కేసీఆర్‌కు సీఎం పదవి.. ఆయన భిక్షే : విజయశాంతి

ABN , First Publish Date - 2022-02-03T21:55:08+05:30 IST

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అందించిన రాజ్యాంగాన్ని సీఎం కేసీఆర్ అవమానించారంటూ.. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ నేత విజయశాంతి సోషల్ మీడియాలో తీవ్రంగా స్పందించారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం పెట్టిన భిక్ష వల్లే కేసీఆర్..

కేసీఆర్‌కు సీఎం పదవి.. ఆయన భిక్షే : విజయశాంతి

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అందించిన రాజ్యాంగాన్ని సీఎం కేసీఆర్ అవమానించారంటూ.. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ నేత విజయశాంతి సోషల్ మీడియాలో తీవ్రంగా స్పందించారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం పెట్టిన భిక్ష వల్లే కేసీఆర్.. సీఎం పదవిని అనుభవిస్తున్నారని గుర్తు చేశారు. విజయశాంతి వ్యాఖ్యలు ఆమె మాటల్లోనే..


‘‘పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ను ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్ పెట్టి మరి మాట్లాడిన భాషను చూసి రాష్ట్ర ప్రజలు అసహ్యించుకుంటున్రు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతమైన పదవిలో ఉండి దేశ ప్రధానిని, మహిళా ఆర్థికమంత్రిని అవమానపరిచేలా కేసీఆర్ మాట్లాడడం సిగ్గుచేటు. మొదటి నుంచి దళితుల పట్ల ప్రేమ ఉన్నట్లు నటించిన కేసీఆర్... పార్లమెంట్ సమావేశాల ముందు దళిత సామాజిక వర్గం నుంచి వచ్చిన రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించడంతోనే ఆయన బండారం బట్టబయలైంది.  ఇదే ప్రెస్‌మీట్‌లో భారత రాజ్యాంగం గూర్చి సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆయన అసలు నిజ స్వరూపాన్ని బయటపెట్టాయి.


‘‘34 డిగ్రీలు, 06 పీహెచ్ డీలు చేసిన ఒక గొప్ప ప్రపంచ మేధావి, స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చాలని... 2సార్లు డిగ్రీ ఫెయిల్ అయిన సీఎం కేసీఆర్ అనడం అంబేడ్కర్ గారిని అవమానపరచడమే. అసలు ఇదే రాజ్యాంగంలోని ఆర్టికల్ 2.3 ప్రకారం తెలంగాణ రాష్ట్రం  ఏర్పడగా... కేసీఆర్ అనుభవిస్తున్న సీఎం పదవి భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ గారు పెట్టిన బిక్షేనని గుర్తించాలి. స్వరాష్ట్రం ఏర్పడితే తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి దళితుడే అని చెప్పి... చివరికి తానే ముఖ్యమంత్రి అయిన దళిత ద్రోహి కేసీఆర్.


‘‘హైదరాబాదులో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని పెడతానని చెప్పి దళితుల ఓట్లను కొల్లగొట్టి ఇప్పటికీ విగ్రహం పెట్టకపోగా... ఏడేండ్ల ఏలుబడిలో ఏనాడూ అంబేడ్కర్ జయంతి, వర్థంతులకు హాజరై ఆ మహనీయుడి ఫొటోకు పూలదండ వేసిన పాపాన పోలేదు. కానీ.. బీజేపీ ప్రభుత్వం అంబేడ్కర్ స్ఫూర్తి కేంద్రాలను పెట్టి భావితరాలకు ఆయన చరిత్రను అందిస్తోంది. ఇప్పటికైనా... రాష్ట్రంలోని దళిత సమాజం కేసీఆర్ కుట్రలను తిప్పికొట్టాలి. రాజ్యాంగాన్ని రచించిన అంబేడ్కర్ గారిని, రాజ్యాంగాన్ని కించపరిచే ఈ అహంకార ముఖ్యమంత్రికి రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ది చెప్పడం ఖాయం’’. అని పేర్కొన్నారు.

Updated Date - 2022-02-03T21:55:08+05:30 IST