తుపాకీ సంస్కృతికి కళ్లెం వేసేలా అమెరికాలో మరో ప్రయత్నం..!

ABN , First Publish Date - 2022-07-31T03:03:03+05:30 IST

తుపాకీ సంస్కృతికి అమాయకులు బలైపోతున్న నేపథ్యంలో ఈ ధోరణికి కళ్లెం వేసేందుకు అమెరికాలో మరో ప్రయత్నం జరుగుతోంది.

తుపాకీ సంస్కృతికి కళ్లెం వేసేలా అమెరికాలో మరో ప్రయత్నం..!

ఎన్నారై డెస్క్: తుపాకీ సంస్కృతికి(Gun culture) అమాయకులు బలైపోతున్న నేపథ్యంలో ఈ ధోరణికి కళ్లెం వేసేందుకు అమెరికాలో మరో ప్రయత్నం జరుగుతోంది. సెమీ ఆటోమేటిక్(Semi automatic weapons) తుపాకీల అమ్మకంపై గతంలో ఉన్న నిషేధాన్ని పునరుద్ధరించేందుకు ఉద్దేశించిన బిల్లుపై అమెరికా ప్రతినిధుల సభ తాజాగా ఆమోద ముద్ర వేసింది. ఇటీవల కాలంలో అమెరికాను కుదిపేసిన కాల్పుల ఘటనల్లో నిందితులు సెమీ ఆటోమేటక్ గన్నులు వాడిన విషయం తెలిసిందే.  


సెమీ ఆటోమేటిక్ ఆయుధాల తయారీ, అమ్మకాలను నిషేధిస్తూ 1994లో అమెరికా కాంగ్రెస్ ఓ చట్టం తీసుకొచ్చింది. పదేళ్ల కాలవ్యవధితో తీసుకొచ్చిన ఆ చట్టాన్ని తిరిగి పునరుద్ధరించలేదు. దీంతో.. అమెరికాలో సెమీ ఆటోమేటిక్ ఆయుధాల వినియోగం పెరిగిపోయింది. కాగా..  మునుపటి ఆంక్షలు ఎన్నో జీవితాలను కాపాడాయని బిల్లు పాసైన సందర్భంగా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పలోసీ వ్యాఖ్యానించారు. ఇక 217-213 మెజారిటీతో పాసైన ఈ బిల్లుకు డెమోక్రాట్లు మద్దతు తెలుపగా.. రిపబ్లికన్లు వ్యతిరేకించారు. ఈ బిల్లును ఓ ఎన్నికల స్టంట్‌గా అభివర్ణించారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన ఒక్కరు కూడా బిల్లుకు అనుకూలంగా ఓటు వేయలేదు. త్వరలో ఈ బిల్లు పెద్దల సభ(Senate) ముందుకు రానుంది. అక్కడ రిపబ్లికన్ల ప్రాబల్యం ఉండటంతో.. బిల్లుకు ఒకేస్థాయిలో అనుకూల, వ్యతిరేక ఓట్లు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా..పెద్దల సభలో ఈ బిల్లుకు అడ్డంకి ఎదురవక తప్పదనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. 

Updated Date - 2022-07-31T03:03:03+05:30 IST