వి‘మ్యానియా’ ఇది మహిళల బ్యాండ్‌

ABN , First Publish Date - 2021-03-25T05:30:00+05:30 IST

‘విమెనియా బ్యాండ్‌’ గురించి చెప్పాలంటే ఐదేళ్లు వెనక్కి వెళ్లాలి. అది 2016. అప్పటికి స్వాతి సింగ్‌ బడా కార్పొరేట్‌ కంపెనీలో

వి‘మ్యానియా’  ఇది మహిళల బ్యాండ్‌

మ్యూజిక్‌ బ్యాండ్‌ అనగానే మదిలో మగవారే మెదులుతారు. కానీ ఉత్తరాఖండ్‌కు వెళితే... అక్కడ ఓ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అదే... ‘విమెనియా బ్యాండ్‌’. ఆ బ్యాండ్‌ ప్రత్యేకత ఏమిటంటారా? ఈ బ్యాండ్‌లో అంతా మహిళలే! ఇప్పుడీ బ్యాండ్‌... దేశంలోనే ఓ బ్రాండ్‌. ఆ బ్యాండ్‌ విశేషాలు చదివేద్దాం రండి... 


‘విమెనియా బ్యాండ్‌’ గురించి చెప్పాలంటే ఐదేళ్లు వెనక్కి వెళ్లాలి. అది 2016. అప్పటికి స్వాతి సింగ్‌ బడా కార్పొరేట్‌ కంపెనీలో పనిచేస్తున్నారు. మార్కెటింగ్‌ విభాగం. మంచి హోదా... జీతం. ఇవేవీ కిక్కు ఇవ్వలేదు ఆమెకు. అంతే... అంత పెద్ద ఉద్యోగాన్నీ వదిలేశారు. తనకు ఎంతో ఇష్టమైన... ఎన్నో ఏళ్లుగా కలలు కంటున్న ఆల్‌ విమెన్‌ బ్యాండ్‌ ప్రారంభించారు. అదే ‘విమెనియా బ్యాండ్‌’. స్వాతి సింగ్‌తో పాటు శాకంబరి కొట్నాల, శ్రీవిద్యా కొట్నాల, విజుల్‌ చౌదరి ఈ బృందంలో సభ్యులు. పదహారేళ్ల శ్రీవిద్య నలభై నాలుగేళ్ల శాకంబరి కుమార్తె కావడం మరో విశేషం. 


లైవ్‌లో అదరగొట్టాలని... 

స్వాతి సింగ్‌ కష్టపడి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సంపాదిం చుకున్నారు. కానీ సంగీతమంటే ఆమెకు ప్రాణం. మంచి గాయకురాలు. గిటార్‌ కూడా అద్భుతంగా వాయిస్తారు. కిక్కిరిసిన ప్రేక్షకుల సమక్షంలో ప్రత్యక్షంగా వేదికపై సంగీత ప్రదర్శన ఇవ్వాలనేది ఆమె జీవిత కల. ఆ కల నిజం చేసుకోవడం కోసమే 2007లో టీచర్‌ ఉద్యోగానికి రిజైన్‌ చేశారు. తరువాత కొంత కాలం ఓ కార్పొరేట్‌ కంపెనీలో మార్కెటింగ్‌ విభాగంలో చేరారు. దాంతోపాటే తన అభిరుచిని నిజం చేసుకోవడానికి అలుపెరుగని కృషి చేశారు. దాదాపు పదేళ్ల తరువాత ఆమె కల ఫలించింది. అంతా మహిళలతోనే మ్యూజిక్‌ బ్యాండ్‌ ప్రారంభించారు. 



జీవితాలను మార్చిన రోజు... 

‘‘2016 మార్చి 12... అది మా జీవితాలను పూర్తిగా మార్చిన రోజు. కొత్త ఆశలు చిగురించిన రోజు. మా బ్యాండ్‌ మొట్టమొదటి ప్రత్యక్ష ప్రదర్శన. అయిపోగానే ప్రేక్షకులంతా లేచి నిలుచుని చప్పట్లతో మమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందించారు. ఆ క్షణం మా ఆత్మవిశ్వాసం రెట్టింపయింది. ఉత్సాహం ఉరకలు వేసింది. సంగీత ప్రపంచంలో దుమ్ము లేపే సత్తా ఈ బ్యాండ్‌కూ ఉందనే భరోసా వచ్చింది. ఇక అప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు’’ అని నాటి రోజులు గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనవుతారు స్వాతి సింగ్‌. 


సామాజిక అంశాలే సంగీతం... 

మ్యూజిక్‌ బ్యాండ్‌ కొనసాగించడం అంత సులువు కాదు. ముఖ్యంగా ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని చూపించాలి. లేదంటే వెనకపడిపోవడం ఖాయం. దానికితోడు ఆ బ్యాండ్‌కంటూ ఒక ప్రత్యేకత ఉండాలి. ఆ జాగ్రత్తలన్నీ తీసుకున్నారు స్వాతి సింగ్‌. క్లాసికల్‌, సూఫీ ఫ్యూజన్స్‌ ‘విమెనియా బ్యాండ్‌’ ప్రత్యేకత. వరకట్నం, లైంగిక వేధింపులు, సాధికారత తదితర మహిళలకు సంబంధించిన ఎన్నో సామాజిక అంశాలపైనే వారి పాటలు ఉంటాయి. పాట రచనే కాదు బాణీలు కూడా సొంతంగా సమకూర్చుకొంటుందీ బృందం. 




అంతకు మించిన సంతృప్తి లేదు... 

