ఉపరాష్ట్రపతికి జల భద్రత పురోగతి నివేదిక.. ఏపీని ప్రస్తావించిన కేంద్రమంత్రి

ABN , First Publish Date - 2020-08-07T03:41:27+05:30 IST

దేశవ్యాప్తంగా జల భద్రత విషయంలో 2019-20 ఏడాదికి గాను కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ చేపట్టిన ...

ఉపరాష్ట్రపతికి జల భద్రత పురోగతి నివేదిక..  ఏపీని ప్రస్తావించిన కేంద్రమంత్రి

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జల భద్రత విషయంలో 2019-20 ఏడాదికి గాను కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ చేపట్టిన వివిధ కార్యక్రమాలు నిర్వహించింది. ఈ కార్యక్రమాల పురోగతిపై “జల శక్తి – జనశక్తి” పేరిట కేంద్ర జలవనరుల శాఖ నివేదికను రూపొందించింది. ఈ నివేదికను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ అందజేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పైపు లైన్ల ద్వారా తాగునీటి సరఫరాకోసం ఉద్దేశించిన ప్రాజెక్టుల పురోగతిని కూడా వెంకయ్యకు వివరించారు. దేశ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో నల్లా ద్వారా మంచి నీటిని అందించేందుకు చేపడుతున్న చర్యల విషయంలో రాష్ట్రాలకు కేంద్రం పూర్తి సహకారమందిస్తోందని కేంద్రమంత్రి గజేందరషెకావత్ తెలిపారు. గ్రామీణ తాగునీటి సరఫరా ప్రాజెక్టులు చేపట్టేందుకు జలశక్తి మంత్రిత్వ శాఖ హిమాలయ పర్వత శ్రేణికి అనుకుని ఉన్న రాష్ట్రాలకు, ఈశాన్య రాష్ట్రాలకు 90 శాతం, అదే విధంగా ఇతర రాష్ట్రాలకు 50 శాతం నిధులు అందిస్తోందని వెంకయ్యనాయుడుకు వివరించారు. గ్రామీణ భారతంలోని స్థానిక సంస్థల ద్వారా ఇంటింటికీ తాగునీరు అందించేందుకు 15వ ఆర్థిక సంఘం నిధులను వినియోగించాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. 


ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా, ఉదయగిరి నియోజక వర్గంలో ఇంటింటికీ తాగు నీరు అందించే ప్రాజెక్టు విషయం కూడా ప్రస్తావనకు వచ్చింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలు తమ దృష్టికి వచ్చాయని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు అందగానే నిబంధనలను అనుసరించి నల్లా కనెక్షన్ల ద్వారా తాగు నీరు అందించేందుకు 50 శాతం నిధులను త్వరిత గతిన కేటాయించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ తెలియజేశారు.


Updated Date - 2020-08-07T03:41:27+05:30 IST