అమెరికాలో 24 గంట‌ల్లో 65వేల కేసులు...

ABN , First Publish Date - 2020-07-10T19:04:15+05:30 IST

అగ్ర‌రాజ్యం అమెరికాను మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ అత‌లాకుత‌లం చేస్తోంది. అంత‌కంత‌కు పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.

అమెరికాలో 24 గంట‌ల్లో 65వేల కేసులు...

వాషింగ్ట‌న్ డీసీ: అగ్ర‌రాజ్యం అమెరికాను మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ అత‌లాకుత‌లం చేస్తోంది. అంత‌కంత‌కు పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తొలిసారిగా రికార్డు స్థాయిలో గ‌డిచిన 24 గంట‌ల్లో ఏకంగా 65,551 కొత్త కేసులు న‌మోదైన‌ట్లు జాన్స్ హాప్కిన్స్ యూనివ‌ర్శిటీ  పేర్కొంది. కాగా, వరుసగా మూడవ రోజు కనీసం 55వేల‌కు పైగా కేసులు న‌మోదు అయ్యాయ‌ని రాయిటర్స్ తెలిపింది. ఇక కాలిఫోర్నియా, ఫ్లోరిడా, టెక్సాస్ రాష్ట్రాల్లో రికార్డు స్థాయి క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కావ‌డంతో మ‌రోసారి దేశంలో ఆంక్ష‌లు విధించే దిశ‌గా చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయి. దీని ప్ర‌భావం యూఎస్ స్టాక్స్‌పై ప‌డింది. దాంతో దేశంలో మ‌ళ్లీ లాక్‌డౌన్ విధిస్తే ప‌రిస్థితి ఏంట‌ని పెట్టుబ‌డిదారులు ఆందోళ‌న చెందుతున్నారు.


మ‌రోవైపు ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా ప్ర‌భావం అంత‌గా లేని అలబామా, మోంటానా, విస్కాన్సిన్‌లో గురువారం ఒకేరోజు రికార్డు స్థాయి కేసులు న‌మోదు కావ‌డం కూడా అధికారుల‌ను కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఇప్ప‌టికే దేశంలోని 50 రాష్ట్రాల‌కు గాను ఈ మ‌హ‌మ్మారి 41 రాష్ట్రాలలో ప్ర‌బ‌లిందని రాయిటర్స్ విశ్లేష‌ణ చెబుతోంది. ఇక ప్ర‌పంచంలోనే అత్యాధిక కేసులు, మ‌ర‌ణాల‌తో అమెరికా తొలిస్థానంలో ఉంది. యూఎస్ వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు 32 ల‌క్ష‌ల‌కు పైగా మంది కోవిడ్‌-19 బారిన ప‌డ్డారు. అలాగే 1.35 ల‌క్ష‌ల మందిని ఈ మ‌హ‌మ్మారి క‌బ‌ళించింది. 

Updated Date - 2020-07-10T19:04:15+05:30 IST