శ్రీ సరస్వతీ దేవిగా విజయవాడ కనకదుర్గమ్మ

ABN , First Publish Date - 2021-10-12T06:05:57+05:30 IST

శరన్నవరాత్రి ఉత్సవాలలో ఈ రోజు విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ వారు శ్రీ సరస్వతీ దేవిగా దర్శనమిస్తారు.

శ్రీ సరస్వతీ దేవిగా విజయవాడ కనకదుర్గమ్మ

నేటి అలంకరణ

శ్రీ సరస్వతీ దేవి

12- 10- 2021

ఆశ్వయుజ శుద్ధ సప్తమి (మూలా నక్షత్రం) మంగళవారం

శరన్నవరాత్రి ఉత్సవాలలో ఈ రోజు విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ వారు శ్రీ సరస్వతీ దేవిగా దర్శనమిస్తారు. శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రానికి విశిష్ట ప్రాముఖ్యం ఉంది. ఈ నక్షత్రం అమ్మవారి జన్మ నక్షత్రం. దుర్గాదేవి చదువుల తల్లి సరస్వతీదేవి రూపంలో దర్శనమిచ్చే రోజు ఇది. బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతీదేవిని పురాణాలు వర్ణించాయి. ఆసనంగా శ్వేతపద్మాన్ని  అధిష్ఠించి, వీణ, దండ, కమండలాలు, అక్షమాల ధరించి, అభయముద్రతో భక్తుల అజ్ఞాన తిమిరాలను ఆమె దూరం చేస్తుందని విశ్వాసం. నవరాత్రుల్లో మూలా నక్షత్రం నుంచి విజయదశమి వరకు విశేష పుణ్యదినాలుగా అమ్మను ఆరాధిస్తారు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా త్రిశక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవి తన అంశలోని నిజస్వరూపాన్ని సాక్షాత్కరింప చేయడమే ఈ రోజు చేసే అలంకార ప్రత్యేకత. 


త్రిశక్తుల్లో సరస్వతి మూడో శక్తి రూపం. సంగీత సాహిత్యాలకు అధిష్ఠాన దేవత. ఈ తల్లిని ఆరాధించడం వల్ల బుద్ధి వికాసం, విద్యాలాభం కలుగుతాయి.  చింతామణి, జ్ఞాన, నీల, ఘట, కిణి, అంతరిక్ష, మహాసరస్వతులుగా సప్తనామాలతో వాగ్దేవి ప్రాణుల నాలుకపై నర్తించే బుద్ధిప్రదాయిని. ఆమెను కొలిస్తే విద్యార్ధులకు చదువు బాగా వస్తుందనీ, జ్ఞానజ్యోతులను ఆమె ప్రసాదిస్తుందనీ, వాక్సుద్ధి,  మంచి బుద్ధీ ఇస్తుందనీ నమ్మిక. 


నైవేద్యం: ధద్ధ్యోజనం, పాయసం, ఇతర తీపి పదార్థాలు

అలంకరించే చీర రంగు: తెలుపు

అర్చించే పూలు: కలువ పూలు

పారాయణ: చెయ్యాల్సింది: సరస్వతీ స్తోత్రాలు

Updated Date - 2021-10-12T06:05:57+05:30 IST