కొంపముంచిన ఫోన్.. పబ్లిక్ టాయ్‌లెట్‌లో పడిపోయిన యువతి.. అందులోనే ఉండి పోలీసులకు ఫోన్ చేస్తే..

ABN , First Publish Date - 2022-04-25T23:06:27+05:30 IST

: నన్ను కాపాడండి అంటూ ఇటీవల ఓ అమెరికా మహిళ.. ఎమర్జెన్సీ నెంబర్‌కు ఫోన్ చేసింది. అయితే..ఆమె చెప్పింది విని అక్కడి అధికారులు ఒక్కసారిగా ఆశ్యర్యపోయారు.

కొంపముంచిన ఫోన్.. పబ్లిక్ టాయ్‌లెట్‌లో పడిపోయిన యువతి.. అందులోనే ఉండి పోలీసులకు ఫోన్ చేస్తే..

ఎన్నారై డెస్క్: నన్ను కాపాడండి అంటూ ఇటీవల ఓ అమెరికా మహిళ.. ఎమర్జెన్సీ నెంబర్‌కు ఫోన్ చేసింది. అయితే..ఆమె చెప్పింది విని అక్కడి అధికారులు ఒక్కసారిగా ఆశ్యర్యపోయారు. పబ్లిక్ టాయిలెట్‌లో పడిపోయానని, అందులోంచి పైకి రావడం అసాధ్యంగా ఉందని ఆమె మొరపెట్టుకుంది. అంతేకాకుండా.. తన శరీరమంతా మానవవిసర్జితాలతో తడిసిపోయిందని చెప్పుకొచ్చింది. అంతకుమునుపెన్నడూ ఇలాంటి ఉదంతం విని ఉండకపోవడంతో వారు అవాక్కయ్యారు. వాషింగ్టన్‌లోని ఓలింపియన్ నేషనల్ పార్క్‌లో ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా వైరల్ అవుతోంది.  అసలేం జరిగిందంటే.. 


ఆ మహిళ నేషనల్ పార్కులోని మౌంట్ వాకర్ అనే కొండపైకి వెళ్లింది. అక్కడ ఏర్పాటు చేసిన ఓ టాయిలెట్‌లోకి వెళ్లిన ఆమె ఫోన్ బయటకు తీయగా ప్రమాదవశాత్తూ అది టాయిలెట్‌లోకి జారి పడిపోయింది. అయితే.. అది వాల్ట్ టాయిలెట్. అంటే.. మానవవిసర్జితాలన్నీ కమ్మోడ్ కింద ఉన్న ఓ గొయ్యలో నిల్వ ఉంటాయి. అక్కడ ఫ్లష్ చేసే అవకాశమే ఉండదు. ఇదంతా తెలిసిన ఆమె.. గొయ్యి లోంచి ఫోన్ బయటకు తీసేందుకు ప్రయత్నించింది. ముందుగా కమ్మోడ్‌ను పక్కకు తొలగించి.. ఆపై గొయ్యిలో చెయ్యి పెట్టి వెతికింది. కానీ ఫోన్ కనబడకపోవడంతో తన నడుముకు ఓ తాడు కట్టుకుని మరింత కిందకు దిగే ప్రయత్నం చేయగా.. ఒక్కసారిగా జారి తల్లకిందులుగా ఆ గొయ్యిలో పడిపోయింది. చుట్టూతా వ్యాపించిన దుర్గంధం, మానవవిసర్జితాలతో ఆమె ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. 


అయితే.. ఇంత జరిగినా కూడా ఆమె భయపడకుండా.. తనంతట తానుగా బయటకు వచ్చేందుకు దాదాపు అరగంట పాటు విఫలయత్నం చేసి, చివరకు ఎమర్జెన్సీ సిబ్బందికి ఫోన్ చేసింది. వారు అక్కడికి వచ్చి మహిళ పరిస్థితి చూసి షాకైపోయారు. ఆ తరువాత ఆమెను బయటకు లాగారు.  అనంతరం.. ఆమె తన ఒళ్లంతా శుభ్రం చేసుకుని ఫోన్‌తో వెళ్లిపోయింది. అయితే.. డాక్టరు వద్దకు వెళ్లండని వారు సూచించినా ఆమె వినలేదట. ఇక్కడి నుంచి ఎంత తొందరగా వెళ్లిపోతే అంతమంచిదనుకుంటూ వడవడిగా వెళ్లిపోయిందా మహిళ!

Updated Date - 2022-04-25T23:06:27+05:30 IST