Advertisement
Advertisement
Abn logo
Advertisement

భారత్ నుంచి రాకపోకలపై యూఎస్ ఆంక్షలు.. బైడెన్‌పై రిపబ్లికన్స్ విమర్శలు

వాషింగ్టన్: భారత్‌లో కొనసాగుతున్న కరోనా విలయం నేపథ్యంలో ఇక్కడి నుంచి వచ్చే విమానాల రాకపోకలపై అగ్రరాజ్యం అమెరికా ఆంక్షలు విధించింది. మే 4 నుంచి ఈ ఆంక్షలు అమలులోకి వస్తాయని పేర్కొంది. భారత్​లో కోవిడ్ ఉధృతి కొనసాగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకి వెల్లడించారు. ఈ మేరకు వైట్‌హౌస్ శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. గత 14 రోజులుగా ఇండియాలో ఉంటున్న యూఎస్ పౌరులు కాకుండా ఇతరులు తమ దేశంలోకి ప్రవేశించడానికి వీల్లేదని అధ్యక్ష భవనం తన ప్రకటనలో పేర్కొంది. అయితే, ఈ నిషేధం నుంచి అమెరికా పౌరులతో పాటు గ్రీన్‌ కార్డు హోల్డర్లు, వారి భార్యలు, 21లోపు పిల్లలకు మినహాయింపు ఇచ్చింది. తదుపరి నోటీసులు వచ్చే వరకు ఈ బ్యాన్ అమలులో ఉంటుందని స్పష్టం చేసింది. భారత్‌లో బయటపడుతున్న కరోనావైరస్ వేరింట్ యమ డేంజర్ అని, అమెరికా వైద్య నిపుణుల సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైట్‌హౌస్ తెలియజేసింది. 

ఇదిలా ఉంటే.. భారత్ నుంచి రాకపోకలపై నిషేధం విధిస్తూ బైడెన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని పలువురు రిపబ్లికన్స్ నేతలు విమర్శించారు. "మన సరిహద్దును మెక్సికో కోసం తెరిచి ఉంచినప్పుడు లేనిది.. మన మిత్రదేశానికి ప్రయాణాన్ని పరిమితం చేయడం ఎంతవరకు సమంజసం" అని రిపబ్లికన్ పార్టీ కాంగ్రెస్ సభ్యుడు టిమ్ బుర్చెట్ ట్వీట్ చేశారు. అలాగే మరో రిపబ్లికన్ నేత జాడీ అరింగ్టన్ కూడా బైడెన్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. శత్రువులకు బైడెన్ బ్యాక్ డోర్ ఓపెన్ చేసి.. మిత్రులకు ఫ్రంట్ డోర్ క్లోజ్ చేయడమేంటని జాడీ ప్రశ్నించారు. భారత్ నుంచి రాకపోకలపై నిషేధం విధించడాన్ని కాంగ్రెస్ సభ్యురాలు లారెన్ బోబర్ట్ 'జెనోఫోబిక్'గా పేర్కొన్నారు. ఇలా పలువురు రిపబ్లికన్ నేతలు వైట్‌హౌస్ నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక భారత్‌ నుంచి వచ్చే విమాన సర్వీసులపై ఇప్పటికే కెనడా, సింగపూర్‌, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, యూఏఈ పరిమితులు విధించిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement