రక్తం చూసిన రాజకీయం

ABN , First Publish Date - 2022-01-14T08:15:37+05:30 IST

అక్కడ ఫ్యాక్షన్‌ లేదు! చంపుకొనేంత వివాదాలూ లేవు! కేవలం... తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నాడని, వైసీపీ జెండాకు ఎదురు నిలుస్తున్నాడని దారుణానికి తెగబడ్డారు.

రక్తం చూసిన రాజకీయం

  • కత్తులతో పొడిచి, బండరాళ్లతో కొట్టి టీడీపీ గ్రామస్థాయి నేత దారుణ హత్య
  • మాచర్ల నియోజకవర్గంలో ఘోరం.. బైక్‌పై ఇంటికి వెళ్తుండగా దారికాచి దాడి
  • వైసీపీకి ఎదురొస్తారా అంటూ హూంకరింపు.. నాటుకర్రతో కొట్టి కత్తులు, రాళ్లతో హత్య
  • గ్రామం నడిబొడ్డున పట్టపగలు అంతా చూస్తుండగానే అరాచకం
  • ఎమ్మెల్యే పిన్నెల్లి ప్రోద్బలంతోనే చంపేశారు
  • ముందురోజు రాత్రే గ్రామానికి ఎమ్మెల్యే
  • 29న టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జికి ఘనస్వాగతం
  • గ్రామం నుంచి జన సమీకరణ చేసిన చంద్రయ్య
  • మీరేం చేస్తున్నారని వైసీపీ నేతలను ఎమ్మెల్యే రెచ్చగొట్టారు
  • తెల్లవారగానే మా నాన్నను చంపేశారు
  • పోలీసులకు చంద్రయ్య కుమారుడి ఫిర్యాదు


గుంటూరు, జనవరి 13: అక్కడ ఫ్యాక్షన్‌ లేదు! చంపుకొనేంత వివాదాలూ లేవు! కేవలం... తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నాడని, వైసీపీ జెండాకు ఎదురు నిలుస్తున్నాడని దారుణానికి తెగబడ్డారు. గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామ టీడీపీ అధ్యక్షుడు చంద్రయ్య (45)ను క్రూరంగా హత్య చేశారు. పట్టపగలు, గ్రామం నడిబొడ్డున జనమంతా చూస్తుండగానే... కత్తితో పొడిచి, బండరాళ్లతో మోది ప్రాణం తీశారు. బాధిత కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం ప్రకారం... ఆయన పేరు తోట చంద్రయ్య! పల్నాడులోని మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామ టీడీపీ అధ్యక్షుడు. ఆయనకు ఎలాంటి ఫ్యాక్షన్‌ నేపథ్యం లేదు. ఇంటి తగాదాలూ, పొలం వివాదాలూ లేవు. కేవలం... గ్రామంలో, మండలంలో తెలుగుదేశం పార్టీ జెండాను బలంగా మోస్తున్నాడనే కసితో చంద్రయ్యను దారుణంగా చంపేశారు. మొన్నటి దాకా మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ స్తబ్ధత నెలకొంది.


ఇటీవలే నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌గా జూలకంటి బ్రహ్మారెడ్డిని నియమించారు. ఇన్‌చార్జ్‌ హోదాలో బ్రహ్మారెడ్డి గత నెల 29న తొలిసారి నియోజకవర్గానికి తొలిసారి వచ్చినప్పుడు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి గుండ్లపాడు గ్రామం నుంచి చంద్రయ్య భారీగా జనసమీకరణ జరిపారు. ఇదే... ప్రత్యర్థులకు కంటగింపుగా మారింది.


మాకే ఎదురొస్తావా అంటూ...

చంద్రయ్య గురువారం ఉదయం 7 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై ఊరి శివార్లలోకి వెళ్లి... అక్కడ ట్రాక్టర్‌తో మట్టి తోలకం పని అప్పగించారు. తిరిగి వెళ్తూ... ఊరి సెంటర్‌లో టీ తాగి, ఇంటికి బయలుదేరారు. అక్కడి నుంచి రెండు నిమిషాల్లోనే ఇంటికి చేరుకోవచ్చు. అయితే వైసీపీ వర్గీయుల ఇళ్ల మీదుగానే వెళ్లాల్సి ఉంటుంది. అప్పటికే. చంద్రయ్యను చంపేందుకు స్కెచ్‌ సిద్ధమైంది. అరుగుల మీద కూర్చున్న ముగ్గురు వ్యక్తులు.. బైక్‌పై వెళ్తున్న చంద్రయ్యను తొలుత నాటుకర్రతో గట్టిగా కొట్టారు. కిందపడిపోయాక కత్తులతో పొడిచారు. నాపరాళ్లతో మోదారు. అదే సమయంలో బహిర్భూమికి వెళ్లి వస్తున్న చంద్రయ్య కొడుకు వీరాంజనేయులు అక్కడికి చేరుకున్నారు. తన తండ్రిని చంపవద్దని ప్రాధేయపడ్డాడు. చంద్రయ్యకు బంధువైన మరో మహిళ కూడా ‘చంపొద్దు... చంపొద్దు’ అని వేడుకుంది. అయినా ప్రత్యర్థులు కనికరించలేదు. వాళ్లిద్దరినీ పక్కకు లాగేశారు. ‘వైసీపీని ధిక్కరించే దమ్ముందా?ఊర్లో టీడీపీని నడిపించేత మగాడివా?’ అంటూ చంద్రయ్యను కత్తులతో పొడిచి, బండరాళ్లతో కొట్టి కొట్టి చంపేశారు.


