అస్తిత్వ చరిత్ర –అస్తిత్వ స్పృహ

ABN , First Publish Date - 2021-07-10T07:06:05+05:30 IST

అస్తిత్వ స్పృహను పెంచి పెద్ద చేయడంలో తోడ్పడే అంశాలయిన- చరిత్ర, సంస్కృతుల పెంపుదల, మాతృభాషాభివృద్ధి, సామాన్య, ఉన్నత విద్య అభివృద్ధికి నోచుకోకపోవడం బాధాకరం. పరిశోధకులకు కామధేనువు లాంటి వేటపాలెం....

అస్తిత్వ చరిత్ర –అస్తిత్వ స్పృహ

కొప్పర్తి వెంకటరమణ మూర్తి జూలై 2న రాసిన ‘తెలంగాణలేని ‘ఆంధ్ర’కు అస్తిత్వ స్పృహ ఉందా?’ అనే వ్యాసానికి స్పందన ఇది.


అస్తిత్వ స్పృహను పెంచి పెద్ద చేయడంలో తోడ్పడే అంశాలయిన- చరిత్ర, సంస్కృతుల పెంపుదల, మాతృభాషాభివృద్ధి, సామాన్య, ఉన్నత విద్య అభివృద్ధికి నోచుకోకపోవడం బాధాకరం. పరిశోధకులకు కామధేనువు లాంటి వేటపాలెం ‘సరస్వతీ నిలయం’ గ్రంథాలయం, రాజమహేంద్రవరంలోని గౌతమీ  గ్రంథాలయం, నెల్లూరు వర్థమాన సమాజ గ్రంథాలయం ఇవ్వాళ కళాకాంతులు లేక వెలవెలపోతున్నాయి. ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో, మరెన్నో కారణాలున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం సరే, విద్యావంతులు, మేధావులు, సృజనశీలురు ఆలోచిస్తారా? కార్యాచరణకు పూనుకుంటారా?


వ్యాసకర్త అస్తిత్వ ఆవశ్యకతను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విడిపోయాక తెలంగాణ తన అస్తిత్వాన్ని ఎలా అభివృద్ధి చేసుకుంటూ పోతున్నదో చెపుతూ, ఆంధ్రప్రదేశ్‌ (కోస్తా ఆంధ్ర అని వ్యాసకర్త అన్నారు)కు అస్తిత్వపు స్పృహ ఉన్నదా అని ప్రశ్నించారు. ప్రస్తుతానికి లేదని అంటూ దానిని పెంచుకోవాల్సిన ఆవశ్యకతను వక్కాణించారు. ఆంధ్రప్రదేశ్‌ చరిత్రను ‘mega narrative’ గానే చరిత్రకారులు చూస్తున్నారనీ అభిప్రాయపడ్డారు.


ఉమ్మడి రాష్ట్రం విడిపోయాక, తెలంగాణ ‘కొత్త అస్తిత్వంతో... ఒక తాజాదనంతో అడుగులు వేస్తుంటే, ఆంధ్రప్రదేశ్‌ కొత్త అస్తిత్వాన్ని సంతరించుకున్న దాఖలాలు లేవంటూ, అది పొందడానికి, ‘బహుశా కొత్తపేరు అవసరం అవుతుంది’ అన్నారు. ‘పేరులో ఏమున్నది పెన్నిధి’ అనే సూక్తినటుంచి, పేరు మార్చుకొన్నంత మాత్రాన అస్తిత్వ స్పృహ పెరుగుతుందన్న భావంలో వ్యాసకర్తకూ అంత నమ్మకం లేదేమో!


తెలంగాణలో నూతన ఉత్తేజంతో అస్తిత్వ స్పృహ పెరగడంలో ఆశ్చర్యం లేదు. తెలంగాణ ఉద్యమమే ‘అస్తిత్వ ఉద్యమం’గా పరిగణించబడింది. తమదంటూ ఒక ప్రత్యేక అస్తిత్వం కోసం పోరాడుతున్నామన్న స్పృహ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అడుగడుగునా ద్యోతకమైంది.


