Abn logo
Jun 16 2021 @ 00:53AM

ప్రేమ్‌చంద్‌ అడుగుజాడల్లో వలేటి మాష్టారు

ఆయనో ఉత్తమ ఉపాధ్యాయుడు. అసాధారణ రాజకీయ విశ్లేషకుడు. సాహితీ పిపాసి. గొప్ప సాంస్కృతిక సేనాని. హిందీ ఆయన శ్వాస. ఉపాధ్యాయవృత్తి ప్రాణం. బడి పిల్లల్లో సూర్యోదయాలు చూచి తరించిన గొప్ప టీచర్‌. హిందీ పాఠాలు, సాహితీ ప్రసంగాల ద్వారా లక్షలాది మంది రేడియో శ్రోతలకు సుపరిచితులు. అందుకున్న అవార్డులతో, వరించిన బిరుదులతో, పొందిన సన్మానాలతో తన ఎత్తును తాను కొలుచుకున్న స్వయంకృషీవలుడు. అందరికీ హిందీ పంతులుగా పరిచితులైన వలేటి వెంకటేశ్వర్లు ఇటీవల కన్ను మూయడంతో విద్యారంగం ఓ గొప్ప టీచర్‌ను, హిందీ ప్రేమికుణ్ణి కోల్పోయింది.


వలేటి వెంకటేశ్వర్లు ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలం, గంగవరం గ్రామంలో జన్మించారు. పాఠశాల విద్యానంతరం ఆయన తెనాలిలోని   ‘హిందీ ప్రేమీ మండలి’లో హిందీ టీచర్‌గా శిక్షణ పొంది,   స్వగ్రామంలోని శ్రీ వలేటి కృష్ణయ్య హైస్కూలులో ఉద్యోగ జీవనం ప్రారంభించారు. దాదాపు 30 సంవత్సరాలు హిందీ బోధకునిగా, సాహితీ పరిశోధకునిగా, సమకాలీన సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాల  విశ్లేషకునిగా పేరు గడించారు. వేలాదిమంది శిష్యుల్ని హిందీలో ప్రావీణ్యులుగా, వివిధ రంగాల్లో ప్రముఖులుగా తీర్చిదిద్దారు. పాఠం చెప్పడం ఒక కళ. ఆ కళ బాగా తెలిసిన వారు వలేటి. 


విశాలమైన నుదురు, ప్రశ్నించే కనుబొమలు, వందలాది పుస్తకాలు చదివిన తేజస్సు నిండిన ముఖం, సాధారణ వస్త్రధారణ, సంచో, పుస్తకమో చేతిలో పట్టుకొని వేగంగా సాగే నడక, జీవితాంతం తాను నిర్దేశించుకున్న విలువలతో నడిచిన నడత, స్పష్టంగా, గంభీరంగా నాలుకపై నర్తించే భాష, హిందీ, తెలుగు రెంటిలోనూ సాధించిన పాండితీప్రకర్ష వలేటి వెంకటేశ్వర్లు చెరగని రూపానికి ప్రతీకలు.


లోకంలో భాషోపాధ్యాయులంటే చిన్న చూపు ఉంది. వాళ్ళు పరమ ఛాదస్తులని, లోకం పోకడ తెలియని అవివేకులనే అపోహ ఉంది. వలేటి మాష్టారు ఈ అపోహను చెరిపేసి, భాషా పండితులు సామాజిక చైతన్యసారథులని నిరూపించారు. పాఠ్యాంశాలతో పాటు లౌకిక విషయాలను కూడా విద్యార్థులకు బోధించి, సంపూర్ణ జ్ఞానులుగా దిద్దితీర్చారు. హిందీ పండిట్‌ అనే చిన్న పేరుకు పెద్ద గుర్తింపు తెచ్చారు. ఉపాధ్యాయుడిగా వలేటి విజయయాత్రలో అనేక మలుపులు, గెలుపులు ఉన్నాయి. పేదరికంతో ప్రారంభమైన తన జీవితాన్ని ముందుచూపుతో మలుపు తిప్పుకున్నారు. తిరిగిన మలుపు నుంచి నైపుణ్యంతో నడక సాగించి ఎన్నో గెలుపులను సొంతం చేసుకున్నారు. 1987లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌టి రామారావు నుంచి రాష్ట్ర ఉత్తమ  ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. 1997లో అప్పటి రాష్ట్రపతి కెఆర్‌ నారాయణన్‌ నుంచి ‘జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ’ పురస్కారాన్ని అందుకుని, గంగవరం హైస్కూలుకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారు. 2000లో అప్పటి లోక్‌సభ స్పీకర్ బలరాం జక్కర్ నుంచి ఎన్‌జి రంగా ఫౌండేషన్ పురస్కారం అందుకున్నారు. అధికార భాష హిందీని అందలం ఎక్కించారు. అనేక స్వచ్ఛంద సంస్థలు, ప్రజా     సంఘాలు, ప్రభుత్వాలు వలేటి వారి కృషిని మెచ్చి ఇచ్చిన అవార్డులు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. ‘అవార్డుల మేష్టారు’గా అందరూ పిలిచేవారు. ఆత్మీయంగా గౌరవించేవారు. 


