విజయవాడలో కళ్లకు గంతలు కట్టుకుని కాంగ్రెస్ నిరసన

ABN , First Publish Date - 2020-09-21T18:52:46+05:30 IST

రాజ్యసభలో ఆమోదించిన మూడు వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ నిరసనకు దిగింది.

విజయవాడలో కళ్లకు గంతలు కట్టుకుని కాంగ్రెస్ నిరసన

విజయవాడ: రాజ్యసభలో ఆమోదించిన మూడు వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ నిరసనకు దిగింది. దేశంలో దృతరాష్ట్ర పాలన సాగుతోందంటూ కళ్ళకు గంతలు కట్టుకుని ఆంధ్ర రత్న భవన్ నుంచి వైస్సార్ విగ్రహo వరకు కాంగ్రెస్ నేతలు పాదయాత్ర చేశారు. ఆపై వైఎస్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏపీసీసీ ఉపాధ్యక్షులు డాక్టర్ గంగాధర్ మాట్లాడుతూ... వ్యవసాయ బిల్లుల విషయంలో బీజేపీకి బలం లేకపోయినా సభలో వాటిని ప్రవేశ పెట్టారని... మూజువాణి ఓటుతో బిల్లులు ఆమోదింప చేసుకున్నారని విమర్శించారు. 12 ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లులని వ్యతిరేకిస్తే టీడీపీ, వైసీపీ మాత్రం బీజేపీకి మద్దతిచ్చాయని తెలిపారు. బీజేపీ దయా దాక్షిణ్యాలతో బెయిల్‌పై బయట ఉన్న విజయసాయి రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నారని గంగాధర్ మండిపడ్డారు. 



ఏపీసీసీ నగర ప్రెసిడెంట్ నరహరిశెట్టి నరసింహారావు మాట్లాడుతూ... ఈ మూడు బిల్లులు రైతులకు ఉరితాడులాంటివే అని వ్యాఖ్యానించారు. కేసులు కొట్టేస్తారని బీజేపీకి మద్దతు ఇచ్చారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను దలారీ పార్టీ అన్న వ్యాఖ్యలపై  వైఎస్సార్ బిడ్డగా జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే విజయసాయి రెడ్డిపై  పరువునష్టదావ వేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీని దళారి పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీలో పుట్టి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా మరణించిన వైస్సార్‌ని అవమానించినట్టే అని అన్నారు. విజయసాయిరెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. ఈ బిల్లులకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని నరహరిశెట్టి స్పష్టం చేశారు. 

Updated Date - 2020-09-21T18:52:46+05:30 IST