టీపీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్‌ రాజీనామా వెనుక..

ABN , First Publish Date - 2020-12-05T08:36:39+05:30 IST

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితం కాంగ్రెస్‌ పార్టీలో ప్రకంపనలు సృష్టించింది. ఈ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేశారు

టీపీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్‌ రాజీనామా వెనుక..

  • కాంగ్రెస్‌ అధిష్ఠానానికి లేఖ
  • ఏఐసీసీ ఆదేశంతోనేనా? 
  • కొత్త సారథి ఎంపికే తరువాయి


హైదరాబాద్‌, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితం కాంగ్రెస్‌ పార్టీలో ప్రకంపనలు సృష్టించింది. ఈ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఏఐసీసీకి పంపిన ఆయన.. టీపీసీసీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియను చేపట్టాలని కోరారు. అయితే, గ్రేటర్‌ ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోవడాన్ని అధిష్ఠానం సీరియ్‌సగానే తీసుకుంది. కాంగ్రె్‌సకు ఉన్న ప్రత్యమ్నాయ హోదా స్థానాన్ని బీజేపీ ఆక్రమించడాన్ని తీవ్రంగా పరిగణించిన ఏఐసీసీ.. రాజీనామా చేయాలని ఉత్తమ్‌ను ఆదేశించినట్లు పార్టీ వర్గాల సమాచారం. దీంతో టీపీసీసీకి కొత్త అధ్యక్షుడి నియామక ప్రక్రియ ప్రారంభమైనట్లేనని చెబుతున్నారు. 2015 మార్చి 11న టీపీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కాలం పీసీసీ సారథ్యం వహించిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు.


వచ్చే ఏడాది మార్చి వరకూ ఆయన కొనసాగి ఉంటే ఆరేళ్లు పూర్తి చేసుకుని రెండు సార్లు టీపీసీసీ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించిన నేత అయ్యేవారు. అయితే.. జీహెచ్‌ఎంసీ ఫలితాల దెబ్బకు ఉత్తమ్‌ రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా, ప్రస్తుతం పీసీసీ అధ్యక్ష పదవి రేసులో కాంగ్రెస్‌ ఎంపీలు రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు ఉన్నారు. ప్రజాకర్షణ విషయంలో రేవంత్‌కు సానుకూలత ఉండగా.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు పార్టీలో సీనియారిటీని క్లెయిమ్‌ చేస్తున్నారు.

Updated Date - 2020-12-05T08:36:39+05:30 IST