బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌ - 2 టెండర్ల గడువు పెంపు

ABN , First Publish Date - 2020-07-06T12:44:02+05:30 IST

బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌ - 2 టెండర్ల గడువు పెంపు

బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌ - 2 టెండర్ల గడువు పెంపు

విజయవాడ: బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌ రెండో వరుస (బెంజ్‌ - 2)కు టెండర్ల గడువును జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌) మరో మారు పెంచింది. టెండర్ల లో పాలు పంచుకోవటానికి ఆసక్తి చూపిస్తున్న బిడ్డర్లు బెంజ్‌ - 2 ఫ్లై ఓవర్‌కు సంబంధించిన డిజైన్‌, అలైన్‌మెంట్‌పై సందేహాలు వ్యక్తం చేసినట్టు సమాచారం. వీటికి సంబంధించి సాంకేతిక అంశాల గురించి చర్చించాలని ఎన్‌హెచ్‌, బిడ్డర్లు నిర్ణయించటంతో టెండర్ల దరఖాస్తుకు గడువును మరో పన్నెండు రోజుల పాటు వాయిదా వేశారు. టెండర్ల గడువును జూలై 14వ తేదీ వరకు పొడిగించారు.


రూ.100 కోట్ల వ్యయం తో కూడుకున్న బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌ - 2 పనులకు సంబంధించి టెండర్లు పిలవగా బిడ్డర్ల నుంచి పెద్దగా ఆసక్తి రాదని భావించారు. మొదటి వరస పనులను దిలీప్‌ బిల్డ్‌కాన్‌ చేపట్టింది. విజయవాడ - మచిలీపట్నం నాలుగు వరసల రోడ్డు ప్రాజెక్టులో భాగంగా బెంజిసర్కిల్‌ మొదటి వరస ఫ్లై ఓవర్‌ ఉండటం వల్ల ఈ పనిని దిలీప్‌ బిల్డ్‌కాన్‌ సంస్థ చేపట్టింది. ఒక రకంగా చెప్పాలంటే బడా కాంట్రాక్టు సంస్థలకు ఇది చిన్న వర్క్‌ ! ఎలాగూ దిలీప్‌ బిల్డ్‌కాన్‌ నాలుగు వరసల రోడ్డు అనుబంధిత పనులు కొనసాగిస్తున్నందున ఈ సంస్థ సహజంగానే ఆసక్తి చూపిస్తోం ది. మిగిలిన కాంట్రాక్టు సంస్థలు ఆసక్తి చూపించవని భావించినా.. పలు ఔత్సాహిక బిడ్డర్లు ఆసక్తి చూపించటం గమనార్హం. 


బిడ్డర్ల ఆసక్తి మేరకు టెండర్లు గడువును పెంచాల్సి వస్తోంది. కరోనా సీజన్‌లో నిర్మాణరంగం కూడా కకావికలమౌతోంది. నిర్మాణరంగ సంస్థల ఎకానమీ కూడా ఆశించిన విధంగా లేదు. ఒకప్పుడు సెలెక్టివ్‌ ప్రాజెక్టుల లోనే పోటీపడే కాంట్రాక్టు సంస్థలు ప్రస్తుతం ఏ పని అయినా సిద్ధపడిపోయే పరిస్థితి ఏర్పడింది. రూ. 100 కోట్ల ప్రాజెక్టు అయినప్పటికీ అనేక సంస్థలు ఆసక్తి చూపిస్తుండటం టెండర్లలో పాలుపంచుకోవాలని పోటీలు పడటం గమనార్హం.  

Updated Date - 2020-07-06T12:44:02+05:30 IST