వడ్డెర బస్తీ.. కబ్జా మస్తీ!
ABN , First Publish Date - 2020-12-16T07:33:08+05:30 IST
నాలుగు వందల కోట్లకుపైగా విలువైన 4.16 ఎకరాల భూమి! దాదాపు నాలుగు దశాబ్దాలుగా వడ్డెరలు ఆ భూమి అనుభవదారులుగా ఉన్నారు.
రూ.400 కోట్ల సర్కారీ భూమికి ఎసరు
40 ఏళ్లుగా అనుభవదారులుగా వడ్డెరలు
4 ఎకరాల భూమి మాదంటూ ఓ కంపెనీ తెరపైకి
రికార్డులు చూపిస్తూ భూమి చుట్టూ ఫెన్సింగ్
రిజిస్ట్రేషన్ ఓ నంబర్లో.. ఫెన్సింగ్ మరో నంబర్లో
దీనినే స్పష్టం చేస్తూ ఆర్డీవో నివేదిక.. బుట్టదాఖలు
మరోసారి సర్వే చేయాలని కలెక్టర్ ఆదేశం
16 నెలలుగా నివేదికను తొక్కిపట్టిన మంత్రి
(ఆంధ్రజ్యోతి నిఘా విభాగం)
నాలుగు వందల కోట్లకుపైగా విలువైన 4.16 ఎకరాల భూమి! దాదాపు నాలుగు దశాబ్దాలుగా వడ్డెరలు ఆ భూమి అనుభవదారులుగా ఉన్నారు. ఆ భూమికి మేమే హక్కుదారులమంటూ ఓ కంపెనీ తెరపైకి వచ్చింది! భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసింది. విచిత్రం ఏమిటంటే, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌లో పేర్కొన్న ప్రాంతం వేరు.. భూమి ఉన్న ప్రాంతం వేరు. అయినా, సర్వే నివేదికను తొక్కి పెట్టి మరీ తమది కాని భూమిని చేజిక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. ప్రస్తుతం భారీ యంత్రాల సహాయంతో జోరుగా పనులు చేస్తున్నారు కూడా! ఇందుకు ఓ మాజీ మంత్రి నాగస్వరం ఊదితే.. ప్రస్తుత మంత్రి తలచుకున్నదే తడవుగా కైంకర్యం చేసే పనిలో ఉన్నారు.
నగరంలోని బేగంపేట ఎయిర్ పోర్టుకు అతి సమీపంలో ఈ దందా సాగుతోంది. బాలానగర్ మండలం బేగంపేటలోని సర్వే నంబరు 194 కొన్నేళ్లుగా పైగా భూమిగా రికార్డుల్లో ఉంది. ఇందులోని సర్వే నంబరు 194/1లో 4.16 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీనిని ఎల్బీ శాస్త్రి నగర్‌గా పిలుస్తారు. ఇందులోనే వడ్డెర బస్తీ ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఎకరా రూ.100 కోట్ల వరకూ ఉంటుంది. పహణీ రికార్డుల్లో ఈ భూమి 1978 వరకూ ఖారీజ్ ఖాతా సర్కారీగా నమోదైంది. రికార్డుల్లో వడ్డెర బస్తీవాసులు అనుభవదారులుగా ఉన్నారు. అయితే, ఈ భూమికి హక్కుదారులమంటూ ఓ కంపెనీ తెరపైకి వచ్చింది. 2
006లోనే రిజిస్ట్రేషన్ చేసుకున్నామని, ఆ భూమి తమదేనంటూ బుకాయించడం మొదలు పెట్టింది. నిజానికి, రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత రెండేళ్లపాటు ఈ డాక్యుమెంట్‌ను పెండింగ్‌లో ఉంచారు. తర్వాత ఏమైందో ఏమో కానీ పెండింగ్‌లో ఉన్న డాక్యుమెంట్‌ను రిజిస్టర్ చేస్తూ 2008లో నంబర్ ఇచ్చారు. అనంతరం, కంపెనీ యజమానులు ఈ భూమితోపాటు పక్కనే ఉన్న మరో భూమిని కలిపి 2008లో అప్పటి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ నుంచి జాయింట్ కలెక్టర్ ద్వారా ఎన్వోసీ తీసుకున్నారు. నిర్మాణాల కోసం జీహెచ్‌ఎంసీ కమిషనర్ నుంచి అనుమతి పొందేందుకు దరఖాస్తు చేసుకున్నారు.
