బీసీ కమిషన్‌ చైర్మన్‌గా వకుళాభరణం

ABN , First Publish Date - 2021-08-24T08:01:32+05:30 IST

తెలంగాణ బీసీ కమిషన్‌ చైర్మన్‌గా డా. వకుళాభరణం కృష్ణమోహన్‌ రావు నియమితులయ్యారు.

బీసీ కమిషన్‌ చైర్మన్‌గా వకుళాభరణం

  • ముగ్గురు సభ్యులతో నూతన కార్యవర్గం 
  • సభ్య కార్యదర్శిగా బీసీ సంక్షేమ శాఖ కమిషనర్‌


హైదరాబాద్‌,  హుజూరాబాద్‌, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ బీసీ కమిషన్‌ చైర్మన్‌గా డా. వకుళాభరణం కృష్ణమోహన్‌ రావు నియమితులయ్యారు. ఈ మేరకు సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సభ్యులుగా సీహెచ్‌ ఉపేంద్ర, శుభప్రద పటేల్‌ నూలి, కె. కిషోర్‌ గౌడ్‌, సభ్య కార్యదర్శిగా బీసీ సంక్షేమ శాఖ కమిషనర్‌ను నియమించారు. సూర్యాపేట జిల్లాకు చెందిన సీహెచ్‌ ఉపేంద్ర.. తెలంగాణ అడ్వకేట్‌ జేఏసీ స్పోక్స్‌ పర్సన్‌గా, టీఆర్‌ఎస్‌ లీగల్‌ సెల్‌లో కొనసాగుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఉపేంద్రపై సుమారు 150 వరకు కేసులున్నాయి. శుభప్రద పటేల్‌ వీరశైవ లింగాయత్‌ వర్గానికి చెందిన వారు. వికారాబాద్‌ జిల్లాకు చెందిన ఆయన ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన కిషోర్‌ గౌడ్‌ 2010-16 వరకు టీఆర్‌ఎ్‌సవీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 2006-2010 వరకు టీఆర్‌ఎ్‌సవీ రాష్ట్ర కార్యదర్శిగా, 2004-2006 వరకు దిల్‌సుఖ్‌నగర్‌ జోన్‌ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.ఉద్యమ సమయంలో కీలకంగా వ్యవహరించిన కిషోర్‌పై వివిధ పోలీస్‌ స్టేషన్లలో 50 వరకు కేసులు నమోదయ్యాయి. 


హుజూరాబాద్‌కే ప్రాధాన్యం

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ఆ ప్రాంతానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. మొన్న ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్‌గా హుజూరాబాద్‌ ప్రాంతానికి చెందిన వ్యక్తిని నియమించారు. ‘దళిత బంధు’ను హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పైలెట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించారు. ఇప్పుడు బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ పదవి కూడా హుజూరాబాద్‌ నియోజకవర్గానికి చెందిన వ్యక్తికే కట్టబెట్టారు.  


ఇదీ నేపథ్యం...

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌కు చెందిన కృష్ణ మోహన్‌రావు 1970 నవంబరు 2న జన్మించారు. ఓయూలో ఎంఏ, పీహెచ్‌డీ చేశారు. గత బీసీ కమిషన్‌లో సీనియర్‌ సభ్యులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004 నుంచి 2009 వరకు రెండు సార్లు, తెలంగాణలో 2016 నుంచి 2019 వరకు ఒకసారి ఇలా మొత్తం మూడు సార్లు కమిషన్‌ సభ్యుడిగా పని చేశారు. 2009లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా హుజూరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.  వకుళాభరణం బీసీల్లోని అత్యంత వెనుకబడ్డ ‘దాసరి’ (బీసీ-ఏ)సామాజిక వర్గానికి చెందినవారు.‘దశాబ్ది కవిత్వం(1991-2000 వరకు) పరిశీలన’’ అంశంపై సిద్ధాంత వ్యాసం సమర్పించి డాక్టరేట్‌ పట్టా పొందారు.


కేసీఆర్‌కు రుణపడి ఉంటా: వకుళాభరణం

తనకు గౌరవం, గుర్తింపు ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటానని కృష్ణ మోహన్‌ రావు తెలిపారు. ఈ హోదాతో వెనుకబడ్డ వర్గాలు సమున్నతంగా ఎదగడానికి తాను శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు.

Updated Date - 2021-08-24T08:01:32+05:30 IST