వ్యాసకర్త స్వయంగా చరిత్రకారుడు కావడం గమనార్హం. ‘భిన్నమైన చరిత్ర ఉండడం అస్తిత్వ ముఖ్యలక్షణాల్లో ఒకటి’ అన్నారు. ఇక్కడ భిన్నం అనే దాన్ని ఎలా నిర్వచించుకోవాలి? ప్రాంతాల మధ్య భిన్నత్వం సహజంగానే ఉంటుంది. అది అనేక విధాల వ్యక్తమవుతుంది. చరిత్ర నిర్మాణం దాన్ని బట్టే ఉండి తీరుతుంది. తెలుగువారి చరిత్ర రచన, ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతానికి చెందినది, 20వ శతాబ్ది ఆరంభంలోనే మొదలైంది. కొమర్రాజు లక్ష్మణరావు నేతృత్వంలో విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి, ఈ బృహత్కార్యాన్ని తలకెత్తుకుంది. ఆ తర్వాత కొత్త ఆధారాలతో చరిత్ర రచన నిరాటంకంగా కొనసాగింది. అటు విశ్వవిద్యాలయాల్లో, మరోవైపు ఔత్సాహిక చరిత్రకారులు, సామాజిక శాస్త్రవేత్తలు ఆంధ్ర ప్రాంత చరిత్ర, సంస్కృతులను సంపన్నం చేస్తూ వచ్చారు.


ఈ సందర్భంలో ఒక ముఖ్యవిషయాన్ని ప్రస్తావించాలి. ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర కాంగ్రెస్‌ 1976లో ప్రారంభమై వార్షిక సభలు జరిపి ప్రతి ఏడాది వివిధ విభాగాల్లో (ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక, స్థానిక, పరిశోధన) సమర్పించిన వాటిలో ఎంపిక చేసి ప్రచురించిన పరిశోధనా పత్రాల సంపుటులు 42 ఉన్నాయి. వీటిలో సభలు జరిగిన ప్రదేశాల స్థానిక చరిత్రపై భాషణలున్నాయి. అవేగాక, చరిత్ర, సంస్కృతులపై లోతైన పరిశోధనలు వందల సంఖ్యలో ఉన్నాయి. డిజిటలైజేషన్‌ ప్రక్రియ జరుగుతూ ఉంది.


ఇవి కాకుండా ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర కాంగ్రెస్‌ 1998లో చేపట్టి పదేళ్లపాటు శ్రమించి ప్రచురించిన, ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర–-సంస్కృతి తొమ్మిది సంపుటాలు, ఆంగ్ల-–తెలుగు భాషల్లో వెలువడ్డాయి. ఈ సంపుటాలు తెలుగువారి చరిత్రను క్రీ.పూ. 5000 సంవత్సరం చరిత్ర పూర్వయుగం నుంచి క్రీ.శ. 2009 దాకా రికార్డు చేశాయి.


రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర నిర్మాణానికి సంబంధించిన ఒక విషయం ప్రస్తావించాలి. ప్రభుత్వం నియమించిన ఇరు రాష్ట్రాల చరిత్రకారుల కమిటీలు చరిత్ర ఆధారాలకు సంబంధించిన ఇరు ప్రాంతాలకు చెందిన రికార్డులను, శాసనాలను, నాణేలను, పురావస్తు ఆనవాళ్లను, గ్రంథాలను పరిశీలించి రెండు రాష్ట్రాలకు అంగీకార యోగ్యంగా- నివేదికలు- సమర్పించాయి. ఆర్కైవ్స్‌కు చెందిన డాక్యుమెంట్లను చాలా వరకు తరలించి ఒక అద్దె భవనంలో ఉంచారు. తరలించాల్సిన రికార్డులు ఇంకా కొన్ని హైదరాబాద్‌లోనే ఉన్నాయని తెలిసింది. దీని బాగోగులు చూడ్డానికి ప్రభుత్వం నిపుణులతో ఒక కమిటీని నియమించినా, ఆ కమిటీ సమావేశం ఇంతవరకూ జరగలేదు. ఇక ఆర్కియాలజీ సంపదను ఇంతవరకూ- తరలించలేదు.


పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కూడ ఇంతవరకూ విభజనకు నోచుకోలేదు.