పట్టపగలు, కళ్లముందే ఘోరం జరుగుతున్నా... స్థానికులెవరూ అడ్డుకునేందుకు ప్రయత్నం చేయలేదు. గుండ్లపాడు ఎంపీపీ చింతా శివరామయ్య, ఆయన కుమారుడు ఆదినారాయణ, మాజీ సర్పంచు తోట ఆంజనేయులుతోపాటు మరో ఐదుగురు హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్నట్టు వీరాంజనేయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రోద్బలంతోనే ఈ హత్య జరిగిందని తెలిపారు. హత్య గురించి సమాచారం తెలియగానే డీఎస్పీ జయరాం ప్రసాద్‌తోపాటు పలువురు పోలీసు అధికారులు గుండ్లపాడుకు చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తరలించేందుకు ప్రయత్నించారు. వీరిని కుటుంబ సభ్యులు, టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి వచ్చే వరకు మృతదేహాన్ని కదిలించేది లేదని ఆందోళనకు దిగారు. పోలీసుల వారికి సర్దిచెప్పి మృతదేహాన్ని మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడికి టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు.  బ్రహ్మారెడ్డి, రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ చిరుమామిళ్ల మధుబాబు తదితరులు  పోస్టుమార్టం పూర్తయ్యే వరకు ఆసుపత్రిలోనే ఉన్నారు.


ఆధిపత్యం కోసమే

గ్రామంలో రాజకీయ ఆధిపత్యం కోసమే తోట చంద్రయ్యను చంపినట్లు టీడీపీ నేతలు ఆరోపించారు. ఒకప్పుడు సమస్యాత్మకమైన ఈ గ్రామంలో చివరి సారిగా... 18 ఏళ్ల క్రితం హత్య జరిగింది. అప్పుడు కూడా టీడీపీ కార్యకర్తనే బలి తీసుకున్నారు. ఇప్పుడు... వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కక్షసాధింపు చర్యలు అధికమయ్యాయి. తప్పుడు కేసులు బనాయించడం, స్టేషన్‌కు పిలిపించి బెదిరిస్తుండటంతో టీడీపీ కార్యకర్తలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. బ్రహ్మారెడ్డిని ఇన్‌చార్జిగా నియమించిన తర్వాత టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం వచ్చింది. బ్రహ్మారెడ్డికి స్వాగతం పలికేందుకు చంద్రయ్య భారీ ఎత్తున జన సమీకరణ చేయడంతో కక్ష పెంచుకున్నారు.


టీడీపీ వర్గీయుడిపై కత్తులతో దాడి

ప్యాపిలి, జనవరి 13: ఒకవైపు పల్నాడులో టీడీపీ కార్యకర్త హత్య జరగ్గా... అంతకంటే ముందే కర్నూలు జిల్లాలో మరో టీడీపీ కార్యకర్తపై హత్యాయత్నం జరిగింది. కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం బావిపల్లిలో బుధవారం అర్ధరాత్రి టీడీపీ వర్గీయుడు శ్రీనివాసులుపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. పోలీసుల కథనం ప్రకారం... శ్రీనివాసులు లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నారు. నెలరోజులుగా ఊర్లోనే ఉంటూ ఇంటి నిర్మాణ పనులు చూసుకుంటున్నారు. బుధవారం రాత్రి భోజనం చేసి కొత్త ఇంటి వద్దకు వెళ్లారు. సామగ్రికి కాపలాగా పడుకున్నారు. కొందరు దుండగులు అర్ధరాత్రి శ్రీనివాసులపై కత్తులతో దాడి చేసి పరారయ్యారు. గురువారం తెల్లవారుజామున భార్య అమలాదేవి భర్తను నిద్రలేపేందుకు ఇంటి వద్దకు వెళ్లింది. అక్కడ రక్తపు మడుగులో ఉన్న శ్రీనివాసులును చూసి నిర్ఘాంతపోయింది. అతడిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


ఎమ్మెల్యే పిన్నెల్లి వల్లే... 

చంద్రయ్య హత్యకు మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారణమని హతుని కుమారుడు వీరాంజనేయులు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. బుధవారం రాత్రి ఎమ్మెల్యే తమ గ్రామానికి వచ్చారని, వైసీపీ నేతలను రెచ్చగొట్టారని తెలిపారు. ‘‘మండలంలో టీడీపీనే లేదంటున్నారు. అటువంటప్పుడు ఈ గ్రామంలో నుంచే బ్రహ్మారెడ్డి కార్యక్రమానికి భారీ సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు ఎలా వెళ్లారు? మీరంతా ఏం చేస్తున్నారు? మీకు చేతకాకపోతే తప్పుకోండి’’ అని ఎంపీపీ శివరామయ్య, ఇతర నేతలపై ఎమ్మెల్యే ఆగ్రహించారని, తెల్లవారేసరికే తన తండ్రిని హత్య చేశారని వీరాంజనేయులు తెలిపారు. హత్య జరిగిన తరువాత కూడా ఎమ్మెల్యేకు సంబంధించిన వాహనాలు గ్రామానికి వచ్చాయని, నిందితులు ఆ వాహనాల్లోనే పారిపోయారని చెప్పారు. వాళ్లంతా ఎమ్మెల్యే రక్షణలోనే ఉన్నారని ఆరోపించారు. 


ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో ఎంపీపీ చింతా శివరామయ్య, ఆయన కుమారుడు ఆదినారాయణ. శివరామయ్య ఎంపీపీ అయిన తర్వాత నిర్వహించిన విజయోత్సవ సభ చిత్రమిది. ప్రస్తుతం శివరామయ్య, ఆదినారాయణ పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.


 గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి 

Updated Date - 2022-01-14T08:15:37+05:30 IST