‘కమిషన్‌’ను ఆశ్రయించిన వేములఘాట్‌ గ్రామస్థులు

ABN , First Publish Date - 2021-06-17T08:50:54+05:30 IST

మల్లన్నసాగర్‌ ముంపు గ్రామమైన సిద్దిపేట జిల్లా తొగుట మండలం వేములఘాట్‌ గ్రామస్తు లు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు.

‘కమిషన్‌’ను ఆశ్రయించిన వేములఘాట్‌ గ్రామస్థులు

సమస్యలు పరిష్కరించాలన్న మల్లన్నసాగర్‌ ముంపు బాధితులు.. సీఎం, గవర్నర్‌కు లేఖ 

తొగుట, జూన్‌ 16 : మల్లన్నసాగర్‌ ముంపు గ్రామమైన సిద్దిపేట జిల్లా తొగుట మండలం వేములఘాట్‌ గ్రామస్తు లు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. సీఎం కేసీఆర్‌, గవర్నర్‌ తమిళసైకి మెయిల్‌ ద్వారా తమ బాధలను ఏకరువు పెట్టారు. 2016 నుంచి తమ భూములను తీసుకోవడం మొదలు పెట్టిన సిద్దిపేట జిల్లా అధికారులు ఇప్పటివరకు తమకు రావాల్సిన పరిహారం ఇవ్వడం లేదన్నారు. ఉపాధి, పునరావాసం, ఇండ్లు, ప్లాట్లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చెక్కులు జారీ చేసి నిలుపుదల చేసిన చెక్కులను వెంటనే అప్‌డేట్‌ చేసి కొత్త చెక్కులను ఇవ్వడం లేదని, ఆర్‌అండ్‌ఆర్‌ లబ్ధిదారులందరికీ 250 గజాల ఇళ్ల స్థలం, ఇండ్లను, ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేసి ఇవ్వకుండానే గ్రామస్థులను ఊళ్లో నుంచి ఖాళీ చేయిస్తున్నారని వాపోయారు. 


ఈ విషయమై సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ను, సిద్దిపేట ఆర్డీవోను ఎన్నిసార్లు కలిసినా ఇస్తామని చెబుతున్నారు కానీ, నేటికి తమకు రావాల్సినవి ఇవ్వడం లేదని వారు అన్నారు. తమను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని, విద్యుత్‌ కోతలు, తాగు నీరు రాకుండా చేయడంతో పాటు గ్రామం నుంచి బయటకు వెళ్లకుండా కట్ట ఎత్తును పెంచి రోడ్డు మార్గం లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నెలవారి మందులు రాక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. గ్రామాల్లో పేరుకుపోతున్న చెత్తను తీయడం లేదని, మురుగు కాలువలను శుభ్రం చేయడంలేదని వివరించారు.  భర్తలను కోల్పోయి ఒంటరిగా ఉన్న ఆడవాళ్లలో, భార్యలను కోల్పోయి ఒంటరిగా ఉన్న మగవాళ్లలో కొందరికి ఇచ్చి, కొందరికి ఆర్‌అండ్‌ఆర్‌ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని పేర్కొన్నారు. తమకు రావాల్సినవి ఇవ్వకుండా అధికారులు ఇబ్బంది పెట్టడంతోనే కోర్టుకు వెళ్లామే తప్ప ప్రాజెక్ట్‌ కట్టకూడదని, తాము భూములు, ఇండ్లు ఇవ్వమని ఏనాడు కోర్టుకు వెళ్లలేదనే విషయాన్ని సీఎం కేసీఆర్‌ గమనించాలని వారన్నారు. 

Updated Date - 2021-06-17T08:50:54+05:30 IST