Abn logo
Aug 15 2020 @ 06:58AM

కరోనా ఉచ్చులో ఇంద్రకీలాద్రి

కొండపై కోరలు

ఈవో సహా 15మందికి సోకిన వైరస్

ముగ్గురు మృతి

భయాందోళనలో ఉద్యోగులు, సిబ్బంది

భారీగా తగ్గిన భక్తుల సంఖ్య

నిర్వహణ ఖర్చులు మాత్రం అధికం

కొన్నాళ్లు దర్శనాల నిలిపివేతకు ఉద్యోగుల నుంచి ఒత్తిడి


విజయవాడ: కంటికి కనిపించని కరోనా మహమ్మారి ఇంద్రకీలాద్రి కొండపైకి ఎక్కి కోరలు చాచింది. ఆలయ ఉద్యోగులు, సిబ్బందిపై పడగవిప్పి వికటాట్టహాసం చేస్తోంది. ఇప్పటికే ఈవో సురేష్‌బాబు సహా 15 మంది కరోనా బారిన పడగా, మరో ముగ్గురు  మృతి చెందారు. ఈ నేపథ్యంలో ద్వారకా తిరుమల ఆలయం, అన్నవరంలోని సత్యనారాయణస్వామి దేవస్థానం మాదిరిగా దుర్గగుడిలోనూ కొన్నాళ్లపాటు దర్శనాలు నిలుపుదల చేయాలని ఉద్యోగులు, సిబ్బంది కోరుతున్నారు. 


ఇంద్రకీలాద్రి భయం గుప్పిట్లో చిక్కుకుంది. కొండపై కరోనా కోరలు చాచడంతో ఆలయంలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది వణికిపోతున్నారు. కరోనాతో ఓ వేదపండితుడు ఇటీవలే మరణించగా, ఆలయ ట్రాన్స్‌పోర్టు విభాగంలో పనిచేసే మరో ఉద్యోగి, అంతకుముందు కౌంటర్లు నిర్వహించే ఓ ప్రైవేట్‌ కాంట్రాక్టర్‌ మృతి చెందారు. ఈవోతో సహా మరో 15 మందికి పైగా ఉద్యోగులు కరోనా బారినపడ్డారు. వీరిలో ఇప్పటికే కొందరు కోలుకోగా, మరికొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇంకొందరు హోం క్వారంటైన్‌లో ఉన్నారు. 


భక్తుల రాక నామమాత్రమే..

ప్రస్తుతం భక్తుల సంఖ్య నామమాత్రంగానే ఉంది. సాధారణ రోజుల్లో రోజూ 20వేల నుంచి 30వేల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకునేవారు. సెలవు రోజులు, పర్వదినాల్లో 40వేల నుంచి 50వేల వరకు వచ్చేవారు. లాక్‌డౌన్‌లో భాగంగా దుర్గగుడిలో దర్శనాలను రద్దుచేసి రెండు నెలలకు పైగా అమ్మవారికి ఏకాంత సేవలు  మాత్రమే నిర్వహించారు. అప్పుడు ఇంద్రకీలాద్రిపై వైరస్‌ జాడ కనిపించలేదు. లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించాక.. అంటే.. జూన్‌ 10 నుంచి మళ్లీ దర్శనాలను పునరుద్ధరించారు.


ముఖానికి మాస్కు ధరించి, క్యూలైన్‌లో భౌతికదూరం పాటిస్తూ, శానిటైజర్లు వినియోగిస్తూ టైంస్లాట్‌ ప్రకారం రోజుకు 6వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే, ఆషాఢ మాసంలో అమ్మవారికి సారె సమర్పించేందుకు, ప్రస్తుతం శ్రావణ మాసం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కౌంటర్ల వద్ద, క్యూలైన్ల వద్ద కొవిడ్‌ నిబంధనలను అమలు చేయడంలో అధికారులు ఉదాశీనంగా వ్యవహరించారు. దీంతో కొండపై కరోనా వ్యాపించింది. భక్తుల సంఖ్య కూడా తగ్గింది. రోజుకు 6వేల మంది అమ్మవారిని దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేస్తే వారం రోజులుగా 2వేల మంది కూడా రావట్లేదు.


