Aarti Prabhakar: బైడెన్ ప్రభుత్వంలో మరో భారతీయ మహిళకు కీలక బాధ్యతలు..!

ABN , First Publish Date - 2022-06-22T14:25:53+05:30 IST

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వంలో ఇప్పటికే పలువురు భారత సంతతి వ్యక్తులు పలు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Aarti Prabhakar: బైడెన్ ప్రభుత్వంలో మరో భారతీయ మహిళకు కీలక బాధ్యతలు..!

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వంలో ఇప్పటికే పలువురు భారత సంతతి వ్యక్తులు పలు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తాజాగా మరో భారతీయ అమెరికన్ మహిళ కీలక పదవికి నామినేట్ అయ్యారు. అధ్యక్ష భవనం వైట్‌హౌస్ (White House) సైన్స్ సలహాదారుగా (Science Advisor) ఇండో-అమెరికన్, భౌతిక శాస్త్రవేత్త ఆర్తి ప్రభాకర్‌ను (Aarti Prabhakar) బైడెన్ నామినేట్ చేశారు. ఒకవేళ సెనేట్ ఆమె నామినేషన్‌కు ఆమోదం తెలిపితే వైట్‌హౌస్ చీఫ్ అడ్వైజర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీగా బాధ్యతలు చేపతారు. ఎరిక్ ల్యాండర్ రాజీనామాతో ఈ స్థానం ఖాళీ అయింది. దాంతో తాజాగా ఆర్తి ప్రభాకర్‌ను ఈ పదవికి బైడెన్ నామినేట్ చేశారు. ఇక సైన్స్ ఎజెండాను నెరవేర్చడంలో అమెరికా అధ్యక్షుడికి సహాయం చేయడం సలహాదారు ప్రధాన విధి. సైన్స్ కన్సల్టెంట్‌గా, సైన్స్ పాలసీ సమస్యలను పరిష్కరించడం చేయాలి. ప్రధానంగా సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో డ్రాగన్ కంట్రీ చైనాకు పోటీగా అగ్రరాజ్యాన్ని ఎలా అత్యుత్తమంగా తీర్చిదిద్దాలి వంటి కీలక బాధ్యతలు ఈ పదవికి ఉంటాయి. 


ఆర్తి ప్రభాకర్ ఎవరంటే..

ఆర్తి ప్రభాకర్ కుటుంబం ఆమెకు మూడేళ్లు ఉన్నప్పుడు భారత రాజధాని ఢిల్లీ నుంచి అమెరికాకు వలస వెళ్లింది. మొదట చికాగో వెళ్లిన వీరి ఫ్యామిలీ ఆ తర్వాత కొంతకాలానికి టెక్సాస్‌కు మకాం మార్చింది. ప్రస్తుతం టెక్సాస్‌లోని లుబ్బాక్‌లో స్థిరపడింది. ఆమె టెక్సాస్ టెక్ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పట్టా పొందారు. అలాగే కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి అనువర్తిత భౌతిక శాస్త్రంలో (Applied physics) Ph.D. పట్టా అందుకున్న తొలి మహిళగా నిలిచారు. ఇదే సంస్థ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో ఎంఎస్ పూర్తి చేశారు. అనంతరం ఆమె ఆఫీస్ ఆఫ్ టెక్నాలజీ అసెస్‌మెంట్‌లో కాంగ్రెషనల్ ఫెలోగా లెజిస్లేటివ్ శాఖలో తన కెరీర్‌ను ప్రారంభించారు. ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త అయిన ఆర్తి ప్రభాకర్ 1993లో అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ హయాంలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్స్ అండ్ టెక్నాలజీ సంస్థకు చీఫ్‌గా పని చేశారు. ఆ తర్వాత 2012 నుంచి 2017 వరకు యునైటెడ్ స్టేట్స్ డిఫెన్స్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీకి అధిపతిగా కూడా విధులు నిర్వహించారు.   

Updated Date - 2022-06-22T14:25:53+05:30 IST