- రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు
ఖమ్మం రూరల్, మే 18 : పద్మశ్రీ అవార్డు గ్రహీత, ‘వనజీవి’ దరిపల్లి రామయ్య బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే ఆయన్ను ఖమ్మం జిల్లా ఆస్పత్రికి తరలించగా, వైద్యులు తక్షణ వైద్య చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లిలో రామయ్య రోజూ ఉదయాన్నే తన ద్విచక్రవాహనంపై వెళ్లి రహదారుల వెంట ఉన్న మొక్కలకు నీరుపోసి, అనంతరం పెద్ద వృక్షాల నుంచి రాలిన విత్తనాలను సేకరిస్తుంటారు. బుధవారం ఉదయం కూడా ద్విచక్రవాహనంపై ఇంటి నుంచి బయల్దేరిన ఆయన రోడ్డు దాటుతుండగా ఎదురుగా వచ్చిన మరో ద్విచక్రవాహనం ఢీకొట్టింది.
తీవ్రంగా గాయపడిన ఆయనను స్థానికులు ఖమ్మం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆయన కుడికాలు, తల కుడి వైపు భాగంలో ఫ్యాక్చర్‌లు అయ్యాయని, శస్త్ర చికిత్స నిర్వహిస్తామని వైద్యులు తెలిపారు. ప్రమాద ఘటన, రామయ్య ఆరోగ్యంపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. ఎంపీ సంతోష్ కుమార్ ద్వారా ఆస్పత్రి ఏవోకు ఫోన్ చేయించిన సీఎం.. రామయ్య ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. గాయపడిన రామయ్యకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు వైద్యాధికారులు, వైద్యులను ఆదేశించారు. మంత్రులు పువ్వాడ, ఇంద్రకరణ్ రెడ్డిలు కూడా రామయ్య ఆరోగ్యంపై ఆరా తీశారు.
వాహనదారుడిపై ఫిర్యాదు చేయొద్దు: రామయ్య
ప్రమాద ఘటనపై వనజీవి రామయ్య కుటుంబ సభ్యులు ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే, తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో ఉన్న రామయ్య తనను ఢీకొట్టి గాయపడడానికి కారణమైన వాహనదారుడిని క్షమించడంతో పాటు మొక్కలపై తనకున్న ప్రేమను మరోసారి చాటుకున్నారు. ఆ వాహనదారుడిపై పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని, తనను ఢీకొట్టిన ఆ వాహనదారుడు వంద మొక్కలు నాటి, వాటిని సంరక్షిస్తే చాలని తన కుటుంబ సభ్యులకు రామయ్య సూచించినట్లు తెలిసింది.