికొండ వినయ్‌కుమార్ రెడ్డి(ఎస్‌వీఆర్).

భేష్ వినయ్‌కుమార్ రెడ్డీ... తెలుగోడికి బ్రిటన్ ప్రముఖుడి ప్రశంసలు...

హైదరాబాద్ / నిజామాబాద్ : దేశంలో కరోనా మహమ్మరి విజ‌ంభిస్తోన్న వేళ... ‘నేనున్నా’నంటూ బాధితులకు అండగా నిలుస్తున్న తెలుగు  యువకుడు సరికొండ వినయ్‌కుమార్ రెడ్డి(ఎస్‌వీఆర్).  ప్రభుత్వమే కాదు... కరోనా వంటి వైపరీత్యాలను ఎదుర్కొనే క్రమంలో మనమూ ముందుండాలని పిలుపినిస్తూ...  ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. అమెరికాలో ఉన్నత చదువులు చదివి, లక్షల డాలర్ల సంపాదనకున్న అవకాశాలను వదులుకుని, సొంతగడ్డపై బాధితులకు సేవలనందిస్తున్నాడు మన ఎస్‌వీఆర్. వివరాలిలా ఉన్నాయి. 


నిజామాబాద్ జిల్లాకు చెందిన సరికొండ వినయ్‌కుమార్ రెడ్డి కుటుంబం... హైదరాబాద్‌లో స్థిరపడింది. కాగా... ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళిన వినయ్‌కుమార్ రెడ్డి... 2013లో భారత్‌కు తిరిగి వచ్చాడు. అప్పటినుంచీ కూడా... తనకున్నంతలో ఇతరులకు సాయపడాలన్న ఆలోచనలో భాగంగా పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. ఇదే క్రమంలో దేశాన్ని గత సంవత్సర కాలంగా కరోనా మహమ్మరి పట్టిపీడిస్తోన్న నేపథ్యంలో... బాధితులకు మందులు, ఆహారాన్ని స్వచ్ఛందంగా అందిస్తూ ఇతరుల మన్ననలనందుకుంటున్నాడు.


అంతేకాదు... ఇందుకోసం ‘ఎస్‌వీఆర్ వారియర్స్’ పేరుతో ఓ బృందాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. తన బృందంతో... కేవలం సొంత రాష్ట్రమైన తెలంగాణలోనే కాకుండా దక్షిణాదిలోని  ఇతర రాష్ట్రాల్లో కూడా సామాజిక కార్యక్రమాలను చేపట్టాడు. ప్రత్యేకించి మారుమూల ప్రాంతాల్లోని వారికి మాస్కులు, మందులు, మాస్కులు, శానిటైజర్లతో కూడిన కిట్లను అందిస్తూ వచ్చాడు. ఇప్పటివరకు దాదాపు 50 వేలకు పైగా కిట్లను ఇలా అందించాడు. 


కాగా కేవలం సేవాభావంతో వినయ్‌కుమార్ రెడ్డి చేస్తోన్న ఈ కార్యక్రమాలకు పలువురి ప్రశంసలందుతున్నాయి. ఇదే క్రమంలో... విదేశాల్లోని తెలుగువారు సైతం... తాము కూడా ఈ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటామంటూ వినయ్‌కుమార్ రెడ్డికి మద్దతుగా నిలుస్తున్నారు. బ్రిటన్‌కు చెందిన బాల మేధావి బిగ్స్ కూడా... డాక్టర్ వినయ్‌కుమార్ రెడ్డి కార్యక్రమాలను అభినందించడం గమనార్హం. 


వినయ్‌కుమార్ రెడ్డి ఏర్పాటు చేసుకున్న ‘ఎస్‌వీఆర్ కరోనా వారియర్స్ సేవాదళ్’ నిర్వహిస్తోన్న కార్యక్రమాలకు దేశంలోని ఇతర నగరాల నుంచి కూడా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే క్రమంలో మద్దతునిచ్చే వారూ పెరుగుతున్నారు. ఇదిలా ఉంటే... వినయ్‌కుమార్ రెడ్డి స్ఫూర్తితో ‘కరోనా బాధితులకు అండగా మేమూ నిలబడతా’మంటూ హైదరాబాద్‌ నగరానికి చెందిన యువ బృందాలు చెబుతుండటం విశేషం. వినయ్ బృందాలు ఇప్పటివరకూ ముప్ఫై వేల మంది వరకు బాధిత కుటుంబాలకు ఈ సాయాన్నందించడం గమనార్హం. దీనికంతటికీ కూడా ఆయన ఎక్కువగా సొంత డబ్బునే వినియోగిస్తున్నాడు. మొత్తం మీద... హ్యాట్సాఫ్  వినయ్‌కుమార్ రెడ్డీ. 




Updated Date - 2021-05-15T23:05:37+05:30 IST