విద్య వేరు, సాహిత్య విద్యవేరు. మాష్టారు విద్యను పిల్లలకు నేర్పి, సాహిత్య విద్యను తాను నేర్చుకున్నారు. మానవత్వపు విలువలను, మానవ జీవనతత్వాన్ని చెప్పేది సాహిత్య విద్య. సంస్కారవంతమైన జీవితానికి సాహిత్య విద్య తోడ్పడుతుంది. వలేటి వెంకటేశ్వర్లు గారికి హిందీ నవలా సమ్రాట్‌ మున్షీ ప్రేమ్‌చంద్‌ దాదాపు ఆరాధ్యదైవమే. ప్రేమ్‌చంద్‌ పట్ల వారి ఆరాధన, అభిమానం ఎంత గొప్పదంటే తన కుమారులలో ఒకరికి ఆ మహారచయిత పేరు పెట్టుకున్నారు. ‘హిందీ నవలా సమ్రాట్‌’ పేరుతో మున్షీ ప్రేమ్‌చంద్‌పై ఆయన విశ్లేషణాత్మక వ్యాససంపుటిని వెలువరించారు. అందులోని ప్రతివ్యాసంలో ప్రేమ్‌చంద్‌ పట్ల ఆయనకున్న గౌరవం, భక్తి ప్రదర్శితమవుతాయి. వ్యాసాలలోని విశ్లేషణాశక్తి మనల్ని ఆపకుండా చదివింప చేస్తుంది.


వలేటి మాష్టారు రేడియో శ్రోతలకు చిరపరిచితులు. రెండు దశాబ్దాలకు పైగా హిందీ పాఠాలు చెప్పడం ద్వారా వెలకట్టలేని భాషాసేవ చేశారు. అంతేకాదు, హైదరాబాద్, విజయవాడ, మార్కాపూర్ ఆకాశవాణిలో శ్రీశ్రీ, సినారె, దాశరథి, నార్ల వెంకటేశ్వరరావు, భగత్ సింగ్ ఇతర జాతీయ నాయకులు, ప్రముఖులపై పలుమార్లు విలువైన ప్రసంగాలు చేశారు, ప్రశంసలందుకున్నారు. 


టీచర్‌గా పనిచేస్తూనే వలేటి తనలోని సృజనశక్తికి పదును పెడుతూ ఉండేవారు. 70వ దశకంలో కొన్నేళ్లపాటు ఆంధ్రజ్యోతిలో తమ ప్రాంత విలేకరిగా పనిచేశారు. ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం, ఎడిట్ పేజీలలో అనేక వ్యాసాలు రాశారు. బందిపోటు పూలన్ దేవిపై వలేటి రాసిన సుదీర్ఘ వ్యాసం ప్రతులను ఆనాటి కేంద్ర ప్రభుత్వం ప్రధాన రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాలలో ప్రదర్శించింది.


పత్రికా విలేకరిగా బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచారు. నేరుగా మంత్రుల్ని, ముఖ్యమంత్రుల్ని కలసి సూటిగా మాట్లాడే ధైర్యం వలేటి వ్యక్తిత్వానికి వన్నె తెచ్చింది. విలేకర్ల సమావేశంలో కొన్ని సామాజిక సమస్యలకు పరిష్కారాలు కూడా సూచించి, మంత్రులు, అధికారుల దృష్టి నాకర్షించేవారు. ఇదే వలేటి వారి విలక్షణ శైలి. వేదికలెక్కి ప్రసంగించేటపుడు అందరికంటే భిన్నంగా వారి ఉపన్యాసం సాగేది. తన ప్రసంగంలో విషయాన్ని వివరిస్తూనే మధ్యమధ్యలో సందర్భానుసారంగా మాస్కో లైబ్రరీ, అమెరికన్‌ కాంగ్రెస్‌ లైబ్రరీ, జోసెఫ్‌ మాజినీ, బిస్మార్క్‌, ఉడ్రో విల్సన్‌, స్టాలిన్‌, డా. అంబేడ్కర్‌, సర్దార్‌ పటేల్‌, మున్షీ ప్రేమ్‌చంద్‌, సూర్యకాంత్‌ త్రిపాఠి, నిరాలాల ప్రస్తావన తెచ్చి ఉపన్యాసానికి నిండుదనాన్నిచ్చి హర్షధ్వానాలందుకునేవారు. 


ప్రముఖ పాత్రికేయులు, సభాసమ్రాట్‌ తుర్లపాటి కుటుంబరావు ప్రసంగాలు వలేటి వారికి స్ఫూర్తిదాయకాలు. ఆయనకు తుర్లపాటితో 40 సంవత్సరాల అనుబంధం ఉంది. ఇద్దరిదీ విడదీయలేని ఆత్మీయస్నేహం. 


మాష్టారు విత్తుగా మొలిచి, మొక్కగా ఎదిగి, చెట్టై శాఖోపశాఖలుగా విస్తరించి, పుష్పించి, ఫలించి, జ్ఞానవృక్షంగా వేల పక్షులకు కొమ్మగా, అమ్మగా నీడనిచ్చి ఆశీర్వదించిన జ్ఞానఋషి. హిందీకి నిలువెత్తు ఆకారంగా, వెలుగునిచ్చే దారిదీపంగా, శబ్దనిశ్శబ్దాల మధ్య చైతన్యరూపంగా సార్థక జీవితం గడిపిన వలేటి వెంకటేశ్వర్లు ప్రకాశం జిల్లా ప్రేమ్‌చంద్‌గా చిరస్మరణీయులు.

బీరం సుందరరావు