వామ్మో.. ‘కోతల’ జీతం!

ABN , First Publish Date - 2022-01-09T07:05:41+05:30 IST

వామ్మో.. ‘కోతల’ జీతం!

వామ్మో.. ‘కోతల’ జీతం!

కొత్త పీఆర్సీతో ఒక ఇంక్రిమెంట్‌ నష్టం

లెక్కలేసుకుని ఘొల్లుమంటున్న ఉద్యోగుల

తెలంగాణతో పోల్చితే సూపరింటెండెంట్‌ స్థాయి ఉద్యోగికి 7759 తక్కువ జీతం

ఇప్పుడొస్తున్న జీతంలో 1522 కట్‌


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

సాధారణంగా పీఆర్సీ ప్రకటిస్తే... ఉద్యోగుల్లో సందడే సందడి! ఎంతెంత జీతం పెరుగుతుందో లెక్కలు వేస్తూ కూర్చుంటారు. ఇప్పుడూ లెక్కలు వేసుకుంటున్నారు. చివరికి... ఎవరికి ఎంత జీతం తగ్గుతుందో తేల్చుకుని, ఉసూరుమంటున్నారు. తెలంగాణలో తమ కేడర్‌లోనే పని చేసే ఉద్యోగులతో పోల్చితే తమకు ఎంత జీతం తగ్గుతుందో తెలుసుకుని నిట్టూరుస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటన తర్వాత అక్కడే ఉన్న ఉద్యోగ సంఘాల నేతలు చప్పట్లు కొట్టి హర్షం వ్యక్తం చేసినప్పటికీ... పీఆర్సీపై సాధారణ ఉద్యోగులు మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఐఆర్‌కంటే తక్కువ ఇచ్చిన ఫిట్‌మెంట్‌ చరిత్రలో ఇదే తొలిసారి అంటూ మండిపడుతున్నారు. ప్రస్తుతం 27 శాతం ఐఆర్‌ తీసుకుంటుండగా... ఫిట్‌మెంట్‌ను 23.29కు కుదించారు. అంటే... తేడా 3 శాతంకంటే ఎక్కువ. ఇది ఒక ఇంక్రిమెంట్‌తో సమానం. సర్వీసు మొత్తం ఒక ఇంక్రిమెంట్‌ కోల్పోయినట్లేనని, దీని ప్రభావం రిటైర్మెంట్‌ తర్వాతా ఉంటుందని చెబుతున్నారు. డీఏలు ఉద్యోగులకు హక్కుగా రావాల్సినవి. ఎప్పటికప్పుడు ప్రభుత్వం అందించాల్సినవే. కానీ... ఇప్పుడు ఫిట్‌మెంట్‌ తగ్గించి, పెండింగ్‌ డీఏలను కలిపేసి ‘జీతం తగ్గకుండా’ చూడటమే గొప్పగా ప్రభుత్వం చెబుతోందని ఉద్యోగులు వాపోతున్నారు. అన్ని డీఏలను కలిపినప్పటికీ కొత్త పీఆర్సీతో సూపరింటెండెంట్‌ కేడర్‌ ఉద్యోగి వేతనం రూ.1522 తగ్గుతుందని చెబుతున్నారు. అందుకే... ‘మాకు కొత్త పీఆర్సీ వద్దు. 27 ఐఆర్‌తో ఉన్న పాత వేతనాలే ఇచ్చేయండి’ అనే డిమాండ్లు కూడా చేస్తున్నారు.


ఇదీ లెక్క...

‘ఉమ్మడి రాష్ట్రంలో మొన్నటిదాకా కలిసి పని చేశారు. వాళ్లకంటే తక్కువ జీతం తీసుకుంటే బాగుండదు’ అనే ఉద్దేశంతోనే రాష్ట్ర విభజన తర్వాత ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ సీమాంధ్రలోనూ ఉద్యోగులకు తెలంగాణతో సమానంగా ఫిట్‌మెంట్‌ ఇచ్చారు. ఇప్పుడు సీన్‌ మారిపోతుంది. తెలంగాణ ఉద్యోగులకంటే ఏపీ ఉద్యోగులకు భారీగా జీతం తగ్గనుంది. ఉదాహరణకు... తెలంగాణలో సూపరింటెండెంట్‌ కేడర్‌లో పనిచేసే ఉద్యోగితో పోల్చితే ఏపీలో అదే కేడర్‌లో పని చేసే ఉద్యోగి జీతం రూ.7,759 తగ్గుతుందని ఉద్యోగ వర్గాలు పేర్కొన్నాయి.



Updated Date - 2022-01-09T07:05:41+05:30 IST