ఓ మాజీ మంత్రి తెర వెనక ఉండి ఈ తతంగమంతా నడిపారు. దాంతో, స్థానికులు జన చైతన్య వడ్డెర అభివృద్ధి సంఘం ఏర్పాటు చేసుకుని పోరాటానికి దిగారు. అప్పటి ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ అంశంపై విచారణ జరపాలని ఆయన అప్పటి కలెక్టర్‌కు లేఖ రాశారు. విచారణ చేయాలని ఆయన ఆర్డీఓను ఆదేశించారు. దాంతో, రిజిస్టర్ జరిగిన భూమికి, పొజిషన్‌లో ఉన్న దానికి పొంతన లేదని విచారణలో ఆర్డీవో తేల్చారు. దీనిపై కోర్టులో వివాదం మొదలైంది. ఈ సమయంలో ఈ భూమి మరో కంపెనీ చేతిలోకి మారింది. చివరకు, రీ సర్వే చేసి వివాదం పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను కోర్టు ఆదేశించింది. ఈ మేరకు సర్వే అధికారులను పంపారు.
కానీ, ఒత్తిళ్ల కారణంగా సర్వే సరిగా చేయకుండా అంతా బాగానే ఉందని తేల్చారు. ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా నివేదిక పంపారు. దీనిపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు భూమి వద్దకు వచ్చి సర్వే చేయలేదని అప్పటి మేడ్చల్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దాంతో, సర్వే ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ ఆధ్వర్యంలో సర్వే చేయాలని 2016 మేలో ఆయన ఆదేశించారు.
సర్వేను కొన్నాళ్లు అడ్డుకున్నా.. చివరకు స్థానికుల ఒత్తిడి మేరకు పూర్తి చేశారు. ఇది జరిగి ఇప్పటికి 16 నెలలు గడిచింది. అయినా, నివేదిక మాత్రం ఇవ్వలేదు. తెర వెనక మంత్రి ఆదేశం మేరకే నివేదికను నిలిపి వేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. బస్తీవాసులు మాత్రం సర్వే రిపోర్ట్ కోసం ఇంకా తిరుగుతూనే ఉన్నారు.
భూమి ఒకచోట.. రిజిస్ట్రేషన్ మరోచోట
వడ్డెర బస్తీవాసుల భూములను కంపెనీ యజమానులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కానీ, రికార్డుల్లో సర్వే నంబరు వేరేది ఉంది. ఇదే ఇప్పుడు బస్తీవాసులకు ఆధారమైంది. ఆ భూములను 2006లోనే తాము రిజిస్ట్రేషన్ చేసుకున్నామంటూ ఓ కంపెనీ వచ్చింది. దీనిపై స్థానికులు అభ్యంతరం తెలిపారు. దాంతో, సదరు కంపెనీ యజమానులు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు చూపించారు. వాటిని చూసి స్థానికులు అవాక్కయ్యారు.
రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లలో ఈ భూమి సర్వే నంబరు 194/1 అని పేర్కొన్నప్పటికీ.. భూమి ఉన్న ప్రాంతం మాత్రం 194/1-10 (బ్లాక్, వార్డు నంబరు)గా చూపించారు. కానీ, భూమి చుట్టూ ఫెన్సింగ్ మాత్రం 194/1-08లో వేశారు. అసలు ఈ నంబర్‌లో అంత భూమి లేనే లేదు. అంటే, భూమి ఒకచోట ఉంటే.. రిజిస్ట్రేషన్ మరో భూమికి చేసుకుని, దాన్ని స్వాధీనం చేసుకునే యత్నం చేశారు. నిజానికి ఇదే విషయాన్ని అప్పటి ఆర్డీవో తన నివేదికలోనూ పేర్కొన్నారు. అయినా, విలువైన ఈ భూమిని కైంకర్యం చేసే యత్నాల వెనక మాజీ మంత్రి, ప్రస్తుత మంత్రి ఉన్నారు. మాజీ మంత్రి ఎన్వోసీ ఇప్పించగా.. ప్రస్తుత మంత్రి రీ సర్వే రిపోర్టు తొక్కిపెట్టారు.
