కలకత్తాకు దగ్గరలో ఉన్న దక్షిణేశ్వర్లో రాణీ రాసమణి అనే సంపన్నురాలు కాళికాదేవి ఆలయాన్ని కట్టించింది. శ్రీరామకృష్ణ పరమహంస (అప్పట్లో ఆయన పేరు గదాధరుడు) భగవద్భక్తి గురించి రాసమణి, ఆమె అల్లుడు మధుర్బాబు విన్నారు. తమ ఆలయంలో పూజారిగా ఉండాలని ఆయనను కోరారు. అందుకు శ్రీరామకృష్ణులు సమ్మతించి, దక్షిణేశ్వర్ వచ్చారు. ఆయన తరచూ భక్తిపారవశ్యంలో మునిగి ఉండేవారు. చుట్టూ ఉన్న ప్రపంచంలో ఏం జరుగుతోందో పట్టించుకొనేవారు కాదు.
ఒకసారి ఖరీదైన, అందమైన శాలువాను మధుర్బాబు తీసుకువచ్చి, శ్రీరామకృష్ణులకు బహూకరించారు. అలాంటి వస్తువుల మీద ఆయనకు ఎటువంటి ఆసక్తి లేదు. ఆయన ధ్యాసంతా దైవం మీదే. అయితే, ఎంతో అభిమానంగా మధుర్బాబు దాన్ని ఇచ్చారు కాబట్టి తీసుకున్నారు. మధుర్బాబు వెళ్ళిపోయిన తరువాత... ఆ శాలువాను అటూ ఇటూ చూసి... దానికి ఒకవైపు నిప్పు అంటించారు. అది సగం కాలిపోయింది, అందవికారంగా మారిపోయింది. ఇది చూసి అక్కడ ఉన్నవారు అవాక్కయ్యారు. అలా ఎందుకు చేశారని ప్రశ్నించారు.
‘‘ఇది నాకు అసలైన సౌఖ్యాన్ని కానీ, సంతోషాన్ని కానీ ఇవ్వలేదు. అంతేకాదు, దేవుడికి బదులు దాని గురించి నేను ఆలోచించేలా చెయ్యొచ్చు కూడా. అందుకే దాన్ని కాల్చేశాను. ఇప్పుడు అది అందంగా లేదు. దీనికి ఎలాంటి విలువా లేదు. అందుకని దీన్ని జాగ్రత్త పరచుకోవాలనే బెంగ నాకు ఉండదు. ఇప్పుడు నేను నా సమయమంతా దేవుడి ఆలోచనలకే కేటాయించవచ్చు. దేవుడి నామాన్నే జపిస్తూ ఉండొచ్చు. దైవ ధ్యానం కన్నా, దైవ నామస్మరణ కన్నా లోకంలో మరేదీ విలువైనదీ, గొప్పది, సౌఖ్యాన్ని కలిగించేదీ లేదు’’ అని చెప్పారు.