ఆదాయం తక్కువ.. ఖర్చు ఎక్కువ.. 

దర్శనాలను పునరుద్ధరించినప్పటికీ ఆశించినస్థాయిలో భక్తులు రాకపోవడంతో దేవస్థానానికి కానుకల రూపంలో వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గింది. నిర్వహణ ఖర్చులు మాత్రం పెరిగాయని దేవస్థానం వర్గాలే చెబుతున్నాయి. తొలుత ఉచిత, రూ.100 క్యూలైన్లను మాత్రమే ప్రారంభించారు. తర్వాత ఆదాయం రాబట్టుకోవడం కోసం రూ.300 క్యూలైన్‌ను కూడా ప్రారంభించారు. ఈ లైన్‌లో వచ్చే భక్తులు అమ్మవారి అంతరాలయ ప్రధాన ద్వారం వద్ద నుంచి దర్శనం చేసుకుంటుండటం, అక్కడ అర్చకులు, వేదపండితులు గోత్రనామాలతో అర్చనలు చేస్తుండటంతో భక్తులు నిలిచిపోతున్నారు.


దీంతో రద్దీ ఏర్పడుతోంది. ఎక్కువ సేపు నిలబడాల్సి రావడంతో భక్తులు క్యూలైన్లలోని స్టీల్‌ గ్రిల్స్‌ను సపోర్టుగా పట్టుకుంటున్నారు. వాటి ద్వారానే వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి సోకుతుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే మిగిలినవారు కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో మళ్లీ కొంతకాలం దర్శనాలను రద్దుచేసి అమ్మవారికి గతంలో మాదిరిగా ఏకాంత సేవలను కొనసాగిస్తే వైరస్‌ అదుపులోకి రావచ్చని ఆలయ ఉద్యోగులు, సిబ్బంది చెబుతు న్నారు. ఈ విషయాన్ని ఇంతకుముందే దేవస్థానం ఈవో దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదని చెబుతున్నారు.


ఉద్యోగులు, సిబ్బంది ఇలాగే వైరస్‌ బారినపడితే రానున్న దసరా ఉత్సవాల్లో ఇబ్బందులు పడాల్సి వస్తుందంటున్నారు. లేదంటే ఉద్యోగులందరినీ నాలుగు బ్యాచ్‌లుగా విభజించి.. వారం, పదిహేను రోజులు పనిచేసినవారు మరో వారం, పదిహేను రోజులు హోం క్వారంటైన్‌లో ఉండేలా షిఫ్ట్‌ డ్యూటీలు వేయాలని వారు కోరుతున్నారు. 


ఇన్‌చార్జి ఈవో లేక ఇబ్బందులు

కరోనాను అడ్డుకోవాలంటే దర్శనాలను కొన్నాళ్లపాటు నిలిపివేయడం లేదా ఉద్యోగులు, సిబ్బందికి షిఫ్ట్‌ డ్యూటీలు వేయడం చేయాలి. ఈ చర్యలు అమలు చేసే అధికారం ఉన్న ఈవో కరోనా బారినపడి సెలవులో ఉన్నారు. ఇలాంటి సమయంలో ఇన్‌చార్జి ఈవోను నియమించాల్సిన అవసరం ఉంది. కరోనా బారినపడిన ఉద్యోగులకు ప్రభుత్వం 14 రోజులు సెలవులు మంజూరు చేయడంతో దుర్గగుడికి ఇన్‌చార్జి ఈవోను నియమించలేదు. కాబట్టి ఈ అంశాన్ని దేవదాయశాఖ కమిషనర్‌ దృష్టికి తీసుకువెళ్లాలని దేవస్థానం ఉద్యోగులు, సిబ్బంది ఆలోచన.

Advertisement
Advertisement
Advertisement