ప్రస్తుతం ‘విమెనియా బ్యాండ్‌’కు ఉత్తరాదిలో మంచి ఆదరణ ఉంది. ఉత్తరాఖండ్‌తో పాటు రాజస్తాన్‌, పంజాబ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ తదితర రాష్ట్రాల నుంచి కూడా బడా బడా ఆఫర్లు వస్తున్నాయి. పెద్ద పెద్ద వేదికలపై ప్రదర్శనలకు ఆహ్వానాలు అందుతున్నాయి. ఇప్పుడు ఈ బ్యాండ్‌ అక్కడ ఒక బ్రాండ్‌లా మారిపోయింది. విందులు, వినోదాలు... కార్యక్రమం ఏదైనా ఇష్టపడి మరీ పిలిపించుకొంటున్నారు అభిమానులు. పధ్నాలుగేళ్ల సుదీర్ఘ కృషికి ఇప్పుడు సరైన ఫలితం దక్కుతోందంటారు 36 ఏళ్ల స్వాతి సింగ్‌. ‘‘ఒకరి అభిరుచికి తగ్గట్టు జీవించడానికంటే మించిన సంతృప్తి ఇంక ఏదీ ఉండదు’’ అని ఎంతో సంతోషంగా చెబుతారామె. 


మొదట్లో ఉచితంగానే... 

మహిళలంతా కలిసి ఉత్సాహంగా మ్యూజిక్‌ బ్యాండ్‌ అయితే పెట్టారు కానీ... మరి ఆఫర్లు ఎక్కడి నుంచి వస్తాయి? నిజానికి వీరి ప్రతిభ ఏ స్థాయిలో ఉందో తెలియకుండా ఎవరుమాత్రం అవకాశం ఇస్తారు! ఆ విషయం అర్థం చేసుకున్నారు ఈ బ్యాండ్‌ సభ్యులు. ‘‘తొలి ఆరు మాసాలూ ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఉచితంగానే ప్రదర్శనలు ఇచ్చాం. క్రమంగా మా సంగీతాన్ని ఆహూతులు ఆస్వాదించడం మొదలుపెట్టారు. ఆ తరువాత ఒక్కొక్కటికీ ఆఫర్లు వచ్చాయి. ఆహ్వానాలు అందాయి’’ అంటారు శాకంబరీ కొట్నాల. ఈ బ్యాండ్‌లో చేరడం కోసం ఆమె రెండు చేతులా సంపాదించి పెట్టే సొంత బొటిక్‌ను మూసేశారు. 


అమ్మ బాటలోనే  కూతురు... 

చిన్నప్పటి నుంచి అమ్మ శాకంబరిని చూసిన శ్రీవిద్య కూడా ఆమె బాటలోనే నడవాలని నిర్ణయించుకుంది. ఎనిమిదేళ్ల వయసు నుంచే స్వాతి సింగ్‌ వద్ద శిక్షణ తీసుకుంది. ఇప్పుడు ‘విమెనియా బ్యాండ్‌’లో తనే ప్రధాన డ్రమ్మర్‌. ‘‘గాత్ర సంగీతంతో పాటు డ్రమ్స్‌ నేర్చుకోవడానికి స్వాతి సింగ్‌ అకాడమీలో చేరాను. కొన్నాళ్లకు మా అమ్మ స్వాతి బ్యాండ్‌లో చేరాలని నిర్ణయించుకుంది. అప్పుడు నన్ను కూడా అందులో చేర్చుకోమని కోరాను. అలా బ్యాండ్‌తో నా సంగీత ప్రయాణం మొదలైంది’’ అంటూ చెప్పుకొచ్చింది శ్రీవిద్య. కార్పొరేట్‌ ఉద్యోగం వదిలేసిన తరువాత స్వాతి సింగ్‌ డెహ్రాడూన్‌ (2011)లో సొంతంగా సంగీత అకాడమీని నెలకొల్పారు. 


వేలమంది అభిమానులు... 

ఒక సంచలనంగా ప్రారంభమైన ‘విమెనియా బ్యాండ్‌’కు ప్రస్తుతం వేల మంది అభిమానులున్నారు. సామాజిక మాధ్యమాల్లోనూ లెక్కకు మించిన ఫాలోయర్స్‌ వారి అప్‌డేట్స్‌ కోసం ఎదురుచూస్తుంటారు. ‘‘సాధించాలనే సంకల్పం ఉంటే మహిళలకు అసాధ్యమనేదే లేదని చెప్పడానికి అసలైన ఉదాహరణ ‘విమెనియా బ్యాండ్‌’ సభ్యులు. కష్టపడేతత్వం, పట్టుదలకు వీరు ప్రత్యక్ష ఉదాహరణ’’ అంటూ ఉత్తరాఖండ్‌ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి రేఖా ఆర్య అభినందించారు. ఏదిఏమైనా కలలను నిజం చేసుకుని ఆ కలల్లోనే జీవిస్తున్న ఈ మహిళల సంగీత ప్రవాహం తరతరాలకూ స్ఫూర్తి రగిలిస్తూనే ఉంటుంది.        ఫ


ఒక సంచలనంగా ప్రారంభమైన ‘విమెనియా బ్యాండ్‌’కు ప్రస్తుతం వేల మంది అభిమానులున్నారు. సామాజిక మాధ్యమాల్లోనూ లెక్కకు మించిన ఫాలోయర్స్‌ వారి అప్‌డేట్స్‌ కోసం ఎదురుచూస్తుంటారు. 


Updated Date - 2021-03-25T05:30:00+05:30 IST