వంశీ భాష వెనుక సీఎం: దేవినేని ఉమా

ABN , First Publish Date - 2021-10-26T08:31:01+05:30 IST

కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ భాషపై టీడీపీ నేతలు పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

వంశీ భాష వెనుక సీఎం: దేవినేని ఉమా

దమ్ముంటే స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామా చేయ్‌: సుచిత్ర

అమరావతి, ఏలూరు, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ భాషపై టీడీపీ నేతలు పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతున్న భాష వెనుక ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఉన్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అరోపించారు. ‘‘సీఎం ప్రమేయం లేకుండా ఒక ఎమ్మెల్యే ఇంత నీచంగా నోరు పారేసుకోరు. తనను ఎవరో ఏదో అన్నారని బహిరంగంగా ఆవేదన వ్యక్తం చేసిన సీఎం... తాను ఇలా చేయించవచ్చా? టీడీపీ ఫ్యాన్స్‌ ప్రతీకార దాడులు చేయాలా? ఆయన ఆలోచించుకోవాలి’’ అని సోమవారం ఇక్కడ విలేకరులతో అన్నారు. వంశీకి నిజంగా ఎన్నికను ఎదుర్కొనే ధైర్యం ఉంటే నేరుగా స్పీకర్‌కు రాజీనామా సమర్పించవచ్చని, వాళ్లకూ, వీళ్లకూ ఇవ్వడం ఎందుకని ప్రశ్నించారు. ఆయన నియోజకవర్గంలో ఎన్నిక వస్తే పరిటాల సునీత రావాల్సిన అవసరం లేదని, పార్టీ ఇన్‌చార్జిగా బచ్చుల అర్జునుడు సరిపోతారని తెలిపారు. మంత్రి కొడాలి నాని భాష కృష్ణా జిల్లాకు కొత్త గుర్తింపు తెచ్చిందని, ఎన్టీఆర్‌ రాజకీయ భిక్ష పెట్టిన వారిలో ఇలాంటి వారు కూడా ఉన్నారా అని ప్రజలు విస్తుపోతున్నారని వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై ఏలూరు పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి యార్లగడ్డ సుచిత్ర మాట్లాడారు. ‘‘వల్లభనేని వంశీ... దమ్ముంటే స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామా చేయ్‌. పోటీకి మేము సిద్ధం. నిన్ను ఓడించడానికి నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తున్నారు. పశువుల డాక్టర్‌ కోర్సు చదివి పశువులాగ తయారయ్యావు’’ అంటూ నిప్పులు చెరిగారు.

Updated Date - 2021-10-26T08:31:01+05:30 IST