Abn logo
May 29 2020 @ 03:07AM

గుణాన్ని బట్టే ఆహార, యజ్ఞ, తపోదానాలు

శరీరం ఆరోగ్యంగా ఉంటేనే జ్ఞానసముపార్జన చేయగలం. మోక్షాన్నీ సాధించగలం. శరీరం పుష్టికరంగా, ఆరోగ్యంగా ఉండటానికి శ్రేష్ఠమైన ఆహారం ఎంతో ముఖ్యం. ఆహారం దొరకాలంటే పంటలు పండాలి. పంటలు పండాలంటే వానలు కురవాలి. దేవతలు తృప్తికరంగా వర్షం కురిపించాలంటే అందుకు.. విధిగా చిత్తశుద్ధితో యజ్ఞాలు చేయాలి. ఇంద్రియ నిగ్రహంతో మనస్సును పరిశుద్ధం చేసుకోవడానికి, శాంతియుతంగా జీవించడానికి, దేవతల అనుగ్రహం పొందడానికి తపస్సు తప్పనిసరి. వ్యక్తి మరణానంతరం ఉత్తమగతి చేరుకోడానికి నిస్వార్థంగా  దానాలు చేయాలి. మనిషి జీవితంలో అత్యంత కీలకమైన ఈ నాలుగూ (ఆహారం, యజ్ఞం, తపస్సు, దానం) వారి గుణాలను (సాత్విక, రాజసిక, తామసిక) బట్టి ఉంటాయని జగత్కల్యాణ మూర్తి అయిన కృష్ణుడు అర్జునుడికి భగవద్గీతలో ఇలా చెప్పాడు..


ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః

యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు


మనుషుల స్వభావాలను బట్టి వారికి ప్రీతికరమైన ఆహారాలు మూడువిధాలుగా ఉంటాయనీ, వారాచరించే యజ్ఞాలు తపస్సులు దానాలు కూడా త్రివిధాలని ఈ శ్లోక భావం. త్రిగుణాల్లో సత్వగుణం కలవారిని సాత్వికులంటారు. వారు భుజించే ఆహారం సాత్వికాహారం. బుద్ధిబలం, ఆరోగ్యం, సుఖం, ప్రీతి మొదలైన సద్గుణాలు కల్గించే పాలు, చక్కెర వెన్న, నెయ్యి లాంటి పదార్థాలు మిక్కిలి ఇష్టంగా భోంచేస్తారు. శాస్త్రాలను విశ్వసించి, ప్రతిఫలాపేక్ష లేకుండా యజ్ఞాలు నిర్వహిస్తారు. పూర్వోక్తాలైన తపస్సులు పునీత భావంతో ఆచరిస్తారు. దానకార్యాల విషయంలో విశాలబుద్ధితో ఉంటారు.


అర్హులకు, దుర్భిక్ష కాలంలో ఆకలితో అలమటించేవారికి, దివ్యాంగులకు దైవార్పణంగా దానం చేస్తారు. ఇక.. అతి చేదు, అతి పులుపు, ఉప్పు, కారం దండిగా ఉండే పదార్థాలను, మిక్కిలి వేడిగలవి, మాడిపోయినవి, దప్పిక కల్గించేవి, రోగాలు కలిగించే పదార్థాలను తినేవారు రజోగుణం కలిగినవారు. ఆడంబరంగా జీవించడం వారి ప్రధానలక్ష్యం. యజ్ఞకార్యదీక్షా నిర్వహణలో ప్రతిఫలాపేక్ష ఉంటుంది. తమ జన్మకు తామే కారకులమనే విశ్వాసం వారిలో దృఢంగా ఉంటుంది. తాము ఆచరించే కర్మల ఫలితాలను పరమాత్మకర్పించాలనే ఆలోచన వారికి ఉండదు.


ప్రాపంచిక సుఖాల కోసం తపస్సు చేస్తారు. దానధర్మాల వ్యాసంగంలో ఒత్తిళ్లకు లోనై శాస్త్ర నిబంధనలకు,  ధర్మమార్గానికి తిలోదకాలిస్తారు. ఇక, తమోగుణులకు మంచి చెడులు తెలిసికొని వర్తించే ఇంగిత జ్ఞానం ఉండదు. సరిగ్గా ఉడకనివి, రసహీనాలైనవి, చెడువాసన కలవి, ఇతరులు భుజించి వదిలివేసినవి, అపవిత్రమైనవాటిని తింటారు. అగౌరవం, ఆక్షేపణలంటే చాలా యిష్టం. విసుగుతో, దూషణ వాక్యాలతో అతిథుల మనసులను నొప్పించి దానం చేస్తారు. అందువల్ల మరణానంతరం మృగాలుగానో, పక్షి జాతిలోనో జన్మదాల్చుతారు. రజో, తమోగుణాలు కలిగినవారైనా.. తమలోని లోపాలను ఎరిగి సత్వ గుణంతో మెలగడం ప్రయత్నపూర్వకంగా నేర్చుకుని ఆ పరమాత్మ పాదాలను ఆశ్రయిస్తే ఉత్తమ గతులు పొందడం తథ్యం.


వల్లూరు చిన్నయ్య, 9948348918

Advertisement
Advertisement
Advertisement