హీరోలందరికీ కథలు చెప్పా!

ABN , First Publish Date - 2021-05-02T05:41:57+05:30 IST

దర్శకుడిగా శ్రీరామ్‌ వేణుది పదేళ్ల ప్రయాణం. అయితే, ఆయన చిత్రాల సంఖ్య మూడే! ‘వకీల్‌ సాబ్‌’తో శ్రీరామ్‌ వేణు పేరు బాగా వినిపించింది...

హీరోలందరికీ కథలు చెప్పా!

దర్శకుడిగా శ్రీరామ్‌ వేణుది పదేళ్ల ప్రయాణం. అయితే, ఆయన చిత్రాల సంఖ్య మూడే! ‘వకీల్‌ సాబ్‌’తో శ్రీరామ్‌ వేణు పేరు బాగా వినిపించింది. ఇటీవల ఈ సినిమా ఓటీటీలో విడుదలైన సందర్భంగా... దర్శకుడిగా ప్రయాణం, కుటుంబం తదితర అంశాల గురించి ‘నవ్య’ ప్రత్యేక సంభాషణ.



‘వకీల్‌ సాబ్‌’ థియేటర్‌ స్పందన తెలిసిందే. మరి, ఓటీటీలోకి వచ్చాక ఎలాంటి స్పందన లభించింది?

మాది జగిత్యాల జిల్లాలో మూడు బొమ్మల మేడిపల్లి. ఓ 500 గడపలు ఉంటాయి. ఉదయం మా అమ్మగారు ఊరిలో వెళ్తుంటే... అన్ని ఇళ్లలోంచి ‘వకీల్‌ సాబ్‌’ సౌండ్‌లు వినిపిస్తోందని చెప్పారు. అంతేకాదు ఫోన్‌ మాట్లాడటానికి మా అపార్ట్‌మెంట్‌ కారిడార్‌లోకి వచ్చా. ప్రతి ఫ్లాట్‌ నుంచి ‘వకీల్‌ సాబ్‌’ సౌండ్‌ వినపడుతోంది. కరోనా వల్ల కొన్ని కుటుంబాలు థియేటర్లకు వెళ్లలేకపోయాయి. ఇప్పుడు వాళ్లందరికీ సినిమా చేరువైంది. 


థియేటర్‌ రన్‌కు కరోనా సెకండ్‌ వేవ్‌ బ్రేక్‌ వేసిందా?

వంద శాతం! పరిస్థితులు బావుంటే... థియేట్రికల్‌ రన్‌ ఇంకా బావుండేదని అందరికీ తెలుసు. ఒకవేళ ఇంకో వారం ఆలస్యంగా సినిమా విడుదలై ఉంటే... డ్యామేజ్‌ ఎక్కువ జరిగేది. సినిమా కొన్నవాళ్లు సేఫ్‌. నిర్మాతలకు రావాల్సిన లాభాలు వచ్చాయి. ప్రేక్షకులకూ సినిమా చూసి హ్యాపీ.


మీకు ఈ సినిమా ఎటువంటి గుర్తింపు తీసుకొచ్చింది? 

శ్రీరామ్‌ వేణు అనే దర్శకుడు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నాడని అందరికీ తెలిసింది. ప్రేక్షకుల హృదయాలకు దగ్గర అయ్యానని అనుకుంటున్నా. 


దర్శకుడిగా ఇకపై వేగం పెంచుతారా?

నా తొలి సినిమా (ఓ మై ఫ్రెండ్‌) ఆడలేదు. అందుకని, ఆ తర్వాత ఇతరులు రాసిన కథలతో ప్రయత్నాలు చేశా. ఏదీ పట్టాలెక్కలేదు. అందుకని, విరామం వచ్చింది. కరోనా వల్ల ఓ ఏడాది విరామం వచ్చింది. నా నెక్ట్స్‌ సినిమా కథ సిద్ధంగా ఉంది. ఈసారి ఎక్కువ విరామం రాదు. సంఖ్య కంటే... సరైన చిత్రాలు చేయాలనేది నా అభిమతం. 

దర్శకుడిగా ‘ఓ మై ఫ్రెండ్‌’ చేశాక... మళ్లీ కొన్ని చిత్రాలకు ఇతర దర్శకులతో పని చేశారు కదా! ప్రయాణంలో అదీ ఓ భాగమే. సినిమా తప్ప నాకు వేరే పని రాదు, తెలియదు. ముద్ద తినాలంటే ఏదొక పని చేయాలి కదా! అందుకే ఇతరుల దగ్గర పని చేస్తూ... కథలు రాసుకుంటూ ప్రయత్నాలు చేశా. అప్పుడు... టాప్‌, మిడిల్‌, చిన్న - ఆల్మోస్ట్‌ ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరికీ కథలు చెప్పా. అందరూ రిజెక్ట్‌ చేశారు. ఆ తర్వాత ‘ఎంసిఏ’ మొదలైంది. అంతకు ముందు అయితే ఒక సినిమాపై ఏడాదిన్నర పని చేశాక... ‘అంత బడ్జెట్‌ అయితే వర్కవుట్‌ అవ్వదు’ అని నిర్మాత క్యాన్సిల్‌ చేశారు. 


