‘ఎంఆర్‌ కాలేజీ’ ప్రైవేటుకు!

ABN , First Publish Date - 2020-10-01T08:34:01+05:30 IST

మహారాజా వారి కళాశాల చేతులు మారుతోంది! చక్కగా... స్వయంప్రతిపత్తితో నడుస్తున్న కాలేజీని ప్రైవేటుకు అప్పగించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ ప్రతిపాదన చేసింది ఎవరో కాదు...

‘ఎంఆర్‌ కాలేజీ’ ప్రైవేటుకు!

  • చారిత్రక కళాశాల చేతులు మారుతోందా!?
  • సర్కారుకు మాన్సాస్‌ సారథి సంచయిత లేఖ 
  • అన్‌ ఎయిడెడ్‌ చేయాలని అభ్యర్థన
  • సిబ్బంది, విద్యార్థుల్లో ఆందోళన

ఆ కాలేజీ పేరు... మహారాజా కళాశాల! 150 ఏళ్ల కిందటే విజయనగరం రాజులు ఏర్పాటు చేశారు. వారే నడిపారు. తర్వాత స్వయంప్రతిపత్తి హోదా లభించింది. ఎయిడెడ్‌గా మారింది. ఇప్పుడు దీనిని ప్రైవేటుపరం చేసేందుకు పావులు కదులుతున్నాయి. 


(విజయనగరం - ఆంధ్రజ్యోతి)

మహారాజా వారి కళాశాల చేతులు మారుతోంది! చక్కగా... స్వయంప్రతిపత్తితో నడుస్తున్న కాలేజీని ప్రైవేటుకు అప్పగించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ ప్రతిపాదన చేసింది ఎవరో కాదు! స్వయానా... మాన్సాస్‌ ట్రస్టు చైర్‌ పర్సన్‌ సంచయిత! టీడీపీ సీనియర్‌ నేత అశోక్‌ గజపతి రాజును రాత్రికి రాత్రి తప్పించి... ఆయన స్థానంలో సంచయితను కూర్చోబెట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఉద్దేశాలపై అప్పుడే రకరకాల అనుమానాలు తలెత్తాయి. ఇప్పుడు... విజయనగరంలో ప్రసిద్ధి చెందిన ‘ఎంఆర్‌ కాలేజీ’ (మహారాజా కళాశాల)ని ప్రైవేటుకు అప్పగించేందుకు ప్రయత్నిస్తుండటంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఎంఆర్‌ కళాశాలకు 150 సంవత్సరాలకు పైబడిన చరిత్ర ఉంది. దీనిని 1857లో విజయనగరం రాజులు స్థాపించారు. 1879లో దీనిని డిగ్రీ కళాశాలగా అభివృద్ధి పరిచారు. 


మద్రాస్‌ కళాశాల తర్వాత రాష్ట్రంలో డిగ్రీ అందించిన కాలేజీ ఇదే. కొన్నాళ్లు మాన్సాస్‌ ఆధ్వర్యంలో నడిచిన తరువాత అటానమస్‌ కళాశాలగా రూపాంతరం చెందింది. ఇక్కడ వేలమంది చదువుకుని ఉన్నత స్థానాల్లోకి ఎదిగారు. ప్రస్తుతం ఈ కళాశాలలో ఐదువేల మంది చదువుకుంటున్నారు. 50 మంది అధ్యాపకులు, వంద మంది బోధనేతర సిబ్బంది పని చేస్తున్నారు. ఎయిడెడ్‌ కళాశాలగా మార్చిన తర్వాత ప్రభుత్వమే వీరికి జీత భత్యాలు చెల్లిస్తోంది. విజయనగరం నడిబొడ్డున రెండెకరాలకుపైగా విస్తీర్ణమున్న ప్రాంగణంలో ఈ కళాశాల ఏర్పాటైంది. ఇంతటి కీలకమైన, చారిత్రక ప్రాధాన్యమున్న కళాశాలను ఇప్పుడు... ఎయిడెడ్‌ నుంచి అన్‌ ఎయిడెడ్‌కు మార్చాలంటూ ‘మాన్సాస్‌’ ట్రస్టు చైర్‌పర్సన్‌ ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనిపై చర్యలు తీసుకునేందుకు వీలుగా వెంటనే సమగ్ర నివేదిక పంపించాలంటూ కళాశాల విద్య స్పెషల్‌ కమిషనర్‌... రాజమండ్రి రీజనల్‌ జాయింట్‌ డైరెక్టర్‌కు ఇటీవల లేఖ రాశారు.


ఏమిటీ మతలబు?

స్వయంప్రతిపత్తి హోదాతో నడుస్తున్న ఎయిడెడ్‌ కళాశాలను ప్రైవేటుకు అప్పగించాల్సిన అవసరం ఏమిటో ఎంఆర్‌ కాలేజీ సిబ్బందికి అర్థం కావడం లేదు. ఇందులో ఏదైనా మతలబు ఉండొచ్చనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. ప్రైవేటు యాజమాన్యం ఫీజుల వసూళ్లు మొదలుపెడితే పేద విద్యార్థులు చదువుకోలేని పరిస్థితి తలెత్తుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ‘‘అటానమస్‌ కళాశాలను ప్రైవేటుపరం చేయడం అన్యాయం. సిబ్బందికి  ప్రభుత్వం ప్రతి నెలా సకాలంలో జీతాలను అందజేస్తోంది. ప్రైవేట్‌ పరం చేస్తే ఇటు జీతాలకు, అటు ఉద్యోగ భద్రతకు ముప్పు తలెత్తుతుంది’’ అని కళాశాల అధ్యాపకుడు డాక్టర్‌ చిన్నారావు పేర్కొన్నారు.

Updated Date - 2020-10-01T08:34:01+05:30 IST