తెలంగాణ రాష్ట్రంలో అటవీ భూముల కబ్జాలు, పోడు రైతులైన గిరిజనులు, ఆదివాసీలపై జరుగుతున్న దాడులు, ఇతర పరిణామాలపై బీజేపీ నేత విజయశాంతి తీవ్ర స్థాయిలో స్పందించారు. పోడు భూములకు పట్టాలిస్తారని ప్రచారం జరుగుతున్న నాటి నుంచి కబ్జాదారుల ఆగడాలు మరింత పెరుగుతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 66 లక్షల ఎకరాల వరకు అడవులు విస్తరించి ఉండగా... అందులో సుమారు 8 లక్షల ఎకరాలు కబ్జాల కారణంగా కనుమరుగైందని, సుమారు మరో 10 లక్షల ఎకరాలు కబ్జా కోరల్లో చిక్కుకుందని రాములమ్మ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఆ పోస్టు యథాతథంగా....
''రాష్ట్రంలో అడవి ఆగమవుతున్నది. గిరిజనులు, ఇతర సాంప్రదాయ తెగల ముసుగులో అధికార పార్టీ నేతల అనుచర రాబందులు కబ్జాలకు పాల్పడుతూ బినామీ పేర్లతో సుమారు లక్ష ఎకరాలు ఆధీనంలోకి తీసుకున్నా... ప్రభుత్వం మాత్రం ఏళ్ల తరబడి సాగుచేసుకుంటున్న పోడు రైతులపై ఫారెస్ట్ అధికారుల సహకారంతో దాడులకు ఉసిగొల్పుతోంది. అర్హులకు పట్టాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని, ఇందుకోసం దరఖాస్తులు ఆహ్వానిస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ఇటీవల చేసిన ప్రకటన... కబ్జాదారులు మరింత భూమిని కబ్జా చేసేలా ఉంది. అటవీ భూముల్లో సాగు చేసుకుంటున్న గిరిజనులు, ఆదివాసీలు ఇతర సామాన్యులతో సమస్య లేకున్నా... అధికార పార్టీ నేతల బినామీ కబ్జాలతోనే అడవులు విధ్వంసమవుతున్నాయి. విలువైన కలప, అటవీ సంపదను బహిరంగ మార్కెట్కు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకున్న దాఖలాలు లేవు. గతంలో కాగజ్ నగర్ అడవుల్లో 2019 జూన్ 30న అటవీశాఖ అధికారులపై జరిగిన దాడే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. రాష్ట్రంలో 66 లక్షల ఎకరాల వరకు అడవులు విస్తరించి ఉంటే అందులో సుమారు ఎనిమిది లక్షల ఎకరాలు కబ్జాల కారణంగా కనుమరుగైంది. సుమారు మరో 10 లక్షల ఎకరాలు కబ్జా కోరల్లో చిక్కుకుంది. ఇందులో సుమారు లక్ష ఎకరాలకు ఆర్ఒఎఫ్ఆర్ పథకం కింద తాము అర్హులమని చాలా మంది క్లెయిమ్ చేస్తున్నారు. వాస్తవానికి ఆర్ఒఎఫ్ఆర్ చట్టం కింద ఒక కుటుంబం గరిష్టంగా 4హెక్టార్లు లేదా పది ఎకరాల వరకు మాత్రమే పట్టా పొందడానికి అర్హత ఉంటుంది. కానీ.. రాష్ట్రంలో అధికార పార్టీ నేతల అండ దండలున్న వారు ఒక్కొక్కరు పది నుంచి 30 ఎకరాల వరకు కబ్జా చేసి బినామీల పేరిట పట్టాలు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. గిరిజనులు సాగు చేసుకోవాల్సిన చోట అధికార పార్టీ నేతల బినామీలు గద్దల్లా వాలిపోయి అటవీ భూములను చెరబడుతున్నారు. గిరిజనేతరులైన వేయి మంది చేతిలో సుమారు 25 నుంచి 30 వేల ఎకరాల అటవీభూమి బందీగా ఉందని అధికారులు తాజా లెక్కలు వెల్లడిస్తున్రు. అందులో కొందరు ఎమ్మేల్యేలు, ఎంపీల అనుచరులు, జిల్లా పరిషత్, మండల పరిషత్ ప్రజాప్రతినిధులు హస్తం ఉందనేది పచ్చి నిజం. అటవీ భూములున్న కాగజ్ నగర్, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, నిర్మల్ ప్రాంతాల్లో రాజకీయ కబ్జాలు పెరిగిపోతున్నట్టు అటవీశాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం మాత్రం నోరు మెదపడం లేదు. పోడు భూములకు పట్టాలిస్తారని ప్రచారం జరుగుతున్న నాటి నుంచి కబ్జాదారుల ఆగడాలు మరింత పెరిగిపోవడమే కాకుండా అటవీశాఖ అధికారులపై దాడులు సైతం అదే స్థాయిలో పెరుగుతుండడం గమనార్హం. రాష్ట్ర సర్కార్ గిరిజనులు,అటవీ భూముల పట్ల వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే పొమ్మనలేక పొగబెట్టినట్టు ఉంది.'' అని విజయశాంతి వ్యాఖ్యానించారు.