వ్యాక్సినేషన్ ముమ్మరం
ABN , First Publish Date - 2021-04-17T05:30:00+05:30 IST
ప్రతినిత్యం కరోనా కేసులు పెరుగుతుండటంతో వ్యాక్సిన్ తీసుకునేందుకు జనం క్యూ కడుతున్నారు. పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సీహెచ్‌సీలు, అర్బన్ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రుల్లో వ్యాక్సినేషన్ నిర్వహిస్తున్నారు.
- టీకా కోసం క్యూ కడుతున్న జనాలు
- జిల్లాలో మొదటి డోసు 54,429 మందికి
- రెండవ డోసు 8,217 మందికి పూర్తి
జగిత్యాల, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): ప్రతినిత్యం కరోనా కేసులు పెరుగుతుండటంతో వ్యాక్సిన్ తీసుకునేందుకు జనం క్యూ కడుతున్నారు. పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సీహెచ్‌సీలు, అర్బన్ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రుల్లో వ్యాక్సినేషన్ నిర్వహిస్తున్నారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వ్యాక్సినేషన్ జనవరి 16వ తేదీన ప్రారంభమైంది. మొదట ఫ్రంట్‌లైన్ వారియర్లకు కోవిషీల్డ్ టీకా వేశారు. సందేహాలతో వ్యాక్సిన్‌పై ఫ్రంట్‌లైన్ వారియర్స్ ఆసక్తి చూపలేదు. దీంతో వైద్య ఆరోగ్య శాఖ జనంలో అవగాహణ కల్పించే కార్యక్రమాలు ముమ్మరం చేసింది. పల్లెలు, పట్టణాల్లో విస్తృత ప్రచారం నిర్వహించి ప్రజలను చైతన్య వంతులను చేయడానికి అధికారులు ప్రయత్నించారు. గత కొన్ని రోజులుగా టీకా కార్యక్రమం ముమ్మరంగా జరుగుతోంది.
పెరుగుతున్న కేసులతో ముందుకు
జిల్లాలో మార్చి చివరి వారం, ఏప్రిల్‌లో కరోనా సేకండ్ వేవ్ ఉధృతంగా ఉండడంతో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రతీ రోజు సగటున 500కుపైగా కేసులు నమోదు అవుతున్నాయి. అధికారుల ప్రోత్సాహంతో జిల్లాలో టీకా పంపిణీ జోరుగా సాగుతోంది. జిల్లాలో ఇప్పటి వరకు ఫ్రంట్‌లైన్ వారియర్లకు మొదటి డోసు 4,225, రెండో డోసు 1,891మందికి అందించారు. హెల్త్ వర్కర్లకు మొదటి డోసు 4,452 మందికి, రెండవ డోసు 3,978 మందికి అందిచారు. 60ఏళ్లపైబడిన వ్యక్తులకు మొదటి డోసు 20,624 మందికి, రెండో డోసు 1,131 మందికి అందించారు. 45 నుంచి 59 ఏళ్ల వ్యక్తులకు మొదటి డోసు 25,128 మందికి, రెండవ డోసు 1, 217 మందికి అందించారు. జిల్లాలో ఇప్పటివరకు మొదటి డోసు 54,429 మంది, రెండవ డోసు 8,217 మంది తీసుకున్నారు.
వాయిల్స్ వినియోగం ఇలా...
జిల్లాలో ప్రధానంగా కోవిషీల్డ్ వాయిల్స్ వినియోగిస్తున్నారు. కో వ్యాక్సిన్ వినియోగం తక్కువగా ఉంది. ఇప్పటివరకు జిల్లాకు సరాఫరా అయిన కోవిషీల్డు వాయిల్స్ సంఖ్య 5,354కాగా ఇందులో వినియోగించిన వాయిల్స్ సంఖ్య 5,335గా ఉంది. ఇంకా 19 కోవిషీల్డు వాయిల్స్ అందుబాటులో ఉన్నాయి. అదేవిదంగా జిల్లాలో 10 డోసులు గల కో వ్యాక్సిన్ వాయిల్స్ 996 సరఫరా కాగా 963 వినియోగించారు. 33 వాయిల్స్ అందుబాటులో ఉన్నాయి. జిల్లాలో 20 డోసులు గల కో వ్యాక్సిన్ వాయిల్స్ 71 సరాఫరా కాగా 71 వాయిల్స్ వినియోగించారు. ప్రస్తుతం జిల్లాలో 19 కోవిషీల్డ్ వాయిల్స్, 33 కో వాక్సిన్ వాయిల్స్ అందుబాటులో ఉన్నాయి. జిల్లాలో డిమాండ్ మేరకు టీకాలు తెప్పించడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.
వ్యాక్సిన్‌తో కరోనా వ్యాప్తిని అడ్డుకోవచ్చు
- పుప్పాల శ్రీధర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, జగిత్యాల
వ్యాక్సినేషన్‌పై ఉన్న అనవసర అనుమానాలు మానుకోవాలి. వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల కరోనా వ్యాప్తి అడ్డుకోవచ్చు. ఇప్పటికే పలు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సినేషన్ నిర్వహిస్తున్నాం. వాయిల్స్ సరాఫరాకు అనుగుణంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ నడిపిస్తాము.
వ్యాక్సిన్ వేసుకున్న మంత్రి కొప్పుల
ధర్మపురి : కరోనా నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ధర్మపురి ఆరోగ్య కేంద్రంలో శనివారం మంత్రి ఈశ్వర్ మొదటి డోస్ టీకా వేయించుకున్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్య్టా అర్హులైన వారు టీకా తప్పని సరిగా వేయించుకోవాలని కోరారు.