ఆ సమయంలో మీకు అండగా నిలిచిందెవరు?

ఒకటి... నా మీద నాకు ఉన్న నమ్మకమే. రెండు... నా ఫ్యామిలీ! ముఖ్యంగా నా భార్య గాయత్రి, నా తమ్ముడు, అక్క... మద్దతుగా నిలిచారు.  నైతిక స్థైర్యాన్ని ఇచ్చారు. 


మీది తెలంగాణ. తెలంగాణ వ్యక్తులకు పరిశ్రమలో సరైన అవకాశాలు, గౌరవం లభించడం లేదనేది కొందరి విమర్శ. మీరేమంటారు?

ఇంతకు ముందు ఏం జరిగిందో నాకు తెలియదు. తెలంగాణ వ్యక్తిగా పరిశ్రమలోకి వచ్చా. నేను పని చేసిన దర్శకులు, హీరోలు ఎవరూ తెలంగాణ వాళ్లు కాదు. వాళ్లు నన్నెప్పుడూ పక్షపాత వైఖరితో చూడలేదు. నేనెప్పుడూ వివక్ష ఎదుర్కొనలేదు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ప్రతిభ ఉన్నవాళ్లను ఆపడం ఎవరి తరమూ కాదు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ఛాన్సులు వస్తాయి.




డౌన్‌ టు ఎర్త్‌ పర్సన్‌

‘‘నేను పవన్‌కల్యాణ్‌ అభిమాని. ఈ సినిమా చేయడానికి ముందు కల్యాణ్‌గారి గురించి ‘అందర్నీ ఒకేలా చూస్తారు. ధైర్యం ఇస్తారు. డౌన్‌ టు ఎర్త్‌ పర్సన్‌’ అని విన్నాను. సినిమా చేసేటప్పుడు అవన్నీ దగ్గర్నుంచి చూశా. ‘వకీల్‌ సాబ్‌’ విడుదల రోజు ఉదయం కల్యాణ్‌గారింటికి ‘దిల్‌’ రాజుగారితో కలిసి వెళ్లాను. తర్వాత సాయంత్రం నేను మళ్లీ వెళ్లి కలిశా. మహిళల కోసం చేసిన సినిమా, వాళ్లకు నచ్చిందని తెలిసి సంతోషించారు. కల్యాణ్‌గారికి కొవిడ్‌ పరీక్షలు చేయగా ‘నెగెటివ్‌’ రిజల్ట్‌ వచ్చింది. అయినా వెంటనే బయటకు రాకూడదు కదా! సో... ఐసోలేషన్‌లో ఉన్నారు.’’





ప్రతి గృహిణి... ఓ ఉద్యోగే!

నా భార్య పేరు గాయత్రి. మాది ప్రేమ వివాహం. ‘కొత్త బంగారు లోకం’ సహాయ దర్శకుడిగా ఉన్నప్పుడు పెద్దల్ని ఒప్పించి చేసుకున్నాం. మాకు ఓ బాబు (చంద్రకిరణ్‌), ఓ పాప (దీత్య). నా భార్య ఉద్యోగం చేస్తోంది. తను 24 గంటలూ పని చేసే... ‘హౌస్‌ వైఫ్‌’ (గృహిణి). నన్ను, పిల్లల్ని ఎంతో సపోర్ట్‌ చేస్తుంది. నా దృష్టిలో ప్రతి గృహిణి వర్కింగ్‌ విమనే. అది నాన్‌-స్టాప్‌ జాబ్‌. మాది మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీ. ‘వకీల్‌ సాబ్‌’ చూసి నా భార్య ‘బావుంది’ అని చెప్పింది. ఆ మాటలో, చూపులో ఎంతో సంతోషం కనిపించింది. నేనూ హ్యాపీ!




కరోనా పరిశ్రమలో ఎటువంటి మార్పు తీసుకొస్తోంది?

పరిశ్రమలో కంటే మనుషుల్లో మార్పు తీసుకురావాలని నుకుంటున్నా. మన జీవన విధానం, జీవితాన్ని చూస్తున్న తీరును, ప్రకృతికి ఇస్తున్న విలువలో మార్పు రావాలి. కరోనా వైరస్‌ సమూలంగా నిర్మూలింపబడి, అందరం మళ్లీ థియేటర్లలో సినిమా చూసే రోజులు రావాలి.

‘వకీల్‌ సాబ్‌’ తర్వాత ఎంతమంది నిర్మాతల నుంచి ఫోనులు వచ్చాయి? ఎందరు అడ్వాన్సులు ఇచ్చారు? ఇటువంటి సినిమా తర్వాత చిన్న నిర్మాతలు ‘మనతో ఈ దర్శకుడు చేస్తారో? లేదో?’ అని ఫోనులు చేయరు. భారీ నిర్మాణ సంస్థల నుంచే వస్తాయి. అటువంటి సంస్థలు అన్నిటి నుంచి ఫోనులు వచ్చాయి. అయితే, నేను ఎప్పుడూ, ఎవరి దగ్గరా అడ్వాన్సులు తీసుకోను. అది నా పాలసీ. 

- సత్య పులగం

Updated Date - 2021-05-02T05:41:57+05:30 IST