మొహాలీలో శ్రీలంక టీ20 లీగ్‌!

ABN , First Publish Date - 2020-07-04T08:44:31+05:30 IST

ఉవా ప్రీమియర్‌ టీ20 లీగ్‌.. ఇది శ్రీలంకలోని బదుల్లా నగరంలో జరిగే ఓ క్రికెట్‌ టోర్నీ. కానీ ఈ కరోనా సమయంలో గుట్టుచప్పుడు కాకుండా ...

మొహాలీలో శ్రీలంక టీ20 లీగ్‌!

పోలీసుల విచారణ

న్యూఢిల్లీ: ఉవా ప్రీమియర్‌ టీ20 లీగ్‌.. ఇది శ్రీలంకలోని బదుల్లా నగరంలో జరిగే ఓ క్రికెట్‌ టోర్నీ. కానీ ఈ కరోనా సమయంలో గుట్టుచప్పుడు కాకుండా మొహాలీ శివార్లలో జరగడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. నాలుగు జట్లతో సాగుతున్న టోర్నీ అంటూ ఇందులో దిల్షాన్‌, మహరూఫ్‌, అజంతా మెండిస్‌, తుషారలాంటి మాజీ ఆటగాళ్లు పాల్గొంటారని ఆన్‌లైన్‌లో ప్రచారం కూడా జరిగింది. ఓ స్పోర్ట్స్‌ వెబ్‌సైట్‌లో దీనిపై పూర్తి వివరాలు రావడంతో పాటు ఫ్యాన్‌కోడ్‌ అనే యాప్‌లో లైవ్‌ స్కోరు కూడా వచ్చింది. అయితే దీనిపై విచారణ చేపడితే ఇదో నకిలీ టోర్నీ అని తేలింది. ఇందులో పాల్గొంది కూడా స్థానిక పంజాబ్‌ క్రీడాకారులే. గత నెల 29న జరిగిన ఈ టోర్నీని భారత్‌తో పాటు ఇతర దేశాలకు చెందిన బుకీలు నిర్వహించినట్టు అనుమానిస్తున్నారు. శ్రీలంక క్రికెట్‌, ఉవా ప్రావిన్స్‌ క్రికెట్‌ సంఘం కూడా ఈ లీగ్‌తో తమకెలాంటి సంబంధమూలేదని తేల్చాయి. మరోవైపు బీసీసీఐ అవినీతి నిరోధకవిభాగం (ఏసీయూ) కూడా ఈ వ్యవహారంపై దృష్టి సారించింది. ‘మాకు తెలిసినంతవరకు బీసీసీఐతో ఒప్పందం కలిగిన ఏ ఆటగాడు కూడా ఇందులో పాల్గొనలేదు. ఒకవేళ బెట్టింగ్‌ కోసమే ఇది జరిగితే పోలీసులు దర్యాప్తు చేయాలి. ఎందుకంటే ఇలా ఆడడం చట్టవిరుద్ధం. ఈ లీగ్‌ వెనుక ఎవరున్నారనేది తేలాల్సి ఉంది’ అని ఏసీయూ చీఫ్‌ అజిత్‌ సింగ్‌ చెప్పారు.

Updated Date - 2020-07-04T08:44:31+05:30 IST