ఎస్‌ఆర్ నగర్‌లో హౌసింగ్‌బోర్డు స్థలంపై కన్ను
ఎస్‌ఆర్ నగర్ ఈడబ్ల్యూఎస్ క్వార్టర్స్‌లో 1,450 గజాల ఖాళీ స్థలం ఉంది. లే అవుట్ వేసిన సమయంలోనే దీనిని కాలనీవాసుల సామూహిక అవసరాల కోసం ఖాళీగా ఉంచారు. కబ్జా కాకుండా దీన్ని కొన్నాళ్లుగా స్థానికులు కాపాడుకుంటూ వస్తున్నారు. గతంలో కొందరు కబ్జాకు ప్రయత్నిస్తే.. అప్పటి ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి వెళ్లి దగ్గరుండి ఇది ప్రభుత్వ భూమి అంటూ బోర్డు పెట్టించారు.
ఇప్పుడు దీనిపై స్థానిక నేత (మాజీ ప్రజా ప్రతినిధి) కన్నుపడింది. తనకు సన్నిహితంగా ఉండే అమాత్యుని సహకారంతో కైంకర్యం చేసేందుకు ఎత్తుగడ వేశారు. తెరపైకి ఓ వ్యక్తిని రంగంలోకి దింపారు. ఆయన తప్పుడు పత్రాలతో ఖాళీ స్థలాన్ని చదును చేసి ఆక్రమించే యత్నం చేశారు. స్థానికులు అడ్డుకుని పనులు ఆపించారు. అధికారులను కలిసి రూ.30 కోట్ల విలువైన ఈ భూమిని కాపాడాలని కోరారు. ఎవరూ వారికి సహకరించలేదు.
ఓరోజు సదరు వ్యక్తి భూమి వద్దకు వస్తే స్థానికులు ‘మీ దగ్గర ఏ పత్రాలు ఉన్నాయి?’ అని నిలదీశారు. తనకు అనుకూలంగా కోర్టు ఆదేశాలు ఉన్నాయని చూపించారు. ఆయన చెప్పిన దానికి భిన్నంగా అందులో ఉంది. దీంతో, స్థానికులు గట్టిగా బుద్ధి చెప్పారు. ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు కూడా కలిసి రాకపోవడంతో తాత్కాలికంగా వెనక్కి తగ్గారు.

బన్సీలాల్‌పేటపైనా కన్ను
బేగంపేటలోనే కాదు.. బన్సీలాల్‌పేటలోనూ సదరు మంత్రి సర్కార్ భూమిపై కన్నేశారు. తన అనుచరులైన కొందరి తాతల పేరు మీద అక్కడ భూమి ఉన్నట్లు పత్రాలు సృష్టించారు. స్థానికులను వెళ్లగొట్టే యత్నం చేస్తున్నారు. బాకారం గ్రామ రెవెన్యూ పరిధిలోని పాత సర్వే నంబరు పేరు మీద తప్పుడు పత్రాలు సృష్టించి ఏకంగా 5.14 ఎకరాలను కైంకర్యం చేసే ఎత్తుగడ వేశారు. ఇప్పటికే ఈ తప్పుడు పత్రాలను అడ్డుపెట్టుకుని కొందరు స్థానికులను అక్కడి నుంచి పంపించేశారు.

బాకారం రెవెన్యూ పరిధిలోని బన్సీలాల్‌పేటలో కొంత ఖాళీ భూమి ఉంది. దీన్ని కొట్టేసేందుకు తమ తాత ముత్తాతలకు పాత సర్వే నంబరు 33/1లో 5.14 ఎకరాలు ఉందని, ఇది కొత్త సర్వే నంబర్లు 190 నుంచి 227 కిందకు వస్తుందంటూ రికార్డులు సృష్టించారు. దీంతో, బెంబేలెత్తిన స్థానికులు ఉన్నతాధికారులను కలిసి విచారణ జరపాలని కోరారు.
దీనిపై 2010లో సిక్రిందాబాద్ ఆర్డీవో విచారణ జరిపి.. పాత సర్వే నంబర్ల ప్రకారం చూస్తే 33/1 ఎక్కడా లేదని, దీనికి సంబంధించిన లింక్ దొరకడం లేదని విచారణలో తేల్చారు. అయినా, ఈ భూమికి కూడా ఇప్పుడు అమాత్యులు రెక్కలు తొడుగుతున్నారు.