వ్యాసకర్త మరో ముఖ్యాంశాన్ని ప్రస్తావించారు. ‘ఆంధ్ర దేశం నుంచి తెలంగాణకు సాగిన ఆధునిక యుగవలసలు, వాటి అనివార్యత, పర్యవసానాల గూర్చి, నిశితంగా పరిశీలించిన విశ్లేషణలు రావాల్సి ఉంది’ అని అన్నారు. - నిజమే! హైదరాబాద్‌ నగరం రాష్ట్ర విభజనకు ముందే, అతిపెద్ద నగరంగా, కార్పొరేట్‌ వాణిజ్యాల కూడలిగా రూపుదిద్దుకుంది. వివిధ, విభిన్న ఉన్నత విద్యా, పరిశోధనా కేంద్రాలు, సంస్థలు, కార్పొరేట్‌ ఆరోగ్య వసతులు, అన్నిటికీ మించి సాఫ్ట్‌వేర్‌ నైపుణ్యాలకు కేంద్రంగా అభివృద్ధి చెందింది. ప్రపంచంలో అతి వేగంగా అభివృద్ధి చెందిన నగరాలలో హైదరాబాద్‌ను ఒకటిగా పేర్కొంటున్నారు. ఆంధ్ర ప్రాంతం నుంచి ఉన్నత విద్యకు వాణిజ్య కార్యకలాపాలు, రియల్‌ ఎస్టేట్‌, వ్యాపారాల కోసం వచ్చిన వారితో పాటు, విదేశాల్లో స్థిరపడ్డ ఆంధ్ర ప్రాంతపు వారికి కూడ అది అనువైన, నివాసయోగ్యమైన నగరంగా క్రమాభివృద్ధి చెందింది. బుద్ధిజీవులు, కళాకారులు, కవులు, సాహితీవేత్తలు పెద్ద సంఖ్యలో నగరానికొచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. ఆ మేరకు ఆంధ్రప్రాంతం తన బౌద్ధిక, ఆర్థిక వనరులను కోల్పోయింది. ఒక దశలో వలసాంధ్రుల పట్ల విముఖతే ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కారణాల్లో ఒకటిగా చెప్పబడింది. ఈ పరిణామాల ప్రభావం ఆంధ్రప్రదేశ్‌ అస్తిత్వ స్పృహపై ఎంతవరకు ఉందో నిశితంగా పరిశీలించాలి.


ఆంధ్రుల (కోస్తా, రాయలసీమ, ఉత్తరాంధ్ర) అస్తిత్వం పుట్టి, పెరిగి మద్రాసు రాష్ట్రం నుంచి విడివడి ప్రత్యేక రాష్ట్రం సాధించుకోవడంతో మొదలై అభివృద్ధి చెందింది. వివరాల్లోకి వెళ్ళకుండా ప్రస్తావించాలంటే– ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం సాగిన సుదీర్ఘకాలిక ఉద్యమ సమయంలో వెలువడ్డ చరిత్ర, సంస్కృతుల సాహిత్యం, గ్రంథ ప్రచురణలు, గ్రంథాలయోద్యమం–- వాటి ద్వారా ప్రజల్ని విద్యావంతులుగా, చైతన్యశీలురుగా చేయడం; సాహిత్య పరిషత్తులు, ప్రాచీనకళారూపాలు సముద్ధరణ, వామపక్ష, బ్రాహ్మణేతర ఉద్యమాల చైతన్యం- అదొక సాంస్కృతిక సంరంభం. ఉజ్వల శకం. అప్పటి అస్తిత్వం రూపుదిద్దుకుని అనేక త్యాగాల, ప్రాణత్యాగాల ఫలితంగా ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకుంది. అలాంటి ఉద్యమాలు మరెన్నో! ఆ స్ఫూర్తి, అప్పటి అస్తిత్వానికి ఉపకరించిన పరిస్థితులు ఈనాడు లేవు.


అస్తిత్వ స్పృహను పెంచి పెద్ద చేయడంలో తోడ్పడే అంశాలయిన- చరిత్ర, సంస్కృతుల పెంపుదల, మాతృభాషాభివృద్ధి, సామాన్య, ఉన్నత విద్య, అభివృద్ధికి నోచుకోకపోవడం బాధాకరం. పరిశోధకులకు కామధేనువు లాంటి వేటపాలెం ‘సరస్వతీ నిలయం’ గ్రంథాలయం, రాజమహేంద్రవరంలోని గౌతమీ  గ్రంథాలయం, నెల్లూరు వర్థమాన సమాజ గ్రంథాలయం ఇవ్వాళ కళాకాంతులు లేక వెలవెలపోతున్నాయి. ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో, మరెన్నో కారణాలున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం సరే, విద్యావంతులు, మేధావులు, సృజనశీలురు ఆలోచిస్తారా? కార్యాచరణకు పూనుకుంటారా?



వకుళాభరణం రామకృష్ణ

Updated Date - 2021-07-10T07:06:05+05:30 IST